Rohit Sharma: ఎక్కడో ఓ చోట అదృష్టం కలిసిరావాలి: రోహిత్ శర్మ

టీ20 లీగ్‌లో భాగంగా గతరాత్రి గుజరాత్‌తో తలపడిన మ్యాచ్‌లో ఆఖరి క్షణాల్లో విజయం సాధించడం సంతోషంగా ఉందని ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు...

Published : 07 May 2022 10:01 IST

ముంబయి: టీ20 లీగ్‌లో భాగంగా గతరాత్రి గుజరాత్‌తో తలపడిన మ్యాచ్‌లో ఆఖరి క్షణాల్లో విజయం సాధించడం సంతోషంగా ఉందని ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు రెండో విజయం సాధించడంపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. చివర్లో మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసిందని, అయితే.. విజయం సాధించడం తనకు సంతృప్తినిచ్చిందని తెలిపాడు. ఎక్కడో ఓ చోట అదృష్టం కలిసిరావాలాన్నాడు. తమ ఆటగాళ్లు ప్రతి ఒక్కరు బాగా ఆడారని, సుమారు 20 పరుగులు తక్కువ చేశామని చెప్పుకొచ్చాడు.

‘మేం ప్రారంభించిన తీరుకు సుమారు 20 పరుగులు తక్కువ చేశామనిపించింది. మిడిల్‌ ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయాం. ఆ సమయంలో గుజరాత్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మా ఇన్నింగ్స్‌ను టిమ్‌డేవిడ్‌ గొప్పగా ముగించాడు. ఈ మ్యాచ్‌ గెలవడం కష్టమే అనుకున్నా చివరివరకూ పోరాడటంతో విజయం సాధించాం. దీంతో చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్‌ జరిగేకొద్దీ అనేక పరిస్థితులు ప్రభావం చూపుతాయి. అదృష్టంకొద్దీ నాకు ఈ మ్యాచ్‌లో పలువురు మంచి బౌలర్లు దొరికారు. దీంతో వారిని సమర్థంగా వినియోగించుకున్నా. మా బౌలింగ్‌ యూనిట్‌ నుంచి మెరుగైన ప్రదర్శన వచ్చింది. పలు మ్యాచ్‌ల్లో సామ్స్‌ విఫలమవడంతో చాలా ఒత్తిడిలో ఉన్నాడు. అయితే, అతడు ఎలాంటి బౌలరో నాకు బాగా తెలుసు. అలాంటి ఆటగాళ్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమైన విషయం’ అని రోహిత్‌ వివరించాడు.

ఇక గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య మాట్లాడుతూ తాము ఏ రోజైనా ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు సాధించగలమని, అయితే.. ఈ మ్యాచ్‌లో రెండు రనౌట్‌లే తమ ఓటమికి కారణమని చెప్పాడు. అలాగే టీ20ల్లో వికెట్లు కోల్పోతే మ్యాచ్‌లో వెనుకపడినట్లేనని తెలిపాడు. 19.3 ఓవర్ల దాకా తాము బాగానే ఆడామని, కానీ.. వికెట్లు కోల్పోవడమే తమ కొంప ముంచిందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ముంబయి ఆరంభించిన తీరుకు ఆ జట్టు 200పై చిలుకు పరుగులు చేస్తుందని భావించినట్లు చెప్పాడు. తమ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వాళ్లని కట్టడి చేశారన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని