Olympic Medals: అన్నీ ‘వ్యర్థ’ పతకాలే!

నీరజ్‌ చోప్రా బంగారు పతకం, మీరాబాయి చాను వెండి పతకం, పి.వి. సింధు కాంస్య పతకం.. ఇలా టోక్యో ఒలింపిక్స్‌లో ఎందరెందరో క్రీడాకారులు ఎన్నెన్నో పతకాలు గెలుచుకున్నారు. అవన్నీ

Updated : 11 Aug 2021 16:22 IST

నీరజ్‌ చోప్రా బంగారు పతకం, మీరాబాయి చాను వెండి పతకం, పి.వి. సింధు కాంస్య పతకం.. ఇలా టోక్యో ఒలింపిక్స్‌లో ఎందరెందరో క్రీడాకారులు ఎన్నెన్నో పతకాలు గెలుచుకున్నారు. అవన్నీ ఎలా తయారయ్యాయో తెలుసా?

టోక్యో ఒలింపిక్‌ క్రీడల పతకాలన్నీ ‘వ్యర్థ’ పతకాలే! క్రీడాకారులంతా ఎంతో కష్టపడి, ఎంతగానో పోరాడి పతకాలు సాధిస్తే అలా అంటారేంటని అనుకుంటున్నారా? దీనర్థం నిష్ఫలమని కాదు. వ్యర్థాలతో తయారైనవేనని. అవును. టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలకు బహూకరించిన పతకాలన్నీ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నుంచి తయారైనవే మరి. వీటిని సేకరించటం  దగ్గర్నుంచి తయారు చేయటం వరకూ ఆద్యంతమూ ఆసక్తికర క్రీడల మాదిరిగానే సాగింది. 

పాత మొబైళ్లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాలతో పోగుపడుతున్న ఇ-వ్యర్థం అంతా ఇంతా కాదు. ప్రపంచానికిది కొత్త చెత్త తిప్పలు తెచ్చిపెడుతోంది. నిజానికి పాత ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి వంటి లోహాలుంటాయి. కానీ చాలామంది వీటిని పారెయ్యటమో, కాల్చేయటమో చేస్తుంటారు. వీటిని విడగొట్టి, సంగ్రహించగలిగితే బోలెడంత బంగారాన్ని, వెండిని వెలికితీయొచ్చు. అందుకే ఇ-వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే దిశగా జపాన్‌ వినూత్నంగా ఆలోచించింది. ఒలింపిక్స్‌ పోటీల్లో విజేతలకు బహూకరించే పతకాలన్నింటినీ ఇ-వ్యర్థాల నుంచే తయారుచేయాలని సంకల్పించి, విజయం సాధించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రెండేళ్ల పాటు బృహత్తర ఉద్యమమే నడిపించింది. పాత ఎలక్ట్రానిక్‌ పరికరాలను దానం చేయాలని కోరటం ప్రజలనూ ఆలోచింపజేసింది. ఒలింపిక్‌ క్రీడల్లో తామూ భాగస్వామ్యం అవుతున్నామనే భావనతో సమరోత్సాహంతో పాల్గొన్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలనే తేడా లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు పాత మొబైళ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను ఇచ్చేశారు.

32 కిలోల బంగారం

ప్రజలు దానం చేసిన పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో సుమారు 80 టన్నుల వ్యర్థాలు పోగుపడ్డాయి. వీటిని విడగొట్టి, శుద్ధిచేస్తే ఎంత బంగారం వెలికి వచ్చిందో తెలుసా? 32 కిలోలు! అంతేనా? 3,492 కిలోల వెండి, 2,199 కిలోల కాంస్యం (కంచు) కూడా లభించింది. మొత్తం ఒలింపిక్‌ పతకాలన్నింటినీ వీటితోనే తయారు చేశారు. ఇలా మొత్తం ఒలింపిక్‌ పతకాలన్నింటినీ పునర్వినియోగ లోహాలతోనే రూపొందించిన మొట్టమొదటి దేశం జపానే. నిజానికిది కొత్త ఆలోచనేమీ కాదు. రియోలో 2016లో జరిగిన ఒలింపిక్‌ క్రీడల సందర్భంగానూ కారు విడిభాగాలు, అద్దం ఉపరితలాల నుంచి వెండిని సేకరించారు. దీంతోనే 30% పతకాలు తయారు చేశారు.

పెద్ద ఉపద్రవం

ఇ-వ్యర్థాలు పర్యావరణానికి సరికొత్త శత్రువుగా మారాయి. ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 5.36 కోట్ల టన్నుల ఇ-వ్యర్థం పోగయ్యింది! ఇది 350 మహా భారీ నౌకల సైజుకు సమానం. ఇ-వ్యర్థాలు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో ఐదొంతుల కన్నా ఎక్కువగా పెరిగాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు డిమాండ్‌ పెరగటం, ఇవి అంత ఎక్కువకాలం మన్నక పోవటం, మరమ్మతుకు అవకాశాలు తక్కువగా ఉండటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. పాత ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సక్రమంగా సేకరణ కేంద్రాలకు, విడగొట్టటానికి వస్తున్నవి ఐదో వంతు కన్నా తక్కువే. ఇ-వ్యర్థాల వెల్లువను అడ్డుకోకపోతే మున్ముందు పర్యావరణాన్ని పెద్ద దెబ్బే తీస్తుంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రయత్నం కొత్త మార్గం చూపుతోంది. పారిస్‌లో 2024లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే తదుపరి ఒలింపిక్స్‌ ముఖ్య నినాదాలు ‘సామాజిక మార్పు, పర్యావరణ సంరక్షణను ప్రోత్సహించటమే’ మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని