Bhasha Sangam: ‘భాషా సంగం’.. ఒకేయాప్‌తో ఉచితంగా 22 భారతీయ భాషలు

దేశ ప్రజలు 22 రకాల భారతీయ భాషలను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ భాషా సంగం అనే యాప్‌ను రూపొందించింది. ఇందులోని కోర్సు పూర్తి చేసిన యూజర్స్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది. 

Published : 27 Dec 2021 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ప్రజల్లో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘భాషా సంగం’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఏక్‌ భారత్ శ్రేష్ఠ్‌ భారత్‌’ కింద ప్రజలు దేశంలోని 22 అధికారిక భాషలను నేర్చుకునేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ ఈ యాప్‌ను రూపొందించింది. ఇది పూర్తిగా ఉచితం. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కు ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లో భాషా సంగం యాప్‌ అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, సంస్కృతం, కొంకణీ, అస్సామీ, బెంగాలీ‌, గుజరాతీ‌, హిందీ, పంజాబీ, సింధి, కశ్మీరీ, ఉర్దూ, బోడో, సంథలి, మైథిలీ, డోగ్రీ భాషలకు సంబంధించిన 100కు పైగా ప్రాథమిక వాక్యాలను యూజర్స్‌ ఈ యాప్‌ ద్వారా నేర్చుకోవచ్చు. దేశంలోని విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రజలకు మరింత చేరువచేయడంతోపాటు, వారి మధ్య భాషాపరమైన ఇబ్బందులు తొలగించేందుకు ఈ యాప్‌ ఎంతగానో సాయపడుతుందని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. భాషా సంగం యాప్‌కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు. 

* ఈ యాప్‌లో ప్రతి భాషకు సంబంధించి కోర్సు ఉంటుంది. ఇందులోని పాఠ్యాంశాలను గేమ్ తరహాలో రూపొందించారు. 

* ప్రతి పాఠ్యాంశంలోని ప్రశ్నలకు యూజర్స్‌ ఎంత ఆసక్తిగా జవాబిస్తున్నారనే దాని ఆధారంగా తర్వాతి పాఠ్యాంశం ఉంటుంది. 

* యూజర్స్ ఆసక్తిని పెంపొందించేలా డైలీ ప్రాక్టీస్‌ సెషన్స్‌ ఉంటాయి. ప్రతి వాక్యంలోని పదాలను యూజర్స్ సులువుగా అర్థం చేసుకునేలా వాటికి సంబంధించిన బొమ్మలతో కూడిన ఉదాహరణలు ఉన్నాయి.  

*  దేశంలోని వివిధ సంస్కృతులకు సంబంధించి 44 ప్రత్యేక పాత్రలను ఈ యాప్‌లో చూడొచ్చు.

* ఈ యాప్‌ ద్వారా యూజర్స్ భారతీయ సంస్కృతిని సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా 500 పైగా చిట్కాలను ఉచితంగా అందిస్తుంది. 

* ప్రతి ప్రశ్నకు జవాబిచ్చిన వెంటనే కింద దానికి సంబంధించిన విశ్లేషణ కనిపిస్తుంది. అలానే పాఠ్యాంశం పూర్తయిన వెంటనే దానికి సంబంధించి యూజర్ పురోగతిని సూచించేలా స్టార్ మార్కింగ్‌తో రేటింగ్ ఉంటుంది. 

* మొత్తం కోర్సు పూర్తయిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని