Lucknow vs Gujarat: ఫుల్‌ఫామ్‌లో లఖ్‌నవూ.. గుజరాత్‌పై ప్రతీకారం?

రెండూ కొత్త జట్లే. రెండూ 16 పాయింట్లతోనే కొనసాగుతున్నాయి. పెద్దగా అంచనాల్లేకుండానే పోటీలోకి వచ్చిన జట్లు ఇప్పుడు పేరు మోసిన టీమ్‌లకే షాకిస్తున్నాయి...

Published : 10 May 2022 12:19 IST

మినీ ఫైనల్ అంటూ అభిమానుల సందడి..

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండూ కొత్త జట్లే. రెండూ 16 పాయింట్లతోనే కొనసాగుతున్నాయి. పెద్దగా అంచనాల్లేకుండానే పోటీలోకి వచ్చిన జట్లు ఇప్పుడు పేరు మోసిన టీమ్‌లకే షాకిస్తున్నాయి. దీంతో టాప్‌-2లో కొనసాగుతూ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో ఒకసారి తలపడిన గుజరాత్‌, లఖ్‌నవూ నేడు మరోసారి పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదివరకు ఓటమిపాలైన లఖ్‌నవూ ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటుందా.. చూడాలి. దీంతో ఈ మ్యాచ్‌ అభిమానులకు మినీ ఫైనల్‌లా మారింది.

గుజరాత్‌ కాస్త డౌటే..
ఈ సీజన్‌లో తొలి 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి దిగ్విజయంగా ముందుకు సాగిన గుజరాత్‌ గతవారం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో ఇప్పుడు కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది. బౌలింగ్‌ పరంగా బాగున్నా బ్యాటింగ్‌లోనే కొంచెం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించింది లేదు. అంతకుముందు వరుసగా మూడు అర్ధ శతకాలతో జోరుమీద కనిపించిన అతడు చివరి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 10, 3, 1, 24 పరుగులే చేశాడు. దీంతో పాండ్య బ్యాటింగ్‌ ఇప్పుడు కీలకం కానుంది. 
ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌గిల్‌ రాణిస్తున్నా తర్వాత వచ్చే కెప్టెన్‌ పాండ్య విఫలమవుతున్నాడు. మరోవైపు కొత్త ఆటగాడు సాయి సుదర్శన్‌ సైతం ఫర్వాలేదనిపిస్తున్నాడు. అలాగే ఈ సీజన్‌లో మేటి ఫినిషర్లుగా పేరు తెచ్చుకున్న డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా సైతం అదరగొడుతున్నారు. కానీ, గత రెండు మ్యాచ్‌ల్లోనే వీరు విఫలమయ్యారు. దాంతో గుజరాత్‌ కూడా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఈరోజు చెలరేగకపోతే లఖ్‌నవూ నుంచి మరో ఓటమి ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక బౌలింగ్‌లో మహ్మద్‌ షమి రాణిస్తున్నాడు. ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌ మేటిగా కాకపోయినా ఓ మోస్తరుగా వికెట్లు తీస్తున్నారు.

లఖ్‌నవూ సూపర్‌ డూపర్‌..
ఇక లఖ్‌నవూ ప్రస్తుతం సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న ఆ జట్టు గుజరాత్‌తో సమానంగా 16 పాయింట్లతోనే కొనసాగుతోంది. అయితే, నెట్‌ రన్‌రేట్‌ (0.703) విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండటం విశేషం. మరోవైపు గుజరాత్‌ (0.120) రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే మినీ ఫైనల్‌ని తలపిస్తోంది. ఇక గణాంకాల పరంగా లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. అతడిలాగే రాణిస్తే ఆ జట్టు ఈరోజు గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సైతం రాణిస్తూ ఆ జట్టు విజయాల్లో తనవంతు సహకారం అందిస్తున్నాడు. తర్వాత దీపక్‌ హూడా, మార్కస్‌ స్టాయినిస్‌ లాంటి ఆటగాళ్లు జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడుతున్నారు. ఇక బౌలింగ్‌లో అవేశ్‌ ఖాన్‌ ఒక్కడే కాస్త ఎక్కువ ప్రభావం చూపుతున్నాడు. కృనాల్‌ పాండ్య, జేసన్‌ హోల్డర్‌ లాంటి ఆటగాళ్లు ఆల్‌రౌండర్లుగా మెరుస్తున్నారు. రవిబిష్ణోయ్‌ అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. అయితే, లఖ్‌నవూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి కలిసికట్టుగా రాణిస్తే గుజరాత్‌ను ఓడించడం పెద్ద పనేంకాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని