Rashid Khan:టీ20 లీగ్‌ ఫైనల్‌లో కచ్చితంగా ‘స్నేక్‌ షాట్’ ఆడతా: రషీద్‌ఖాన్‌

టీ20 లీగ్‌లో గత సీజన్‌ వరకు హైదరాబాద్‌కు ఆడిన రషీద్‌ఖాన్‌ ఈ ఏడాది కొత్త జట్టు గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు అతడిని గుజరాత్ రూ.15 కోట్లకు దక్కించుకుంది. అయితే, తన స్పిన్‌ మాయాజాలంతో బ్యాటర్లను

Published : 29 May 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో గత సీజన్‌ వరకు హైదరాబాద్‌కు ఆడిన రషీద్‌ఖాన్‌ ఈ ఏడాది కొత్త జట్టు గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు అతడిని గుజరాత్ రూ.15 కోట్లకు దక్కించుకుంది. అయితే, తన స్పిన్‌ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించే రషీద్‌ఖాన్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న భారత టీ20 లీగ్‌లోనూ ఈ అఫ్గాన్‌ స్పిన్నర్‌ బ్యాట్‌తో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే  క్రికెట్‌లో రషీద్‌ ఓ కొత్త షాట్‌ను ఆవిష్కరించాడు. ఆ షాట్‌కు ‘స్నేక్‌ షాట్‌’అనే పేరు కూడా పెట్టాడు. 

ఇదిలా ఉండగా, ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగబోయే టైటిల్‌ పోరులో గుజరాత్‌, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్‌ఖాన్ మాట్లాడాడు. తన  ‘స్నేక్ షాట్’ గురించి అభిమానుల నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని రషీద్ పేర్కొన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే ఆ షాట్‌ని తప్పకుండా ఆడతానని చెప్పాడు. ‘నేను ఇంతకుముందు కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నా. దీనికి కారణం నా ఆత్మవిశ్వాసం. కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఆటగాళ్లందరూ ఆత్మవిశ్వాసం అందించారు. నేను రాణించగలనని వారు నమ్మారు. ఒక ఆటగాడికి కావలసిన శక్తి ఇదే. ఆ శక్తిని వారంతా నాకు ఇచ్చారు. ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నా. గతంలో కంటే నాకు ఇప్పుడు ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం లభిస్తోంది. కాబట్టి.. ఆఖర్లో జట్టుకు కొన్ని పరుగులు అందించగలనని ప్రతి ఒక్కరూ నాపై నమ్మకం పెట్టుకున్నారు. జట్టుకు అవసరమైనప్పడు 20-25 పరుగులు చేయగలననే నమ్మకం ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే కచ్చితంగా స్నేక్‌ షాట్‌ ఆడతా’ అని రషీద్‌ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని