Ravi Shastri: దిల్లీ జట్టు ఆటగాళ్లకు ఆమాత్రం తెలియదా: రవిశాస్త్రి మండిపాటు

గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ విషయంలో దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు...

Published : 23 May 2022 01:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ విషయంలో దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జాబితాలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి చేరాడు. ఒకడుగు ముందుకేసి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టిమ్‌డేవిడ్‌ లాంటి ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ ఖాతా కూడా తెరవకముందే ఔటయ్యే అవకాశం వస్తే వినియోగించుకోరా? అప్పటికింకా చేతిలో ఐదు ఓవర్లే ఉండగా రెండు రివ్యూలున్నా.. వాటిని ఉపయోగించుకునే కనీస విషయం తెలియదా? అంటూ మండిపడ్డాడు.

‘దిల్లీ ఆటగాళ్లకు ఆ మాత్రం తెలియదా? డేవిడ్‌ బ్యాట్‌ అంచున తాకి వెళ్లిన బంతి కీపర్‌ చేతుల్లో పడినప్పుడు పంత్‌, శార్ధూల్‌ను వదిలేస్తే.. ఇతర ఆటగాళ్లు ఏం చేస్తున్నారు. అప్పటికి గేమ్‌లో ఇంకా ఐదు ఓవర్లే మిగిలి ఉన్నాయి. దిల్లీ వద్ద రెండు రివ్యూలు మిగిలాయి. డేవిడ్‌ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు బంతికే ఒక వికెట్‌ దక్కింది. దీంతో అతడి వికెట్‌తో కూడా దక్కితే రెండోదయ్యేది. అప్పుడు దిల్లీ జట్టే పైచేయి సాధించేది. అలాంటి సమయంలో రివ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదా? దానికి ఏం ఇంగిత జ్ఞానం కావాలి? ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇది వాళ్లు చేజేతులా చేసుకున్నదే. ఈ తప్పిదం వల్ల ఆటగాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఇది ప్లేఆఫ్స్‌కు చేరవేసే కీలక మ్యాచ్‌. అలాంటి ముఖ్యమైన దాన్ని కోల్పోయారు. ఇక్కడ ఎవర్నీ నిందించాల్సిన అవసరం లేదు. వాళ్లని వాళ్లే నిందించుకోవాలి. ఈ మ్యాచ్‌లో ముంబయి గెలిచిందని చెప్పేకన్నా దిల్లీనే స్వయంగా ఓడిందని అనాలి’ అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అలాంటివి జరుగుతుంటాయి: రోహిత్‌

మరోవైపు ఇదే విషయంపై ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. అప్పుడప్పుడు ఆటలో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పాడు. పంత్‌ మంచి కెప్టెన్‌ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోతాయని, అదంతా సహజమని కొట్టిపారేశాడు. తానూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. అదే విషయాన్ని పంత్‌కు వివరించానన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని