Hyderabad: హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఇక లేనట్లే.. కారణాలేంటంటే..?

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ దారులు మూసుకుపోయాయి...

Published : 16 May 2022 01:54 IST

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. సాంకేతికంగా ఇంకా అవకాశం ఉన్నా.. అది చాలా కష్టమే. గతరాత్రి కోల్‌కతాతో ఓటమి తర్వాత 10 పాయింట్లతోనే నిలిచిన హైదరాబాద్‌ ఈసారి కూడా ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు వైఫల్యానికి గల కారణాలేంటంటే..

అవే తప్పటడుగులు..

హైదరాబాద్‌ చేసిన అతిపెద్ద తప్పు మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ను వదులుకోవడం. అతడు గతేడాది తప్ప ప్రతి సీజన్‌లోనూ విశేషంగా రాణించాడు. మరోవైపు ఈ సీజన్‌లోనూ దిల్లీ తరఫున ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో ప్రస్తుతం (427) మూడో స్థానంలో దూసుకుపోతున్నాడు. అలాంటి ఆటగాడిని ఒక్క సీజన్‌లో ఆడలేనంత మాత్రాన వదులుకోవడం నిజంగా పెద్ద తప్పిదమే. మరోవైపు స్పిన్‌ మాంత్రికుడు రషీద్‌ఖాన్‌నూ వదిలేసుకోవడం కూడా జట్టుకు భారీ నష్టాన్నే మిగిల్చింది. అతడు గుజరాత్‌ తరఫున బౌలింగ్‌తో (15) వికెట్లు తీస్తూనే లోయర్‌ ఆర్డర్‌లో అవసరమైనప్పుడు దంచికొడుతున్నాడు. దీంతో వీరిద్దర్నీ వదిలేసుకోవడం హైదరాబాద్‌ వైఫల్యానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వార్నర్‌, రషీద్‌ ఈ జట్టులోనే ఉండి ఇప్పుడు వేరే జట్ల తరఫున ఆడుతున్నట్లు ఆడి ఉంటే పరిస్థితులు కచ్చితంగా మరోలా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు.

లోపించిన వ్యూహాలు..

ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలోనూ ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి ఆటగాళ్లను తీసుకోవాలి.. ఎవరికి ఎంత వెచ్చించాలనే విషయాలపై ఏమాత్రం వ్యూహాలు రచించలేదని స్పష్టంగా తెలుస్తోంది. కేన్‌ విలియమ్సన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్నా నటరాజన్‌, భువనేశ్వర్‌ను మళ్లీ కొనుగోలు చేయడం మంచి విషయమే. అయితే, కొందరు ఆటగాళ్లపై అతి నమ్మకం ఉంచిన హైదరాబాద్‌ టీమ్‌ భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. తీరా ఆ క్రికెటర్లు తాము తీసుకునే సొమ్ముకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు. అందులో వాషింగ్టన్‌ సుందర్‌ (8.75 కోట్లు), నికోలస్‌ పూరన్‌ (10.75 కోట్లు), రోమారియో షెపర్డ్‌ (7.75). ఇక అభిషేక్‌ శర్మ (6.5 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి (8.5) లాంటి ఆటగాళ్లు కూడా భారీ మొత్తం దక్కించుకున్నా ఫర్వాలేదనిపించారే తప్ప పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోవడంతో అవి మరింత రెట్టింపయ్యాయి.

విలియమ్సన్‌ కూడా విఫలం..

గతేడాది సీజన్‌ మధ్యలో వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించి అర్ధాంతరంగా కేన్‌ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అప్పటికి వార్నర్‌ సారథ్యంలో హైదరాబాద్‌ తొలి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించింది. అయితే, కెప్టెన్సీలో మార్పులు చేశాక కూడా జట్టులో ఎలాంటి ప్రభావం లేకపోయింది. విలియమ్సన్‌ నేతృత్వంలోనూ ఘోరంగా విఫలమైంది. అతడి సారథ్యంలో 8 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. దీంతో హైదరాబాద్‌ కెప్టెన్‌గా విలియమ్సన్‌ కూడా పెద్దగా ఉపయోగపడలేదని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు బ్యాట్స్‌మన్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 18.91 సగటుతో 208 పరుగులే చేశాడు.

ఫినిషర్‌, స్పిన్‌ బౌలింగ్‌ లేక..

షినిషర్లుగా కొన్ని మ్యాచ్‌ల్లో నికోలస్‌ పూరన్‌, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, శశాంక్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి ఆటగాళ్లు అడపాదడపా రాణించినా తర్వాత కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేశారు. తొలి రెండు ఓటముల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడంలో వీళ్లే కీలకపాత్ర పోషించారు. కానీ, గత ఐదు మ్యాచ్‌ల్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడలేక చతికిల పడ్డారు. రోమియో షపర్డ్‌ లాంటి ఆటగాడిని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఆడించారు. మరోవైపు స్పిన్‌ విభాగంలో భూతద్దం పెట్టి వెతికినా నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోయాడు. అయితే, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి పేసర్లే అంత ఇంతో నెట్టుకొచ్చారు. చివరి ఐదు మ్యాచ్‌ల్లో జట్టు సమష్టిగా విఫలమైంది. కేవలం అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి మాత్రమే ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున ఆకట్టుకున్నారు. ఇవన్నీ కలగలిసి చివరికి హైదరాబాద్‌ గతేడాది లాగే ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటి ముఖం పడుతోంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని