iPhone/iPad: ఐఫోన్‌ పాస్‌కోడ్ మర్చిపోయారా..?ఇలా రీసెట్ చేసుకోండి..

ఐఫోన్‌/ఐపాడ్ పాస్‌కోడ్ మర్చిపోతే వాటిలోని డేటాను డిలీట్ చేసి పాక్‌కోడ్‌ను రీసెట్ చేయొచ్చు. అందుకు ఏం చేయాలి? ఎలా పాస్‌కోడ్‌ను రీసెట్ చేయాలో తెలుసుకుందాం. 

Published : 22 Dec 2021 14:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరపు అనేది మానవ సహజం. అందుకు ఎవరూ అతీతులు కారు. రోజులో చేయాలనుకున్న పనుల నుంచి ముఖ్యమైన పాస్‌వర్డ్‌ల వరకు ఎన్నో మరిచిపోతుంటాం. అయితే కొన్నిసార్లు మనం ఎక్కువ రోజులు వాడకపోవడం వల్ల గానీ, కొత్త డివైజ్‌ల మోజులో పడటం వల్ల పాత ఫోన్ల పాస్‌కోడ్‌లు మర్చిపోతుంటాం. ఆరు అంకెలే అయినా కొన్నిసార్లు వాటిని గుర్తుపెట్టుకోలేకపోతుంటాం. మరి మీ పాత ఐఫోన్ లేదా ఐపాడ్ పాస్‌వర్డ్ మర్చిపోతే, అందులోని డేటా డిలీట్ చేసి తిరిగి ఎలా రీసెట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

యాపిల్ కంపెనీ ఇటీవలే కొత్తగా ఐఓఎస్‌ 15ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలానే చిన్నపాటి అప్‌డేట్‌లతో ఐఓఎస్ 15.2 వెర్షన్‌లను తీసుకొచ్చింది. ఒకవేళ మీ డివైజ్‌ ఐఓఎస్‌ 15.2 కంటే ముందు వెర్షన్‌ ఐఓఎస్‌ 15.1 లేదా దానికంటే ముందు ఓఎస్‌తో పనిచేస్తుంటే మీ డివైజ్‌ను కంప్యూటర్‌/పీసీకి కనెక్ట్ చేసి రీసెట్ చేయాలి. అదే ఐఓఎస్‌ 15.2 ఆపై వెర్షన్స్‌తో పనిచేస్తుంటే ఏ డివైజ్‌కు కనెక్ట్ చేయకుండానే రీసెట్ చేయొచ్చు.

ఐఓఎస్‌ 15.2

* మీరు పాస్‌కోడ్ మర్చిపోయిన డివైజ్‌లో ఎరేజ్‌ ఐఫోన్‌/ఐపాడ్ అనే ఆప్షన్ కనిపించే వరకు తప్పు పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తుండాలి.

* తర్వాత ఎరేజ్‌ ఐఫోన్/ఐపాడ్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మిమ్మల్ని ఎరేజ్‌ ఐఫోన్/ఐపాడ్ కన్ఫర్మ్‌ చేయమని అడుగుతుంది. దాన్ని కూడా ఓకే చేస్తే మీ యాపిల్ ఐడీ, పాస్‌వర్డ్ మీ ఖాతాలోకి లాగిన్ అవ్వమని సూచిస్తుంది.

* ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అయిన తర్వాత ఎరేజ్‌ ఐఫోన్/ఐపాడ్‌పై క్లిక్ చేస్తే డివైజ్‌ నుంచి మీ డేటా, సెట్టింగ్స్ డిలీట్ అవుతాయి.

* తర్వాత మీ ఐఫోన్‌/ఐపాడ్ రీస్టార్ట్‌ అవుతుంది. అక్కడి నుంచి మీ ఐఫోన్/ఐపాడ్ స్క్రీన్‌పై కనిపించే సూచనలు అనుసరిస్తే బ్యాకప్‌ నుంచి మీ డేటా రికవరీ చేయడంతోపాటు, సెట్టింగ్స్‌ రీసెట్ చేసి, కొత్త పాస్‌కోడ్‌ను పెట్టుకోవచ్చు.

ఐఓఎస్ 15.1

* ముందుగా మీ ఐఫోన్/ఐపాడ్‌ను డీఎఫ్‌యూ రికవరీ మోడ్‌లో ఉంచాలి. తర్వాత డివైజ్‌ను కంప్యూటర్ లేదా పీసీకి కనెక్ట్ చేయాలి.

* సిస్టంలో ఐట్యూన్స్‌ ఓపెన్ చేసి మీ డివైజ్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు స్క్రీన్‌ మీద పాప్‌-అప్‌ విండో ఓపెన్ అవుతుంది.

* అందులో రీస్టోర్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ డివైజ్‌ స్క్రీన్‌ మీద రికవరీ మోడ్‌లో డేటా డౌన్‌లోడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అది పూర్తయిన తర్వాత మీ ఐఫోన్‌/ఐపాడ్ స్విచ్ఛాఫ్ చేసి కంప్యూటర్‌/పీసీ నుంచి డిస్‌కనెక్ట్ చేయాలి.

* ఆ తర్వాత ఎప్పటిలానే మీ ఐఫోన్‌/ఐపాడ్ స్విచ్ఛాన్ చేస్తే మీ ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది.

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని