KL Rahul: ఇలాంటివాటికైనా నాకు మరింత ఎక్కువ చెల్లించాలి: కేఎల్‌ రాహుల్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ చేరింది. గతరాత్రి లీగ్ స్టేజ్‌లో కోల్‌కతాతో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో 2 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది...

Updated : 19 May 2022 11:26 IST

(Photo: KL Rahul Instagram)

ముంబయి: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ చేరింది. గతరాత్రి లీగ్ స్టేజ్‌లో కోల్‌కతాతో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో 2 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో అధికారికంగా ప్లేఆఫ్స్‌ చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 208/8కు పరిమితమైంది. దీంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 21 పరుగులు అవసరమైన వేళ రింకూ సింగ్‌ (40; 15 బంతుల్లో 2x4, 4x6) రెచ్చిపోయాడు. స్టాయినిస్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతికి బౌండరీ బాదిన అతడు తర్వాత వరుసగా రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి తరలించాడు. అలాగే నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రింకూ.. ఐదో బంతికి ఔటయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన వేళ ఉమేశ్‌ యాదవ్‌ బౌల్డయ్యాడు. దీంతో ఉత్కంఠభరితమైన క్షణాల్లో కోల్‌కతా 18 పరుగులు సాధించి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ ఇలా స్పందించాడు.

‘ఇటువంటి మ్యాచ్‌ల కోసం నాకు మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో ఇలాంటివే కొన్ని మ్యాచ్‌లు కోల్పోయాం. ఇలా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లు చాలా తక్కువ. కొన్ని చివరి ఓవర్‌ వరకు వెళ్లిండొచ్చు. అయితే, ఈ మ్యాచ్‌లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కచ్చితంగా మేం ఓడిపోయే మ్యాచ్‌లాగే అనిపించింది. అదే జరిగి ఉంటే కచ్చితంగా మేం సరిగ్గా ఆడలేదనే భావనతో వెనుదిరిగేవాళ్లం. ఈ సీజన్‌లో మా చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఘనంగా పూర్తి చేయడం బాగుంది. రెండు జట్ల ఆటగాళ్లు గొప్పగా ఆడినందువల్లే ఇలాంటి మ్యాచ్‌ ఆస్వాదించాము. స్టాయినిస్‌ చివరి రెండు బంతుల్లో తన ప్రణాళికలను అమలు చేసి విజయం సాధించడం గొప్ప విశేషం. మేం బ్యాటింగ్‌లో చాలా మెరుగ్గా ఆడాం. అయితే, మాపై కోల్‌కతా ఎదరుదాడి చేస్తుందని తెలుసు. ఇలాంటి విజయాలు ఆటగాళ్లకు మనోధైర్యాన్ని ఇస్తాయి. ఇక డికాక్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే నేను ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాను. అతడు చాలా క్లీన్‌గా బౌండరీలు బాదాడు. ఈ సీజన్‌లో మా ఆటగాళ్లు పలువురు కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అదే పని మేం ఈ మ్యాచ్‌లో చేశాం. చివర్లో లూయిస్‌ పట్టిన క్యాచ్‌ అమోఘం. అతడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. అయినా, ఈ రోజు అద్భతమైన క్యాచ్‌ అందుకున్నాడు. అతడికి ఈ రోజు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోయినా ఏదో ఒక విధంగా జట్టుకు ఉపయోగపడాలనే తాపత్రయం కనిపించింది. మోసిన్‌ ఖాన్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. త్వరలోనే అతడు టీమ్‌ఇండియా తరఫున ఆడతాడు’ అని రాహుల్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని