Ravindra Jadeja: చెన్నై టీమ్‌తో జడేజాకు విభేదాలా.. అందుకే జట్టు వీడాడా..?

చెన్నై టీమ్‌తో రవీంద్ర జడేజాకు విభేదాలు ఏర్పాడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కటెముకల్లో గాయం కారణంగా అతడు మిగిలిన సీజన్‌లో ఆడటం...

Published : 12 May 2022 10:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై టీమ్‌తో రవీంద్ర జడేజాకు విభేదాలు ఏర్పాడ్డాయనే ప్రచారం జరుగుతోంది. పక్కటెముకల్లో గాయం కారణంగా అతడు మిగిలిన సీజన్‌లో ఆడటం లేదని చెన్నై టీమ్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు ఆ జట్టు.. జడేజాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందని, ఇప్పుడు ఏకంగా జట్టులో నుంచే తొలగించిందని అభిమానులు మండిపడుతున్నారు.

అసలేం జరిగింది..

10 ఏళ్లుగా చెన్నై జట్టులో అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన జడేజా.. తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన కెప్టెన్‌ ధోనీ, జట్టు యాజమాన్యం ఈ సీజన్‌కు ముందు రూ.16 కోట్లు వెచ్చించి మరీ అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలోనే టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ పగ్గాలు సైతం అందజేసింది. అయితే, నాయకత్వ బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా ఈ సీజన్‌లో చెన్నైని సరిగ్గా నడిపించలేకపోయాడు. మరోవైపు ఆటగాడిగానూ విఫలమయ్యాడు. దీంతో కొద్ది రోజుల క్రితమే జడేజా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాడని, ధోనీ తిరిగి బాధ్యతలు చేపడతాడని చెన్నై టీమ్‌ ప్రకటించింది.

గాయం నిజమేనా..?

ఇక జడేజా కెప్టెన్సీ వదులుకున్నాక మే 4న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫీల్డింగ్‌ చేస్తుండగా ఒక క్యాచ్‌ అందుకునే క్రమంలో పక్కటెముకలకు గాయమైంది. కానీ, ఆ రోజు జడేజా ఫీల్డింగ్‌ కొనసాగించి, తర్వాత బ్యాటింగ్‌ కూడా చేశాడు. అనంతరం మే 8న దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో తుది జట్టులో లేడు. గాయం కారణంగా అతడు ఆడట్లేదని జట్టు యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చెన్నై జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చేసిందని, ఇప్పుడు జట్టు నుంచి తొలగించిందని అభిమానులు మండిపడుతున్నారు. తర్వాత అతడు కూడా చెన్నైని అన్‌ఫాలో చేశాడని అంటున్నారు.

చెన్నై టీమ్‌ ఏమంటోంది?

జడేజాకు నిజంగానే చెన్నై జట్టుతో చెడిందా అని ఆ జట్టు సీఈవో కాశీవిశ్వనాథన్‌ను అడిగితే అలాంటిదేమీ లేదన్నాడు. సామాజిక మాధ్యమాలను తాను వాడనని, అక్కడ ఏం జరుగుతోందనే విషయాలు తనకు తెలియవని చెప్పాడు. కానీ, జడేజా భవిష్యత్తులో కచ్చితంగా చెన్నైతోనే కొనసాగుతాడని వెల్లడించాడు. ప్రస్తుతం అతడు గాయపడ్డాడని, వైద్యుల సూచన మేరకే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడలేకపోతున్నాడని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని