Top Paid Cricketers: రేటులో ఖరీదు.. మరి ఆటలో..?

ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు నిర్వహించిన మెగా వేలంలో పలువురు స్వేదేశీ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. దీంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి...

Updated : 31 May 2022 15:42 IST

ఈ భారత క్రికెటర్లు ఎలా ఆడారంటే..?

ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు నిర్వహించిన మెగా వేలంలో పలువురు స్వేదేశీ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. దీంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాళ్ల నుంచి ఈ సీజన్‌లో పరుగుల వరద, వికెట్ల వేట చూస్తామని ఆశించిన అభిమానులకు కాస్త నిరాశే ఎదురైంది. అలా ఈ సీజన్‌లో అభిమానుల అంచనాలు అందుకోలేకపోయిన ఆటగాళ్లెవరంటే..

డైనమైట్‌లా పేలతాడనుకుంటే..

(Photo: Ishan Kishan Instagram)

ఈ సారి వేలంలో దేశీయ ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌. ఒంటి చేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఈ సీజన్‌లో డైనమైట్‌టా పేలతాడనుకుంటే ఆరంభంలో ఘోరంగా విఫలమయ్యాడు. సగం మ్యాచ్‌ల తర్వాత ఫామ్‌లోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అతడు అమ్ముడుపోయిన ధర(రూ.15.25 కోట్లు)కు న్యాయం చేయలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 32.15 సగటుతో 120.11 స్ట్రైక్‌రేట్‌తో 418 పరుగులే చేశాడు. కానీ, అతడి నుంచి అభిమానులు మరో లెవెల్‌ ఆటను ఆశించారు.

కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ కూడా..

(Photo: Shreyas Iyer Instagram)

ఇక వేలంలో మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌. కోల్‌కతా అతడిపై నమ్మకం ఉంచి రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే తనకున్న కెప్టెన్సీ అనుభవంతో నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ, గతేడాది రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈసారి కనీసం ప్లేఆఫ్స్‌ కూడా చేరలేకపోయింది. ముఖ్యంగా శ్రేయస్ అటు సారథిగా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 30.85 సగటుతో 134.56 స్ట్రైక్‌రేట్‌తో 401 పరుగులే చేశాడు. దీంతో అతడు తీసుకునే సొమ్ముకు తగిన న్యాయం చేయలేదనే చెప్పాలి. 

పెద్దగా ప్రభావం చూపలేదు కానీ..

(Photo: Shardul Thakur Instagram)

శార్ధూల్‌ ఠాకూర్‌ ఈసారి వేలంలో రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేస్తూ నిలకడగా వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆటగాడు. అవసరమైతే బ్యాట్‌తోనూ పరుగులు చేయగల సమర్థుడు. దీంతో ఈసారి వేలంలో అతడిపై నమ్మకం ఉంచిన దిల్లీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే, శార్దూల్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బౌలింగ్‌ పరంగా 15 వికెట్లు తీసి కాపాడుకున్నాడు. కానీ, బ్యాటింగ్‌లో 15 సగటుతో 120 పరుగులే చేసి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడు తీసుకునే డబ్బుకు మోస్తరు న్యాయం చేశాడు.

గతేడాది మెరిసినట్లు మెరవలేదు..

(Photo: Harshal Patel Instagram)

గతేడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను ఈసారి అదే జట్టు మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు 32 వికెట్లు తీసి టోర్నీ చరిత్రలో రెండోసారి ఆ ఘనత సాధించిన బౌలర్‌గా నిలిచారు. కానీ, ఈ సీజన్‌లో హర్షల్‌ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ఈసారి 7.66 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేసినా 19 వికెట్లే తీశాడు. దీంతో హర్షల్‌ ఈసారి అందుకునే సొమ్ముకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు.

వీళ్లిద్దరూ ఎలా ఆడారంటే..

ఇక రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, లఖ్‌నవూ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌లు ఈ సీజన్‌లో చెరో 10 కోట్లకు అమ్ముడుపోయారు. అయితే, వీరిద్దరూ తాము తీసుకున్న సొమ్ముకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. అవేశ్‌ 18 వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్‌ 19 వికెట్లు తీశాడు. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌ చేరడంలో ప్రసిద్ధ్‌, అవేశ్‌ తమవంతు కృషి చేశారు.

* ఇక దీపక్‌ చాహర్‌ను చెన్నై టీమ్‌ ఈసారి మెగా వేలంలో రూ.14 కోట్లకు దక్కించుకుంది. కానీ, అతడు టోర్నీ ప్రారంభానికి ముందు గాయపడటంతో ఈ సీజన్‌లో ఆడలేకపోయాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని