Shikhar Dhawan: తండ్రి చేతిలో దెబ్బలుతిన్న శిఖర్‌ ధావన్‌.. వీడియో వైరల్‌!

పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ తన తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో...

Published : 26 May 2022 13:34 IST

(Photo: Shikhar Dhawan Instagram Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ తన తండ్రి చేతిలో సరదాగా దెబ్బలు తిన్నాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో ఆయన తనను కొట్టారని ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దానికి ఓ పాత బాలీవుడ్‌ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ జత చేయడం గమనార్హం. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తే నిజంగానే ధావన్‌పై ఆయన తండ్రి దాడి చేసినట్లుగా ఉంది. దెబ్బలు కొట్టడం, కింద పడేసి కాళ్లతో తన్నడం వంటి దృశ్యాలు అందులో కనిపించాయి.

మరోవైపు ఈ సీజన్‌లో పంజాబ్‌ లీగ్‌స్టేజ్‌లో చివరిక్షణాల్లో ప్లేఫ్స్‌లో చోటు దక్కించుకునేలా కనిపించినా చివరికి ఆరోస్థానంతో సరిపెట్టుకొంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములు చవిచూసిన ఆ జట్టు దిల్లీతో సమానంగా 14 పాయింట్లు సాధించింది. రన్‌రేట్‌లో వెనుకంజలో ఉన్న దిల్లీ ఐదో స్థానం దక్కించుకుంది. అయితే, లీగ్‌ స్టేజ్‌లో పంజాబ్‌ కనీసం ఇంకొక్క మ్యాచ్‌ గెలుపొందినా చాలా తేలిగ్గా ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించుకునేది. ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరు 16 పాయింట్లు సాధించగా.. రన్‌రేట్‌ దిల్లీ, పంజాబ్‌ జట్ల కన్నా వెనుకంజలో నిలిచింది. దీంతో పంజాబ్‌ త్రుటిలో టాప్‌-4లో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. మరోవైపు ధావన్ (460) ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. పంజాబ్‌ ఓపెనర్‌గా అతడు 14 మ్యాచ్‌ల్లో 38.33 సగటుతో 3 అర్ధ శతకాలు సాధించాడు. స్ట్రైక్‌రేట్‌ 122.66గా నమోదైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని