Google Reward: ఆండ్రాయిడ్‌లో బగ్‌ కనిపెట్టి.. గూగుల్ రివార్డు పట్టేసి! 

ఆండ్రాయిడ్ ఓఎస్‌లో బగ్‌ కనిపెట్టినందుకు అసోంకు చెందిన రోనీ దాస్‌ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గూగుల్ నగదు బహుమతిని ప్రకటించింది. 

Updated : 16 Dec 2021 19:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తాము రూపొందించే ప్రోగ్రాంలు, ఓఎస్‌, యాప్‌లు వంటి వాటిని భద్రత పరంగా మెరుగుపరిచేందుకు బగ్‌ బౌంటీ ప్రోగ్రాంలు నిర్వహిస్తుంటాయి. ఇందులో పాల్గొనే హ్యాకర్స్‌ వాటిలో లోపాలుంటే వాటిని గుర్తించి కంపెనీలకు తెలియజేస్తారు. వారిని ఎథికల్‌ హ్యాకర్స్‌ అంటారు. అందుకు సదరు కంపెనీలు వారికి నగదు బహుమతులు అందిస్తాయి. ఇలా ఎంతో మంది హ్యాకర్స్‌ సాఫ్ట్‌వేర్స్‌లో లోపాలను గుర్తించి రూ. లక్షల్లో నగదు బహుమతులు గెలుపొందారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్‌ సిస్టమ్ (ఓఎస్‌) ఆండ్రాయిడ్‌లో బగ్‌ను గుర్తించినందుకు అసోంలోని బొంగైగావ్‌కు చెందిన రోనీ దాస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌కు గూగుల్ 5,000 డాలర్ల (సుమారు రూ. 3.5 లక్షల) రివార్డ్‌ను అందించింది. ఈ మేరకు గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీమ్‌ ఈ-మెయిల్‌ ద్వారా రోనీ దాస్‌కు సమాచారాన్ని తెలియజేసింది. 

ఈ ఏడాది మేలో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం కోసం అప్లికేషన్‌ రూపొందిస్తున్నప్పుడు ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్‌ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తున్నట్లు రోనీ దాస్‌ గుర్తించాడు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోన్‌ కెమెరా, మైక్రోఫోన్‌, లొకేషన్‌కు సంబంధించిన సమాచారం యూజర్‌ ప్రమేయం లేకుండా డెవలపర్స్‌కు చేరిపోతుందని గుర్తించాడు. వెంటనే దీని గురించి గూగుల్‌కు తెలియజేశాడు. తర్వాత గూగుల్‌ సాంకేతిక బృందం దాస్‌తో కలిసి బగ్‌ను సరిచేయడంపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఈ బగ్‌ను గూగుల్ పూర్తిగా సరిచేసిందా, లేదా అనే దానిపై స్పష్టతలేదు. గతంలో కూడా రోనీ దాస్‌ గౌహతీ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో తను కనుగొన్న బగ్‌ను సరిచేయడం వల్ల సైబర్‌ నేరగాళ్లు యూజర్‌ ప్రమేయం లేకుండా వారి సమాచారాన్ని సేకరించలేరని వెల్లడించాడు. ప్రస్తుతం రోనీ దాస్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భవిష్యత్తుల్లో మరిన్ని బగ్స్‌ను గుర్తించి సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని