Sehwag: అక్తర్‌ బౌలింగ్‌ కాకుండా త్రో వేసేవాడు.. అది అతడికీ తెలుసు: సెహ్వాగ్‌

భారత క్రికెట్‌లో మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ది భిన్నమైన శైలి అనే సంగతి అందరికీ తెలిసిందే. అతడు ఆడే రోజుల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు...

Updated : 18 May 2022 11:49 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత క్రికెట్‌లో మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ది భిన్నమైన శైలి అనే సంగతి అందరికీ తెలిసిందే. అతడు ఆడే రోజుల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. బౌలర్‌ ఎవరైనా బంతిని బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో క్రీజులో ఉన్నది పది నిమిషాలైనా స్కోరు బోర్డును పరుగులు పెట్టించేవాడు. నీళ్లు తాగినంత తేలిగ్గా బౌలర్లను ఉతికారేసేవాడు. రిస్క్‌ తీసుకొని మరీ శతకాల వద్ద బౌండరీలు బాదేవాడు. అంత దూకుడుగా ఆడటానికి గల కారణాలను తాజాగా వివరించాడు. ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన సందర్భంగా సెహ్వాగ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, గంగూలీ.. ఈ నలుగురూ 150-200 బంతులు ఆడితే కచ్చితంగా శతకాలు సాధించేవాళ్లు. అలాంటప్పుడు నేను కూడా వాళ్లలాగే బ్యాటింగ్ చేస్తే నన్నెవరూ గుర్తుపట్టరు. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఆ నలుగురికన్నా ఇంకా వేగంగా పరుగులు చేయాలనుకున్నా’ అని ఈ మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ పేర్కొన్నాడు. అలాగే పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌పైనా స్పందించాడు. అతడి బౌలింగ్‌ సరిగ్గా ఉండదంటూ విమర్శించాడు. ‘అక్తర్‌ బంతులు సంధించేటప్పుడు మోచేయి కుదుపులకు లోనవుతుంది. దీంతో అతడు బౌలింగ్‌ కాకుండా త్రో వేసేవాడు. ఆ విషయం అతడికి కూడా తెలుసు. లేకపోతే ఐసీసీ అతడిపై ఎందుకు నిషేధం విధిస్తుంది?’ అని విమర్శించాడు. మరోవైపు ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌ అంటే తనకేమాత్రం భయంలేదని, అతడి మోచేయి సరిగ్గా తిరుగుతూ బంతిని బాగా సంధిస్తాడని మెచ్చుకున్నాడు. తాను బ్రెట్‌లీ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడేవాడిని కాదన్నాడు. అక్తర్‌ మాత్రం ఎప్పుడు ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమయ్యేది కాదని తెలిపాడు. అతడి బౌలింగ్‌లో రెండు, మూడు ఫోర్లు కొడితే.. ఇక తర్వాతి బంతి నుంచి తలమీదకైనా లేదా యార్కర్లతో అరికాళ్లనైనా టార్గెట్‌ చేసేవాడని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని