వాట్సాప్‌ వద్దు..సిగ్నల్ ముద్దు: మస్క్‌

ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురావడంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. యూజర్స్‌ అందరూ వాట్సాప్‌కి బదులు సిగ్నల్ యాప్‌ని ఉపయోగిచాలని సూచించారు....

Updated : 08 Jan 2021 18:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురావడంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. యూజర్స్‌ అందరూ వాట్సాప్‌కి బదులు సిగ్నల్ యాప్‌ని ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ‘యూజ్‌ సిగ్నల్‌’ (సిగ్నల్‌ను ఉపయోగించండి) అని ట్వీట్ చేశారు. దీంతో సిగ్నల్‌ యాప్‌కు రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరిగాయి. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అప్‌డేట్ చేసిన కొత్త పాలసీని యూజర్స్‌ అంగీకరించని తరుణంలో వారి ఖాతా తొలగించబడుతుందని అందులో పేర్కొంది. కొత్త పాలసీ అమలుతో యూజర్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని వాట్సాప్‌ ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకోనుంది. ఈ నిర్ణయంపై యూజర్స్‌ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సిగ్నల్‌ యాప్‌ కూడా వాట్సాప్‌ తరహాలోనే ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్‌తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌, ప్రైవసీ రీసెర్చర్స్‌, విద్యావేత్తలు, జర్నలిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిగ్నల్‌తో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్ వాట్సాప్‌ ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది యూజర్స్‌ సిగ్నల్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. దీంతో యాప్‌లో రిజిస్టర్‌ చేసుకునే వారి సంఖ్య పెరగడంతో కొంత మంది యూజర్స్‌కి వెరిఫికేషన్‌ కోడ్‌లు కూడా రావడంలేదట. దీనిపై సిగ్నల్‌ స్పందిస్తూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. దీనికంటే ముందే మస్క్‌ ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలో కాంగ్రెస్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడికి ఫేస్‌బుక్‌ కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన డొమినో ఎఫెక్ట్ పేరుతో పరోక్షంగా ఫేస్‌బుక్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. గతంలో కూడా మస్క్‌ సోషల్‌ మీడియా యూజర్స్‌ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించాలని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సరిగా పనిచేయడంలేదని ఆరోపిస్తూ తన కంపెనీకి చెందిన ఫేస్‌బుక్‌ పేజ్‌లను టెస్లా తొలగించింది.

ఇవీ చదవండి..

ఎలాన్‌ మస్క్‌ ‘వింత’ స్పందన

వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ.. ఓకే చెప్పారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని