T20 League: సత్తా ఉండాలే కానీ.. ఎవరిపైనైనా గెలవచ్చు..!

బౌలింగ్‌లో సత్తా ఉండాలే కానీ, ఎలాంటి మ్యాచ్‌నైనా సొంతం చేసుకోవచ్చు. గతరాత్రి లఖ్‌నవూ, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూఇదే విషయం నిరూపితమైంది...

Updated : 30 Apr 2022 10:45 IST

మోస్తరు, స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకున్నారు..

బౌలింగ్‌లో సత్తా ఉండాలే కానీ, ఎలాంటి మ్యాచ్‌నైనా సొంతం చేసుకోవచ్చు. గతరాత్రి లఖ్‌నవూ, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే నిరూపితమైంది. ఈ సీజన్‌లో ‘డ్యూ’ ప్రభావం అధికంగా ఉండటంతో చాలా జట్లు భారీ స్కోర్లను సైతం అలవోకగా ఛేదించేస్తున్నాయి. అయితే, పలు సందర్భాల్లో కొన్ని జట్లు మోస్తరు లక్ష్యాలను కూడా చేరలేక చతికిల పడుతున్నాయి. అందుకు మెరుగైన బౌలింగ్‌ ఒక కారణమైతే.. ఇంకోటి పిచ్‌ పరిస్థితులు కలిసొస్తున్నాయి. అలా ఈ సీజన్‌లో సాధారణ స్కోర్లను కూడా కాపాడుకున్న జట్లు, వాటి విశేషాలు తెలుసుకుందాం.

చాహల్‌, బౌల్ట్‌ మాయాజాలం..

ఈ సీజన్‌లో తొలిసారి మోస్తరు స్కోరును కాపాడుకున్న జట్టు రాజస్థాన్‌. లఖ్‌నవూతో ఆడిన తన నాలుగో మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ మాయాజాలంతో రాజస్థాన్‌ 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 165/6 స్కోర్‌ సాధించింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా మధ్యలో షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (59*), అశ్విన్‌ (28) ఆదుకున్నారు. అయితే, లఖ్‌నవూ అంతకుముందే చెన్నైపై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఇదేం పెద్ద స్కోర్‌ కాదనుకున్నారు. కానీ, చాహల్‌ 4/41, ట్రెంట్ బౌల్ట్‌ 2/30 విజృంభించడంతో లఖ్‌నవూ 162/8 స్కోరుకే పరిమితమైంది. ఈ స్టేడియంలోని బౌండరీ లైన్‌ దగ్గరగా ఉండటంతో పరుగుల వరద పారించొచ్చు. అందువల్లే ఇక్కడ సగటు స్కోర్‌ 180పైనే నమోదవుతుంది. అలాగే ఛేదన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. కానీ, ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిందంటే అందుకు రాజస్థాన్‌ బౌలింగే కారణం.

షమి, రషీద్‌ఖాన్‌ ఆదుకున్నారు..

ఇక ఈ సీజన్‌లో రెండోసారి మోస్తరు స్కోరును కాపాడుకున్న జట్టు గుజరాత్‌. కోల్‌కతాతో ఆడిన తన ఏడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 156/9 స్కోరే సాధించింది. డీవైపాటిల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (67) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఈ పిచ్‌పై సగటు స్కోర్‌ 160 నుంచి 170 మధ్య నమోదవుతుంది. అయినా, గుజరాత్‌ తక్కవ స్కోరుకే పరిమితమవడంతో కోల్‌కతా తేలిగ్గానే ఛేదించేస్తుందనే నమ్మకం కలిగింది. అంతకుముందే ఆ జట్టు 170, 180, 200 స్కోర్లు సాధించింది. దీంతో కోల్‌కతా విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ, గుజరాత్‌ బౌలర్లు షమి 2/20, రషీద్‌ ఖాన్‌ 2/22, దయాల్‌ 2/42 అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టు 148/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో గుజరాత్‌ 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ పిచ్‌ నెమ్మదైందే అయినా గుజరాత్‌ నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగిందే.

కుల్‌దీప్‌సేన్‌, అశ్విన్‌ చెలరేగి..

పుణెలోని ఎంసీఏ మైదానం వేదికగా బెంగళూరుతో తలపడిన మరో మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌ తక్కువ స్కోర్‌ సాధించి విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో రాజస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. మధ్యలో రియాన్‌ పరాగ్‌ (56*) ఒక్కడే మెరిసినా ఆ జట్టు పెద్ద స్కోర్‌ సాధించింది లేదు. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేసింది. అయితే, బెంగళూరు కూడా అంతకుముందు 200కు పైగా స్కోర్లు సాధించడంతో ఈ స్వల్ప లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ జట్టు తడబడింది. కుల్‌దీప్‌ సేన్‌ 4/20, అశ్విన్‌ 3/17, ప్రసిద్ధ్‌ కృష్ణ 2/23 చెలరేగడంతో బెంగళూరు మరీ దారుణంగా ఓటమిపాలైంది. కెప్టెన్ డుప్లెసిస్‌ (23) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి 115 పరుగులకే ఆలౌటై రాజస్థాన్‌ 29 పరుగులతో విజయం సాధించింది. ఇక్కడ సగటు బ్యాటింగ్‌ స్కోర్‌ 160గా ఉండగా రెండు జట్లూ తక్కువ స్కోర్లే సాధించాయని అర్థమవుతోంది.

మోహ్‌సిన్‌, కృనాల్‌ రాణించి..

తాజాగా గతరాత్రి పుణె వేదికగా లఖ్‌నవూ, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా నామమాత్రమైన స్కోర్లే నమోదు చేసింది. లఖ్‌నవూ తొలుత బ్యాటింగ్‌ చేసి 153/8 స్కోరే సాధించింది. ఓపెనర్‌ డికాక్‌ (46) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్లో పిచ్‌పై పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లఖ్‌నవూ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు తంటాలుపడ్డారు. రబాడ 4/38 గొప్పగా బౌలింగ్‌ చేశాడు. మరోవైపు పంజాబ్‌ అంతకుముందే పలుమార్లు 180, 190, 200కి పైగా స్కోర్లు సాధించడంతో ఇది కూడా గెలుస్తుందని అనుకున్నారు. కానీ, లఖ్‌నవూ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. మోహ్‌సిన్‌ ఖాన్‌ 3/24, చమీరా 2/17, కృనాల్‌ పాండ్య 2/11 అత్యుత్తమ బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మయాంక్‌ (25), బెయిర్‌స్టో (32) మెరిసినా చివర్లో ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్‌ లేక 133/8కే పరిమితమైంది. దీంతో లఖ్‌నవూ 20 పరుగుల తేడాతో ఊహించని విజయం తన ఖాతాలో వేసుకుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని