Virender Sehwag: కోహ్లీ ఈసారి చేసినన్ని తప్పులు కెరీర్‌ మొత్తంలో చేయలేదేమో: సెహ్వాగ్

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఈ సీజన్‌లో చేసినన్ని తప్పులు తన కెరీర్‌ మొత్తంలో చేయలేకపోయి ఉండొచ్చని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పేర్కొన్నాడు...

Updated : 28 May 2022 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఈ సీజన్‌లో చేసినన్ని తప్పులు తన కెరీర్‌ మొత్తంలో చేయలేకపోయి ఉండొచ్చని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో విరాట్‌ రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, అతడు వికెట్లకు దూరంగా వెళ్లే బంతిని ఆడి కీపర్‌కు చిక్కాడు. దీంతో 7 పరుగులకే వెనుదిరిగి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌ తీరుపై స్పందించిన సెహ్వాగ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు ఆత్మవిశ్వాసం కోసం దొరికిన ప్రతి బంతినీ కొట్టాలనుకుంటారు. తొలి ఓవర్‌లో అతడు కొన్ని బంతులు వదిలేసినా చివరికి దూరంగా వెళ్లే బంతిని వేటాడి ఔటయ్యాడు. అలా ప్రతి బంతినీ ఆడితే కొన్ని సార్లు అదృష్టం కలిసి రావచ్చు. మరికొన్ని సార్లు రాకపోవచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. మరోవైపు కోహ్లీ ఈ సీజన్‌లో చేసినన్ని తప్పుడు బహుశా తన కెరీర్‌ మొత్తంలో చేసి ఉండకపోవచ్చు. పరుగులు చేయలేక తంటాలు పడుతున్నప్పుడు ఆటగాళ్లు ఇలాగే ఏవేవో షాట్లు ఆడాలని ప్రయత్నించి ఏదో విధంగా ఔటవుతుంటారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఔటైన బంతిని వదిలేయాల్సింది. లేదా దంచికొట్టాల్సింది. ఇంత కీలక మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని