Mac Keyborad Shortcuts: మ్యాక్‌ దగ్గరి దారులు

కాపీ, పేస్ట్‌ చేయటానికి తరచూ కీబోర్డు మీటలు నొక్కుతూనే ఉంటాం. ఇవి మన స్వభావంలో భాగమైపోయాయని చెప్పుకొన్నా అతిశయోక్తి కాదు. అంత ఎక్కువగా వీటిని వాడుతుంటాం.

Updated : 29 Jul 2021 16:23 IST

కాపీ, పేస్ట్‌ చేయటానికి తరచూ కీబోర్డు మీటలు నొక్కుతూనే ఉంటాం. ఇవి మన స్వభావంలో భాగమైపోయాయని చెప్పుకొన్నా అతిశయోక్తి కాదు. అంత ఎక్కువగా వీటిని వాడుతుంటాం. ఇలాంటి చిట్కాలతో సమయం ఎంతగానో ఆదా అవుతుంది. ఇవే కాదు, మ్యాక్‌ కీబోర్డులో మరెన్నో దగ్గరి దారులూ ఉన్నాయి. వీటిని గుర్తుంచుకోవటమూ తేలికే. టైపింగ్‌ తీరులో వీటిని భాగం చేసుకుంటే ఎంతగానో ఉపయోగపడతాయి.


కొత్త ట్యాబ్‌ తెరిచేందుకు

కొందరు ఒకే సమయంలో ఎక్కువెక్కువ ట్యాబ్‌లు తెరుస్తుంటారు. మీకూ అలాంటి అలవాటే ఉందా? అయితే ప్రతీసారి ప్లస్‌ గుర్తును నొక్కాల్సిన పనిలేదు. కమాండ్‌, టి బటన్లను కలిపి నొక్కితే చాలు. కొత్త ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుంది.


ఫైల్‌ కాపీ కోసం

ఫైల్‌ కాపీని సృష్టించుకోవటానికి ఏం చేస్తారు? ఏముంది.. ఫైల్‌ మీద నొక్కి, డుప్లికేట్‌ను క్లిక్‌ చేస్తాం. ఇది తేలికైన పద్ధతే కావొచ్చు. దీనికన్నా మంచి చిట్కా మరోటి ఉంది. ఫైల్‌ మీద క్లిక్‌ చేసి కమాండ్‌, డి మీటలను నొక్కండి. అంతే ఫైల్‌ కాపీ అయిపోతుంది. డిని డబుల్‌గా అనుకుంటే తేలికగా గుర్తుంచుకోవచ్చు.


చిటికెలో ఐక్లౌడ్‌లోకి

ఐక్లౌడ్‌ డ్రైవ్‌ను ఓపెన్‌ చేయటానికి తరచూ ఫైండర్‌ను ఉపయోగిస్తుంటే దీన్ని కాస్త మార్చుకోవచ్చు. షిఫ్ట్‌, కమాండ్‌, ఐ బటన్లను కలిపి నొక్కండి. వెంటనే ఐక్లౌడ్‌లోకి వెళ్లొచ్చు. ఇలా చిటికెలో పాత ఫైళ్లను తీసుకోవచ్చు. కొత్త వాటిని సేవ్‌ చేసుకోవచ్చు.


డాక్యుమెంట్‌లో పైకీ కిందికీ

కీబోర్డు మీదుండే ఫంక్షన్‌ మీటనూ కొన్ని పనులకు ఉపయోగించుకోవచ్చు. వీటిల్లో బాగా ఉపయోగపడేది డాక్యుమెంట్లను చూస్తున్నప్పుడు పైకీ కిందికీ వెళ్లటం.
* ఎఫ్‌ఎన్‌, అప్‌ బాణం బటన్‌ నొక్కితే పైకి వెళ్లొచ్చు.
* ఎఫ్‌ఎన్‌, డౌన్‌ బాణం గుర్తును నొక్కితే కిందికి వెళ్లొచ్చు.
* ఎఫ్‌ఎన్‌, లెఫ్ట్‌ బాణంతో డాక్యుమెంట్‌ మొదటికి చేరుకోవచ్చు.
* ఎఫ్‌ఎన్‌, రైట్‌ బాణంతో డాక్యుమెంట్‌ చివరికి రావొచ్చు.


ఇలా ఎయిర్‌డ్రాప్‌లోకి

దగ్గర్లో ఉన్నవారికి ఫొటోనో, పాటనో, డాక్యుమెంటునో పంపించటానికి తేలికైన మార్గం ఎయిర్‌డ్రాప్‌. స్పాట్‌లైట్‌ను గానీ షేరింగ్‌ మెనూను గానీ వాడకుండానూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం షిఫ్ట్‌, కమాండ్‌, ఆర్‌ మీటలను నొక్కితే సరి.


స్క్రీన్‌షాట్‌, రికార్డింగుకు

షిఫ్ట్‌, కమాండ్‌, 3 బటన్లను కలిపి నొక్కి స్క్రీన్‌షాట్‌ తీసుకోవచ్చు. ఒకవేళ తెర మూలకు థంబ్‌నెయిల్‌ కనిపిస్తే దానిపై క్లిక్‌ చేసి ఎడిట్‌ ద స్క్రీన్‌షాట్‌ను ఎంచుకోవచ్చు. లేదూ డెస్క్‌టాప్‌ మీద సేవ్‌ అయ్యేంతవరకు వేచి చూడొచ్చు. మొజావే, ఆ తర్వాతి మ్యాక్‌ ఓస్‌లో స్క్రీన్‌షాట్‌ తీసుకోవటానికి, స్క్రీన్‌ రికార్డ్‌ చేసుకోవటానికి షిఫ్ట్‌, కమాండ్‌, 5 బటన్లను నొక్కితే చాలు.


సహాయం కోరడానికి

సిస్టమ్‌కు సంబంధించి అప్పుడప్పుడు ఏదైనా సహాయం అవసరపడొచ్చు. దీనికి కర్సర్‌తోనే హెల్ప్‌ మెనూలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈసారి షిఫ్ట్‌, కమాండ్‌, ప్రశ్న గుర్తును నొక్కి చూడండి. హెల్ప్‌ ఆప్షన్‌ ఓపెన్‌ అవుతుంది.


కొత్త ఫోల్డర్‌ కోసం

ఎప్పుడూ ఏదో కొత్త ఫోల్డర్‌ తెరిచేవారికి ఉపయోగపడే చిట్కా ఇది. కర్సర్‌తో సృష్టించుకోవటం కష్టమనుకుంటే షిఫ్ట్‌, కమాండ్‌, ఎన్‌ బటన్లను నొక్కండి. క్షణంలో కొత్త ఫోల్డర్‌ ప్రత్యక్షమవుతుంది.


ప్రిఫరెన్సులు ఇలా

ప్రిఫరెన్సులను చూడటానికి మెనూ బార్‌లో యాప్‌ పేరు మీద నొక్కి, కర్సర్‌తో కిందికి వెళ్తుంటారు. కానీ దీనికి తేలికైన ఉపాయం ఉంది. కమాండ్‌, కామా బటన్లను నొక్కితే వాడుతున్న యాప్‌నకు సంబంధించిన ప్రిఫరెన్స్‌ విండో దానంతటదే తెరచుకుంటుంది.


యాప్‌ నుంచి బలవంతంగా

ఏదైనా యాప్‌ నుంచి బలవంతంగా బయటకు రావాల్సి వచ్చినప్పుడు ఆప్షన్‌, కమాండ్‌, ఎస్కేప్‌ కలిపి నొక్కాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని