Umran Malik: వారెవ్వా.. ఉమ్రాన్‌ వేసిన ఆ ఓవర్.. ఇదే తొలిసారి

టీ20 మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ అంటే.. వేసే బౌలర్‌కు కత్తి మీద సాము లాంటిదే...

Published : 18 Apr 2022 07:04 IST

(Photo: Umran Malik Instagram)

ముంబయి: టీ20 మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ అంటే.. వేసే బౌలర్‌కు కత్తి మీద సాము లాంటిదే. వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించే బ్యాటర్లు బౌండరీలు బాదుతారు. అలాంటిది పంజాబ్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన చివరి ఓవర్‌ మెగా టోర్నీ చరిత్రలో నిలిచిపోయేదే. ఆఖరి ఓవర్‌ మెయిడిన్‌ వేయడమే కాక మూడు వికెట్లు పడగొట్టాడతను. చివరి బంతికి  ఓ బ్యాటర్‌ రనౌట్‌ కావడంతో ఆ ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు పడ్డాయి. ఇర్ఫాన్‌ పఠాన్‌ (2008), మలింగ (2009), జైదేవ్‌ ఉనద్కత్‌ (2017) తర్వాత మెగా టోర్నీలో చివరి ఓవర్‌ మెయిడిన్‌ వేసిన నాలుగో బౌలర్‌గా ఉమ్రాన్‌ నిలిచాడు. మరోవైపు ఓ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఒక్క పరుగూ రాకుండా నాలుగు వికెట్లు పడడం మెగా టోర్నీలో ఇదే తొలిసారి. 151/6.. ఇదీ ఉమ్రాన్‌ బౌలింగ్‌కు రాకముందు పంజాబ్‌ స్కోరు. 151 ఆలౌట్‌ ఇదీ ఓవర్‌ ముగిశాక స్కోరు. తొలి బంతికి స్మిత్‌ పరుగులేమీ చేయలేదు. ఆ వెంటనే షార్ట్‌పిచ్‌ బంతిని అతను గాల్లోకి లేపగా ఉమ్రానే క్యాచ్‌ అందుకున్నాడు. మూడో బంతి రాహుల్‌ చాహర్‌ ప్యాడ్లను తాకింది. లెంగ్త్‌లో వేసిన నాలుగు, అయిదు బంతులు వరుసగా చాహర్‌, వైభవ్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టాయి. చివరి బంతికి ఉమ్రాన్‌కు హ్యాట్రిక్‌ సాధించే అవకాశం వచ్చింది. కానీ ఆ బంతికి సింగిల్‌ కోసం ప్రయత్నించిన అర్ష్‌దీప్‌ రనౌటయ్యాడు. ‘‘మ్యాచ్‌లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం సమయం పట్టేలా ఉంది. గత కొన్ని రోజులుగా లైన్‌, లెంగ్త్‌ విషయంలో మెరుగైనట్లు అనిపిస్తోంది’’ అని ఉమ్రాన్‌ చెప్పాడు. అత్యధిక వేగంతో బంతులేస్తున్నాడు కానీ లెంగ్త్‌ కుదరడం లేదని మొన్నటివరకూ ఉమ్రాన్‌పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కచ్చితమైన లెంగ్త్‌లో బంతులేస్తూ అతను సత్తా చాటుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు