Hyderabad Vs Punjab : హైదరాబాద్‌ ఫీల్డర్ల ఘోర వైఫల్యం.. పంజాబ్‌ ఘన విజయం

 సుదీర్ఘంగా సాగుతున్న టీ20 మెగా టోర్నీ లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్ హైదరాబాద్‌, పంజాబ్ జట్ల మధ్య జరుగుతోంది.

Updated : 22 May 2022 23:40 IST

ముంబయి: ఫీల్డింగ్‌ వైఫల్యం, క్యాచ్‌ల డ్రాప్‌లతో హైదరాబాద్‌ చేజేతులా ఆఖరి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. టీ20 మెగా టోర్నీ చివరి లీగ్‌ దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో పంజాబ్ టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 157/8 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్‌ కేవలం 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. లియామ్‌ లివింగ్‌స్టోన్ (49*), శిఖర్ ధావన్‌ (39), జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్‌ ఖాన్‌ (19), జితేశ్‌ శర్మ (19) రాణించారు. లియామ్‌స్టోన్‌ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను హైదరాబాద్‌ ఫీల్డర్లు నేలపాలు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఫరూఖి 2.. సుందర్, సుచిత్, ఉమ్రాన్‌ మాలిక్ చెరో వికెట్ తీశారు.

ఓటమితో ఇంటిముఖం పట్టిన హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంతో ఈ సీజన్‌ను ముగించడం గమనార్హం. తొలి రెండు ఓటములు.. తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించడంతో ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అంతా భావించారు. అయితే మరోసారి వరుసగా ఐదు మ్యాచుల్లో పరాజయం పొంది ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఘనంగా వీడ్కోలు పలుకుదామనుకున్నా పంజాబ్‌ను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైంది. 


లక్ష్యం దిశగా పంజాబ్‌

పంజాబ్ లక్ష్యం దిశగా సాగుతోంది. హైదరాబాద్‌ బౌలర్లు అడపాదడపా వికెట్లు తీస్తున్నా తర్వాత వచ్చిన బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో శిఖర్ ధావన్‌ (31*), లియామ్‌ లివింగ్స్టోన్‌ (20*) ఉన్నారు. పంజాబ్ విజయానికి 60 బంతుల్లో ఇంకా 61 పరుగులు కావాలి.


ఛేదన ప్రారంభం..

పంజాబ్ లక్ష్య ఛేదనను ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనూ బెయిర్‌స్టో (23*) మూడు ఫోర్లు బాదాడు. ఇక రెండు ఓవర్‌లో కూడా రెండు బౌండరీలు కొట్టాడు. అయితే ఈ ఓవర్‌లోనే బెయిర్‌స్టో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఉమ్రాన్‌ వదిలేశాడు. అయితే ఫరూఖి వేసిన ఓవర్‌లో బెయిస్టో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజ్‌లో శిఖర్ ధావన్ (5*), షారుఖ్‌ ఖాన్‌ ఉన్నారు. పంజాబ్‌ విజయం సాధించాలంటే ఇంకా 17 ఓవర్లలో 130 పరుగులు చేయాలి.


హైదరాబాద్‌ స్కోరు 157/8

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓ మోస్తరు స్కోరును మాత్రమే సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 158 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ప్రియమ్‌ గార్గ్ (4), నికోలస్‌ పూరన్ (5) విఫలం కాగా.. అభిషేక్ శర్మ (43), రాహుల్ త్రిపాఠి (20), మార్‌క్రమ్‌ (21), వాషింగ్టన్ సుందర్ (25), రొమారియో షెఫెర్ట్ (26*) రాణించారు. సుందర్‌-షెఫెర్ట్‌ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే పంజాబ్ బౌలర్ల దెబ్బకు మిడిల్‌, చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకోవడంతో హైదరాబాద్‌ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హర్‌ప్రీత్ బ్రార్ 3, కగిసో రబాడ ఒక వికెట్ తీశారు.


పెవిలియన్‌ బాట పట్టిన బ్యాటర్లు

పంజాబ్‌ బౌలర్ల దెబ్బకు హైదరాబాద్‌ బ్యాటర్లు పెవిలియన్‌ బాట పడుతున్నారు. హైదరాబాద్ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ ఐదు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో వాషింగ్టన్ సుందర్‌, రొమారియో షెఫెర్డ్‌ ఉన్నారు. పూరన్‌ 5, మార్‌క్రమ్ 21, అభిషేక్ శర్మ (43) ఔటయ్యారు. హర్‌ప్రీత్ బ్రార్‌ కట్టుదిట్టంగా బంతులను విసిరాడు.


ఆచితూచి ఆడుతూ..

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆచితూచి ఆడుతోంది. పంజాబ్ బౌలర్లు పెద్దగా వికెట్లను తీయకపోయినా పరుగులను నియంత్రించారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (36*), మార్‌క్రమ్‌ (1*) ఉన్నారు. అంతకుముందు కాస్త దూకుడుగా ఆడిన రాహుల్ త్రిపాఠి (20) బ్రార్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 


బ్యాటింగ్ ప్రారంభం..

హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తుండటంతో హైదరాబాద్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కగిసో రబాడ బౌలింగ్‌లో ప్రియమ్ గార్గ్ (4) బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకొని మయాంక్‌ చేతిలో పడింది. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (10*), రాహుల్ త్రిపాఠి (4*) ఉన్నారు.


టాస్‌ నెగ్గిన భువనేశ్వర్‌

సుదీర్ఘంగా సాగుతున్న టీ20 మెగా టోర్నీ లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ ఫలితం అటు ప్లేఆఫ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. ఆయా జట్ల స్థానాల్లో మాత్రం మార్పు ఉంటుంది. వరుస ఓటములతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొన్న హైదరాబాద్‌, పంజాబ్‌ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్‌ ఎంచుకుని పంజాబ్‌కు బౌలింగ్‌ అప్పగించింది. కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీతో హైదరాబాద్‌ జట్టును భువనేశ్వర్ కుమార్‌ నడిపిస్తాడు. 

ప్రస్తుతం 13 మ్యాచుల్లో ఆరేసి విజయాలతో హైదరాబాద్‌, పంజాబ్‌ 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. పంజాబ్‌ ఏడో స్థానం, హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఆరో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఓడిన టీమ్‌ ఎనిమిదో స్థానంతోనే సీజన్‌ను ముగిస్తుంది. మరోవైపు కోల్‌కతా ఏడు స్థానానికి దిగజారుతుంది. 

జట్ల వివరాలు: 

హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్‌ పూరన్‌, మార్‌క్రమ్, రొమారియో షెఫెర్ట్, భువనేశ్వర్‌ కుమార్‌ (కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, జగదీశ్‌ సుచిత్, ఫరూఖి, ఉమ్రాన్ మాలిక్

పంజాబ్‌: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్‌ లివింగ్‌స్టోన్, మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్), షారుఖ్‌ ఖాన్, జితేశ్‌ శర్మ, హర్‌ప్రీత్‌ బ్రార్, నాథన్‌ ఎల్లిస్‌, ప్రేరక్ మాన్కండ్, కగిసో రబాడ, అర్ష్‌దీప్‌ సింగ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని