Ayush Badoni: టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకుండానే.. మెరుస్తోన్న భారత కుర్రాళ్లు

భారత్‌లో టీ20 లీగ్‌ అంటేనే యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుకునే వేదిక. అవకాశం రావాలే కానీ.. తమలోని అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రికెట్‌ వర్గాల దృష్టిని ఆకర్షిస్తారు...

Updated : 05 Apr 2022 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో టీ20 లీగ్‌ అంటేనే యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుకునే వేదిక. అవకాశం రావాలే కానీ.. తమలోని అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లోనూ అచ్చం ఇలాంటి కుర్రాళ్లే ముగ్గురు ఉన్నారు. వారే ఆయుష్‌ బదోని, తిలక్‌ వర్మ, లలిత్ యాదవ్‌. ఇప్పటివరకు ఆడింది రెండు, మూడు మ్యాచ్‌లే అయినా వీరు రాణిస్తోన్న తీరు గొప్పగా ఉంది.

ఆయుష్‌ బదోని:

(Photo: Ayush Badoni Instagram)

ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కొత్త ఫ్రాంఛైజీ లఖ్‌నవూ టీమ్‌ కనీస ధర రూ.20లక్షలకే సొంతం చేసుకున్న ఆటగాడు ఆయుష్‌ బదోని. ఈ సీజన్‌లో గుజరాత్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసిన అతడు (54; 41 బంతుల్లో 4x4, 3x6) అర్ధ శతకంతో మెరిశాడు. ప్రత్యర్థులు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నా ఏమాత్రం భయపడకుండా ఆడాడు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును దీపక్‌ హుడా (55; 41 బంతుల్లో 6x4, 2x6)తో కలిసి ఆదుకున్నాడు. ఇక చెన్నైతో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ 211 పరుగుల భారీ ఛేదనలో.. బదోని (19; 9 బంతుల్లో 2x6) చివర్లో మెరుపు బ్యాటింగ్‌ చేసి విలువైన పరుగులు అందించాడు. తాజాగా హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ (19; 12 బంతుల్లో 3x4) ధాటిగా ఆడాడు. ఇలా ఇప్పటివరకు మొత్తం 3 మ్యాచ్‌లు ఆడిన బదోని 148.38 స్ట్రైక్‌రేట్‌తో 92 పరుగులు చేశాడు. దీంతో టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకుండానే లఖ్‌నవూ జట్టు తరఫున అదరగొడుతున్నాడు.

తిలక్‌ వర్మ:

(Photo: Tilak Varma Instagram)

ప్రతిభావంతులైన యువకులను ప్రోత్సహించడంలో ముంబయి టీమ్‌ ముందువరుసలో ఉంటుంది. ఆ జట్టు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ఆటగాళ్లు ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున ఆడుతున్నారు. అలానే ఇప్పుడు అదే జట్టు తరఫున అవకాశం దక్కించుకున్న యువ ఆటగాడు తిలక్‌ వర్మ. మెగా వేలంలో రూ.1.7 కోట్ల ధర దక్కించుకున్న ఇతడు ముంబయికి న్యాయం చేస్తున్నాడు. దిల్లీతో తలపడిన తొలి మ్యాచ్‌లో (22; 15 బంతుల్లో 3x4) పరుగులు చేసి.. తర్వాత రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో (61; 33 బంతుల్లో 3x4, 5x6) మెరుపులు మెరిపించాడు. దీంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో ముంబయి ఓటమిపాలైనా తిలక్‌ వర్మకు బ్యాట్స్‌మన్‌గా మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ఆడిన 2 మ్యాచ్‌ల్లో 172.91 స్ట్రైక్‌రేట్‌తో 83 పరుగులు చేశాడు. దీంతో అతడు టీమ్‌ఇండియా భవిష్యత్‌ బ్యాట్స్‌మన్‌గా ఆశలు పెంచుతున్నాడు.

లలిత్ యాదవ్‌:

(Photo: Lalith Yadav Instagram)

ఇక టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకుండానే ఈసారి బ్యాటింగ్‌లో అలరిస్తోన్న మరో యువ ఆటగాడు లలిత్ యాదవ్‌. గతేడాది ఈ టీ20 లీగ్‌లో అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిపై నమ్మకం ఉంచిన దిల్లీ ఈ సీజన్‌ మెగా వేలంలో రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని అందింపుచుకున్న అతడు ముంబయితో ఆడిన తొలి మ్యాచ్‌లో (48 నాటౌట్‌; 38 బంతుల్లో 4x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (25; 22 బంతుల్లో 2x4, 1x6) బాగా ఆడినా ఊహించని పరిస్థితుల్లో రనౌటయ్యాడు. ఇలా ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే 121.66 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 73 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ ముగ్గురూ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లుగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని