Hardik Pandya: బ్యాటింగ్‌, బౌలింగ్‌ లేదన్నారు.. ఇప్పుడు మాతో కప్‌ ఉంది: హార్దిక్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ఫైనల్లో గుజరాత్‌ టీమ్‌ విజేతగా నిలిచింది. రాజస్థాన్‌ను ఓడించి ఆడిన తొలి సీజన్‌లోనే ట్రోఫీ ఎగరేసుకుపోయింది. దీంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య హర్షం వ్యక్తం చేశాడు...

Published : 31 May 2022 02:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ఫైనల్లో గుజరాత్‌ టీమ్‌ విజేతగా నిలిచింది. రాజస్థాన్‌ను ఓడించి ఆడిన తొలి సీజన్‌లోనే ట్రోఫీ ఎగరేసుకుపోయింది. దీంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య హర్షం వ్యక్తం చేశాడు. తాము తొలి సీజన్‌లోనే సిక్సర్‌ బాదామన్నాడు. గతరాత్రి మ్యాచ్‌ అనంతరం తమ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రాతో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా నెహ్రా మాట్లాడుతూ విజేతగా నిలవడం ఎలా ఉందని పాండ్యను అడిగాడు. దానికి బదులిచ్చిన అతడు.. టోర్నీ ప్రారంభానికి ముందు తమ జట్టును చూసిన కొంత మంది విమర్శించారని గుర్తు చేసుకున్నాడు.

‘మా జట్టులో సరైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ యూనిట్లు లేవన్నారు. అయితే, ఇప్పుడు మాతో ట్రోఫీ ఉంది. ఛాంపియన్స్‌గా నిలవడం గర్వంగా ఉంది. మా కోచ్‌ నెహ్రా ప్రతి ఒక్క ఆటగాడిని కాచుకున్నాడు. దీంతో మేం ట్రోఫీ సాధించేలా మమ్మల్ని తయారు చేశాడు. అని పాండ్య వివరించాడు. కాగా, ఈ సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో గుజరాత్‌ ఆటగాళ్ల ఎంపికను చూసి నిజంగానే చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. పాండ్యను కెప్టెన్‌గా నియమించడం కూడా పెద్ద తప్పని అన్నారు. ఈ జట్టు చూడ్డానికి ఏ విభాగంలోనూ సరిగ్గా లేదని విమర్శించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాత్‌ సమష్టిగా రాణించింది. ఫైనల్లోనూ రాజస్థాన్‌ను 130 పరుగులకే కట్టడి చేసి తర్వాత తేలిగ్గా గెలిచింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని