T20 League : ‘బుల్లెట్‌’ బంతుల సవాల్ .. తిరుగులేని హైదరాబాద్‌ బౌలర్‌

బ్యాటర్‌ ఊహకు అందకుండా బంతిని సంధించడం ఓ కళ.. అయితే ఒక్కో బౌలర్‌...

Updated : 10 Aug 2022 10:44 IST

145 కి.మీకిపైగా వేగంతో విసిరిన వీరులు వీరే!

ఇంటర్నెట్ డెస్క్‌ : బ్యాటర్‌ ఊహకు అందకుండా బంతిని సంధించడం ఓ కళ.. అయితే ఒక్కో బౌలర్‌ విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కొందరు స్లో, మీడియం పేస్‌తో బౌలింగ్‌ చేస్తే.. మరికొందరు బుల్లెట్‌లా దూసుకొచ్చే బంతులను సంధిస్తారు. ఇలా నిలకడగా గంటకు 145 కి.మీకిపైగా వేగంతో బంతిని విసిరే బౌలర్లపై ఓ లుక్కేద్దాం..

సాధారణంగా చాలా మంది బౌలర్లు 130 కి.మీ నుంచి 140 కి.మీ వేగంతో బంతిని వేస్తుంటారు. వీరిని మీడియం పేసర్లుగా పేర్కొంటారు. అయితే నిలకడగా గంటకు 145 కి.మీ స్పీడ్‌తో బంతులను సంధించే సూపర్‌ ఫాస్ట్‌బౌలర్లూ టీ20 లీగ్‌లో ఉన్నారు. ఇలాంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే కచ్చితంగా బ్యాటర్లు కష్టపడాల్సిందే. కాస్త అవకాశం ఇచ్చారో వికెట్‌ చేజారినట్లే. మరీ ముఖ్యంగా ఉమ్రాన్‌ మాలిక్, లాకీ ఫెర్గూసన్‌ వంటి స్పీడెస్టర్లను జాగ్రత్తగా కాచుకోవాల్సి ఉంటుంది. పరుగులు ఇచ్చినా వికెట్లను పడగొట్టడంలో ముందుంటారు.

ప్రతి లక్ష.. అతడి ఖాతాలోనే

(Photo: Umran Malik Instagram)

టీ20 లీగ్‌లో ప్రతి మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌కు రూ. లక్ష నజరానాగా నిర్వాహకులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు హైదరాబాద్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆ జట్టు బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌నే రూ. లక్ష వరించింది. దీంతో మ్యాచ్‌కు ముందే ఆ ‘లక్ష’ ఏదో ఉమ్రాన్‌ కోసం పక్కన పెడితే సరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంటే.. ఉమ్రాన్‌ బౌలింగ్‌ స్పీడ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు టీ20 లీగ్‌లో గంటకు 145 కి.మీకిపైగా వేగంతో దాదాపు 58 బంతులను సంధించాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ అత్యధిక వేగవంతమైన బంతి 153 కి.మీ. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విసిరాడు.

యువ బౌలర్‌.. కుల్‌దీప్‌ సేన్

రూ. 20 లక్షలకు రాజస్థాన్‌ సొంతం చేసుకున్న యువ ప్లేయర్‌ కుల్‌దీప్‌ సేన్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. మొత్తం 48 బంతుల్లో తొమ్మిది సార్లు గంటకు 145 కి.మీకిపైగా వేగంతో సంధించడం విశేషం. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 15 పరుగులను కాపాడి రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతి అత్యధిక వేగవంతమైన బంతి 146.3 కి.మీ. అదీనూ లఖ్‌నవూ ఓపెనర్‌ డికాక్‌కు విసిరాడు.

లాకీ.. 150 కి.మీ తాకి..

(Photo: Lockie Ferguson Instagram)

లాకీ ఫెర్గూసన్‌.. గుజరాత్‌ జట్టులో కీలక బౌలర్‌.. గత సీజన్‌లో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంలో ముఖ్య భూమిక పోషించాడు. అందుకేనేమో లాకీని గుజరాత్‌ మెగా వేలంలో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. నిలకడగా 145 కి.మీకిపైగా వేగంతో బంతులను సంధిస్తున్నాడు. ఇదే వేగంతో ఇప్పటివరకు 30 బంతులను విసిరడం విశేషం. అలానే స్లో డెలివరీలతో వికెట్లనూ కొల్లగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 150 కి.మీ వేగంతో కూడా బంతిని విసిరాడు.

రాజస్థాన్‌ ఓపెనింగ్ బౌలర్..

ఓ మోస్తరు ఎకానమీతో (8.15) రాజస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ను నడిపిస్తున్న బౌలర్‌ ప్రసిధ్ కృష్ణ. ఇప్పటివరకు దాదాపు 20 ఓవర్లు వేసిన ప్రసిధ్‌ కేవలం 163 పరుగులే ఇవ్వడం గమనార్హం. పవర్‌ప్లేలో ఫీల్డర్ల అడ్వాంటేజ్‌ తీసుకొని మరీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటారు. అలాటి సమయంలోనూ కట్టడిగా ప్రసిధ్ బౌలింగ్‌ వేశాడు. ఈ సీజన్‌లో గంటకు 145 కి.మీకిపైగా వేగంతో మూడు బంతులను సంధించాడు.

సిరాజ్‌కూడానూ ఓ నాలుగుసార్లు.. 

(Photo: Mohammed Siraj Instagram)

బెంగళూరు విజయాల్లో సిరాజ్‌ది కీలక పాత్ర. పేస్‌ బౌలర్‌గా బౌలింగ్ దాడిని నడిపిస్తున్న సిరాజ్‌ ఎక్కువగా 140 కి.మీ వేగంతో బంతులను సంధిస్తాడు. ఇదే క్రమంలో 145 కి.మీ కంటే అధిక వేగంతో కూడానూ మూడు బంతులను విసిరాడు. సిరాజ్‌ ఫాస్టెస్ట్‌ బాల్‌ 145.97 కి.మీ. ప్రస్తుత సీజన్‌లో ఐదు మ్యాచులకుగాను 120 బంతులను విసిరిన సిరాజ్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే తీశాడు. అత్యుత్తమ బౌలింగ్‌ 2/59. ఎకానమీ (10.75) కూడా ఎక్కువగా ఉంది. 

వీరు కూడా స్పెషలే.. 

రాజస్థాన్‌ బౌలర్‌ నవ్‌దీప్‌ సైని ఈ సీజన్‌లో ఆడింది రెండే మ్యాచ్‌లు. కానీ  మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే గాయం కారణంగా ప్రస్తుతం బెంచ్‌కే  పరిమితం కావాల్సి వచ్చింది. పరుగులు భారీగా ఇచ్చినా కీలకమైన వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో నవ్‌దీప్‌ సైని 149 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. అలానే పంజాబ్‌కు చెందిన ఓడియన్‌ స్మిత్ కూడానూ 148 కి.మీ వేగంతో అత్యంత స్పీడ్‌ బంతిని విసిరాడు. దిల్లీ యువబౌలర్‌ నాగర్‌కోటి 145.8 కి.మీ స్పీడ్‌తో బంతిని సంధించి ఔరా అనిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని