Quinton de Kock: ఇది నమ్మశక్యం కానిది.. ఇలాంటి విజయాలు జట్టుకు స్ఫూర్తినిస్తాయి: డికాక్

చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడం నమ్మశక్యం కాని విషయమని లఖ్‌నవూ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి విజయాలు జట్టుకు స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయన్నాడు...

Published : 01 Apr 2022 12:37 IST

(Photo: Quinton de Kock Instagram)

ముంబయి: చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడం నమ్మశక్యం కాని విషయమని లఖ్‌నవూ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి విజయాలు జట్టుకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. గతరాత్రి చెన్నై నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ నాలుగు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (40; 26 బంతుల్లో 2x4, 3x6)తో కలిసి డికాక్‌ (61; 45 బంతుల్లో 9x4) చెన్నై బౌలర్లను ఉతికారేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అనంతరం ఎవిన్‌ లూయిస్‌ (55 నాటౌట్‌; 23 బంతుల్లో 6x4, 3x6), ఆయుష్‌ బదోనీ (19 నాటౌట్‌; 9 బంతుల్లో 2x6) గొప్పగా పోరాడి జట్టుకు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించారు.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం డికాక్‌ మాట్లాడుతూ.. ఇది నమ్మశక్యం కాని విజయమని పేర్కొన్నాడు. ‘ఇదో గొప్ప విజయం. మేం గెలవాలనే పట్టుదలతో పోరాడాం. చివరికి విజయం సాధించడం అద్భుతంగా ఉంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మేం ఛేదించొచ్చని ముందే అనుకున్నాం. ఇన్నింగ్స్‌ ఆరంభించాక రెండు, మూడు ఓవర్ల తర్వాత ఈ వికెట్‌పై అన్ని పరుగులు చేయొచ్చని తెలుసుకున్నాం. నేనైతే ఈ వికెట్‌పై అంత లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదనుకున్నా. అయితే, పరుగులు చేసేందుకు తొందరపడలేదు. కాస్త కుదురుకున్నాక ధాటిగా ఆడొచ్చని అనుకున్నా. నాతో పాటు మా యువకులు కూడా బాగా ఆడారు. లూయిస్‌, బదోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేశారు. వారిద్దరూ చివర్లో దంచికొట్టారు. చివరికి మేం విజయం సాధించడంతో జట్టులోని ప్రతి ఒక్కరూ సంతోషంలో మునిగి తేలారు’ అని డికాక్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని