Sunil Gavaskar: ధోనీ వీడ్కోలు పలుకుతాడా? గావస్కర్‌ ఏమంటున్నాడు..!

చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఇంకా క్రికెట్‌ ఆడాలనే ఆశ ఉందని, అందుకు నిదర్శనం ఈ సీజన్‌లో అతడు ఆడిన విధానమే అని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 13 May 2022 16:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఇంకా క్రికెట్‌ ఆడాలనే ఆశ ఉందని, అందుకు నిదర్శనం ఈ సీజన్‌లో అతడు ఆడిన విధానమేనని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. చెన్నై గతరాత్రి ముంబయి చేతిలో ఓడటంతో ఈ సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ధోనీ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గావస్కర్‌ తన అభిప్రాయం వెల్లడించాడు.

‘ఈ సీజన్‌లో ధోనీ ఆడిన విధానం చూడండి. అతడికి ఇంకా ఆడాలనే ఇష్టం బలంగా ఉంది. వికెట్ల మధ్య అతడు పరుగెడుతున్న విధానం చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల చెన్నై ఆడేటప్పుడు రెండు, మూడు వికెట్లు పడగానే.. అతడికి ఆడే అవకాశం వచ్చిందనే విషయాన్ని గుర్తించాడు. పలు సందర్భాల్లో మనం ఈ విషయాన్ని గమనించాం. దీనిని బట్టి చూస్తే ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడని తెలుస్తోంది. 2020 సీజన్‌లో చెన్నై ఆఖరి మ్యాచ్‌ పూర్తయ్యాక.. అతడు ఈ టీ20 లీగ్‌కు వీడ్కోలు పలుకుతాడా అని అడిగినప్పుడు కూడా కచ్చితంగా కాదనే సమాధానం చెప్పాడు’ అని గావస్కర్‌ వివరించాడు.

మరోవైపు ధోనీ ఇటీవల హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ సీజన్‌లో తొలిసారి కెప్టెన్సీ చేసినప్పుడు కూడా అతడికి ఇదే ప్రశ్న తలెత్తింది. వచ్చే ఏడాది చెన్నై జట్టులో ఆడతారా లేదా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ‘కచ్చితంగా మీరు నన్ను పసుపు రంగు జెర్సీలో చూస్తారు. కానీ, అది ఆటగాడిగానా లేక ఇతర పాత్రలోనా అనేది వేరే విషయం అని తెలివిగా బదులిచ్చాడు. మరోవైపు మాథ్యూ హేడెన్‌, షోయబ్‌ అక్తర్‌ లాంటి దిగ్గజాలు కూడా ధోనీ ఆడాలనుకుంటే వచ్చే సీజన్‌లో కొనసాగవచ్చని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని