Virat Kohli: కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలి: మహ్మద్‌ రిజ్వాన్

టీమ్‌ఇండియా, బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌ అందుకోవాలని పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Published : 13 May 2022 02:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌ అందుకోవాలని పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసం ప్రార్థిస్తానని కూడా చెప్పాడు. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో కోహ్లీ 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 216 పరుగులే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 19.64గా నమోదైంది. ఇది కోహ్లీ టీ20 లీగ్‌ కెరీర్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శన. ఈ నేపథ్యంలోనే రిజ్వాన్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు.

‘కోహ్లీ ఛాంపియన్‌. అయితే, ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అందుకోసం నేను ప్రార్థిస్తా. ఎందుకంటే అతడు చాలా కష్టపడే ఆటగాడు. ఆటగాళ్లకు కొన్నిసార్లు క్లి్ష్ట పరిస్థితులు ఎదురైనా తర్వాత తిరిగి పుంజుకుంటారు. క్రికెట్‌లో ఎంతో మంది సెంచరీలు కొట్టారు. అవి అలాగే జరిగిపోతుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడి కోసం నేను దేవుడిని మాత్రమే మొక్కగలను. తన కష్టంతో పరిస్థితుల్ని మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’ అని రిజ్వాన్‌ తన అభిప్రాయం వెల్లడించాడు. కాగా, ఈ టీ20 టోర్నీ తర్వాత టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాతో ఆడే టీ20 సిరీస్‌కు సెలెక్షన్‌ కమిటీ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆపై ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడు రాణించేందుకు ఈ విరామం ఉపయోగపడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని