gujarat VS chennai: అదరగొట్టేసిన మిల్లర్‌ .. రషీద్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

సన్‌డేలో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొత్త కుర్రాళ్లతో...

Updated : 17 Apr 2022 23:29 IST

ఉత్కంఠభరిత పోరులో చెన్నైపై గుజరాత్‌ విజయం

పుణె: చివరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్‌ (94*) చివరి వరకు క్రీజ్‌లో ఉండి గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఏడు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. మిల్లర్‌తో పాటు కెప్టెన్‌ రషీద్ ఖాన్‌ (40) వీరోచిత బ్యాటింగ్‌ చేశాడు. దీంతో గుజరాత్‌ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు చెన్నై ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో 3, తీక్షణ 2.. ముకేశ్‌, జడేజా చెరో వికెట్ తీశారు. క్రిస్‌ జోర్డాన్‌ (0/58) భారీగా పరుగులు సమర్పించడంతో చెన్నై ఓటమిబాట పట్టాల్సి వచ్చింది.


ధాటిగా మిల్లర్‌

గుజరాత్, చెన్నై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం గుజరాత్‌ 15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్‌ (63*), రషీద్ ఖాన్‌ (4*) ఉన్నారు. ఇంకా 30 బంతుల్లో 62 పరుగులు చేయాలి. అయితే గుజరాత్‌ విజయం డేవిడ్‌ మిల్లర్‌పైనే ఆధారపడి ఉంది. భారీ హిట్టింగ్‌ చేయగలిగే సత్తా మిల్లర్‌కు మాత్రమే ఉంది.


నాలుగు వికెట్లు డౌన్‌..

గుజరాత్ ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు ముగిశాయి. చెన్నై బౌలర్ల ధాటికి ప్రస్తుతం గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్ (27*), రాహుల్ తెవాతియా (2*) ఉన్నారు. టాప్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో గుజరాత్‌ కష్టాల్లో పడినట్లు అనిపిస్తోంది. గుజరాత్ విజయానికి ఇంకా 60 బంతుల్లో 112 పరుగులు కావాలి.


బ్యాటర్ల తడబాటు

చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటింగ్‌లో తడబడతోంది. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (0), రెండో ఓవర్‌లో శంకర్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. 4వ ఓవర్‌లో అభినవ్‌ మనోహర్‌ (12) కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో 20 పరుగులలోపే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం వృద్ధిమాన్‌ సాహా (9), డేవిడ్‌ మిల్లర్‌ (11) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది.


గుజరాత్‌ లక్ష్యం ఎంతంటే?

గుజరాత్‌కు చెన్నై 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో అనుకున్నంత స్కోరును చెన్నై చేయలేకపోయింది. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ (73) సూపర్‌ ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్‌తోపాటు అంబటి రాయుడు (46) రాణించాడు. వీరిద్దరూ కలిసి 92 పరుగులను జోడించారు. అయితే దూకుడుగా ఆడుతున్న వీరిద్దరూ ఔట్‌ కావడంతో పరుగుల రాక మందగించింది. ఆఖర్లో శివమ్‌ దూబే (19), రవీంద్ర జడేజా (22*) దూకుడుగా ఆడేశారు. గుజరాత్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ 2, యశ్‌ దయాల్, షమీ చెరో వికెట్ తీశారు. 


రాయుడు.. హాఫ్ సెంచరీ మిస్‌

చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ (69*) అర్ధశతకం సాధించగా.. అంబటి రాయుడు (46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ కలిసి 92 పరుగులు జోడించారు. అల్జారీ బౌలింగ్‌లో బౌండరీ కోసం ప్రయత్నించిన రాయుడు గుజరాత్‌ ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ చేతికి చిక్కాడు.  ప్రస్తుతం చెన్నై 15 ఓవర్లు ముగిసేరికి మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజ్‌లో గైక్వాడ్‌తో పాటు శివమ్‌ దూబే (1*) ఉన్నాడు.


కుదురుకున్న చెన్నై

చెన్నై బ్యాటర్లు కాస్త కుదురుకున్నారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్న చెన్నైను రుతురాజ్‌ (41*), అంబటి రాయుడు (17*) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. రుతురాజ్ కాస్త దూకుడుగానే బ్యాటింగ్ చేస్తున్నాడు.


పవర్‌ప్లే ముగిసింది..

పవర్‌ప్లే ముగిసేలోపు చెన్నై రెండు వికెట్లను చేజార్చుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న రాబిన్‌ ఉతప్ప (3)ను గుజరాత్ బౌలర్‌ షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మొయిన్ అలీ (1) అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో అంబటి రాయుడు (1*), రుతురాజ్‌ గైక్వాడ్ (30*) ఉన్నారు. ఫామ్‌తో ఇబ్బంది పడిన రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లో పరుగులు చేస్తుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం.


నిదానంగా ఆరంభం..

టాస్‌ బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (2*), రుతురాజ్‌ గైక్వాడ్ (2*) నిదానంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పరుగులు చేయడం గగనంగా మారింది. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది.


టాస్‌ నెగ్గిన రషీద్‌ ఖాన్

సన్‌డేలో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొత్త కుర్రాళ్లతో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజారాత్‌.. ఐదో మ్యాచ్‌లో తొలి గెలుపు రుచి చూసిన చెన్నై జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ ఎంచుకుని జడేజా నాయకత్వంలోని చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మరి గుజరాత్‌ అగ్రస్థానం నిలబెట్టుకుంటుందో.. చెన్నై తొలి విజయం ఊపును కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్‌ వ్యవహరించనున్నాడు. హార్దిక్‌ పాండ్య గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది.

జట్ల వివరాలు: 

చెన్నై : రాబిన్ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, క్రిస్‌ జొర్డాన్, మహీశ తీక్షణ, ముకేశ్‌ చౌదరి

గుజరాత్‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్, విజయ్‌ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్‌ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్‌ (కెప్టెన్‌), అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్, మహమ్మద్‌ షమీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని