T20 Challenge : హర్మన్‌ టీమ్‌దే టైటిల్‌

హర్మన్‌ ప్రీత్‌ కౌర్ జట్టు అదరగొట్టింది. మహిళల టీ20 ఛాలెంజ్‌ను మరోసారి గెలుచుకుంది. నాలుగు పర్యాయాల్లో మూడోసారి విజేతగా నిలిచి ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఫైనల్‌ను...

Updated : 29 May 2022 02:30 IST

మూడోసారి మహిళల టీ20 ఛాలెంజ్‌ సొంతం

పుణె: హర్మన్‌ ప్రీత్‌ కౌర్ జట్టు అదరగొట్టింది. మహిళల టీ20 ఛాలెంజ్‌ను మరోసారి గెలుచుకుంది. నాలుగు పర్యాయాల్లో మూడోసారి విజేతగా నిలిచి ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఫైనల్‌ను వొల్వార్ట్‌ (65 నాటౌట్‌; 40 బంతుల్లో 5×4, 3×6) అద్భుత పోరాటంతో రసవత్తరంగా మారింది. ముగింపు తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి విజేత హర్మన్‌ జట్టే అయినా.. దీప్తి శర్మ టీమ్‌ ప్రతిఘటన కూడా అభిమానులను ఆకట్టుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని జట్టు నాలుగు పరుగుల తేడాతో నెగ్గి టైటిల్‌ను చేజిక్కించుకుంది. డాటిన్‌ (62; 44 బంతుల్లో 1×4, 4×6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43; 29 బంతుల్లో 1×4, 3×6) చెలరేగడంతో మొదట 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. దీప్తి శర్మ (2/20), క్రాస్‌ (2/29), సిమ్రన్‌ (2/30) బంతితో రాణించారు. వొల్వార్ట్‌ అదరగొట్టినా.. దీప్తి శర్మ 8 వికెట్లకు 161 పరుగులే చేయగలిగింది. నిజానికి మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందని ఎవరూ అనుకోలేదు. ఛేదనలో 11 ఓవర్లలో 64 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోవడంతో హర్మన్ జట్టు విజయం తేలికే అనిపించింది. కానీ పట్టుదలగా నిలిచిన వొల్వార్ట్‌ క్రమంగా జోరు పెంచి స్కోరు బోర్డును నడిపించింది. మరోవైపు నుంచి స్నేహ్‌ రాణా (15), రాధ (0), క్రాస్‌ (13) ఔటయ్యారు. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన పరిస్థితి. వొల్వార్ట్‌ దూకుడు మీదున్నా విజయావకాశాలు చాలా తక్కువే. కానీ సిమ్రన్‌ (20 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4, 1×6) కూడా చెలరేగిపోవడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. 18వ ఓవర్లో వొల్వార్డ్‌, సిమ్రన్‌ చెరో సిక్స్‌ బాదారు. పూజ వేసిన తర్వాతి ఓవర్లో వొలార్డ్‌ ఒక ఫోర్‌, సిమ్రన్‌ మూడు ఫోర్లు బాదేశారు. చివరి ఓవర్లో (ఎకిల్‌స్టోన్‌) వెలాసిటీ 17 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉత్కంఠ తీవ్రమైంది. పైగా తొలి బంతికే వొల్వార్ట్‌ సిక్స్‌ బాదింది. దీంతో వెలాసిటీనే గెలిచేలా కనిపించింది. కానీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఎకిల్‌స్టోన్‌ తర్వాతి అయిదు బంతుల్లో ఆరు పరుగులే ఇవ్వడంతో హర్మన్‌ జట్టు విజేతగా నిలిచింది. అలాన కింగ్‌ (3/32), ఎకిల్‌స్టోన్‌ (2/28), డాటిన్‌ (2/28) చక్కగా బౌలింగ్‌ చేశారు. నాలుగు సార్లు మహిళల టీ20 ఛాలెంజ్‌ టోర్నీ జరగగా.. హర్మన్‌ టీమ్‌ గెలవడం ఇది మూడోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని