Bangalore vs Gujarat: గుజరాత్‌తో కీలకపోరు.. బెంగళూరుకు చావో రేవో..!

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అందులో ఈరోజు బెంగళూరు, గుజరాత్‌ తమ చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి...

Published : 19 May 2022 12:43 IST

ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందంటే..

భారత టీ20 టోర్ని 15వ సీజన్‌ లీగ్‌ దశ ముగింపునకు చేరుకొంది. కేవలం నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. వీటిలో ఈరోజు బెంగళూరు, గుజరాత్‌ తమ చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. గుజరాత్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోగా బెంగళూరుకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌గా మారింది. మరీ ముఖ్యంగా రన్‌రేట్‌ విషయంలో చాలా వెనకపడి ఉండటంతో బెంగళూరు ఈ రోజు భారీ తేడాతోనే నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

భారమంతా ఇద్దరే మోస్తున్నారు..

(Photo: Faf duplesis Instagram)

ఈ సీజన్‌లోనూ బెంగళూరు పరిస్థితి ఏమాత్రం మారలేదు. కొత్త జట్టుతో ఆరంభంలో పలు అద్భుత విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ జట్టు తర్వాత మళ్లీ పేలవ ఆటతీరుతో వెనుకబడింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఓపెనర్‌, కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ ఆడితేనే స్కోరుబోర్డుపై పరుగులు కనిపిస్తున్నాయి. లేదంటే చివర్లో దినేశ్‌ కార్తీక్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొడుతున్నాడు. దురదృష్టం కొద్దీ వీరిద్దరూ విఫలమైతే ఇక బెంగళూరు పరిస్థితి చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. టాప్‌ ఆర్డర్‌లో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌, రజత్‌ పటిదార్‌, మహిపాల్‌ లోమ్రర్‌ ఇప్పటి వరకు ఏ మాత్రం రాణించలేదు.

(Photo: Dinesh Karthik Instagram)

ఇప్పటివరకు బెంగళూరు తరఫున అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్‌ జాబితాలో డుప్లెసిస్ ఒక్కడే టాప్‌-10లో 9వ స్థానంలో ఉన్నాడు. అతడు 13 మ్యాచ్‌ల్లో 33.25 సగటుతో 399 పరుగులు చేసి జట్టును ఆదుకొంటున్నాడు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా వస్తూ దంచికొడుతున్నాడు. అతడు 57 సగటుతో 285 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ 13 మ్యాచ్‌ల్లో కేవలం 19.67 సగటుతో 236 పరుగులే సాధించాడు. మాక్స్‌వెల్‌ 10 మ్యాచ్‌ల్లో 25.33 సగటుతో 228 పరుగులు చేసినా.. భారీ ఇన్నింగ్స్‌లు లేవు. దీన్నిబట్టి ప్రస్తుతం బెంగళూరు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గుజరాత్‌పై మ్యాచ్‌ గెలవాలన్నా.. తర్వాత ప్లేఆఫ్స్‌ చేరాలన్నా వాళ్ల నుంచి ఇలాంటి ప్రదర్శనలు సరిపోవు. కోహ్లీ, మాక్స్‌వెల్‌ ఇకనైనా బ్యాట్లు ఝుళిపించకపోతే ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు గుజరాత్‌ జట్టులో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దంచికొడుతున్నారు. ఓపెనర్ల నుంచి ఫినిషర్ల వరకు పోటీపడి మరీ విజయాలు తెచ్చిపెడుతున్నారు. దీంతో బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలవాలంటే తమ శక్తియుక్తులను ధారపోయాల్సిందే.

బౌలింగ్‌లోనూ ఇద్దరే మెరుస్తున్నారు..

(Photo: Wanindu Hasaranga Instagram)

ఇక బెంగళూరు బౌలింగ్‌ విషయానికి వస్తే వానిండు హసరంగ, హర్షల్‌ పటేల్‌ మాత్రమే రాణిస్తున్నారు. వీరిద్దరూ వికెట్లు తీస్తూనే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హసరంగ 13 మ్యాచ్‌ల్లో 7.48 ఎకానమీతో 23 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు హర్షల్‌ 12 మ్యాచ్‌ల్లో 7.72 ఎకానమీతో 18 వికెట్లు తీశాడు. అతడు ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, బెంగళూరులో ప్రధాన పేసర్‌ అయిన మహ్మద్‌ సిరాజ్‌ తన స్థాయికి తగ్గట్లు ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు 13 మ్యాచ్‌ల్లో 9.82 ఎకానమీతో 8 వికెట్లే సాధించాడు. ఇక జోష్‌ హేజిల్‌వుడ్‌ 9 మ్యాచ్‌ల్లో 7.88 ఎకానమీతో 13 వికెట్లు తీసి మోస్తరుగా రాణిస్తున్నాడు. అలాగే పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా మాక్స్‌వెల్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేసి 7.05 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. దీంతో పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నా మరిన్ని వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కీలక ఆటగాళ్లంతా తమ అనుభవాన్ని మొత్తం రంగరించి ఈ మ్యాచ్‌లో రాణిస్తే తప్ప గుజరాత్‌పై విజయం సాధించే పరిస్థితి లేదు.

గత మ్యాచ్‌ల పరిస్థితి..

(Photo: Harshal Patel Instagram)

బెంగళూరు తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, రెండు విజయాలు సాధించింది. అలాగే గుజరాత్‌ మూడు విజయాలు, రెండు ఓటములు సాధించింది. మరోవైపు ఇరు జట్ల మధ్య ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ గుజరాత్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో ఎలా చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరు కన్నా గుజరాత్‌ జట్టే మెరుగ్గా ఉంది. దీంతో బెంగళూరు ఇప్పుడు ఆ జట్టును ఓడించడం చాలా కష్టమనే చెప్పాలి. అయినా, గట్టిగా ప్రయత్నిస్తే దాన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని