ఆన్‌లైన్‌ సమావేశాల్లో నకి‘లీలలు’ చెల్లవిక

ఒకవైపు లాక్‌డౌన్లు. మరోవైపు ఇంటి నుంచే పనులు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. జూమ్‌, స్కైప్‌ వంటి వీడియో సమావేశ వేదికలకు ఎంత ఆదరణ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. మరి ఒకరికి బదులు లేదా ఎవరికీ తెలియకుండా ఎవరైనా ఇలాంటి వర్చువల్‌ సమావేశాలకు హాజరవుతుంటే

Updated : 26 May 2021 12:18 IST

ఒకవైపు లాక్‌డౌన్లు. మరోవైపు ఇంటి నుంచే పనులు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. జూమ్‌, స్కైప్‌ వంటి వీడియో సమావేశ వేదికలకు ఎంత ఆదరణ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. మరి ఒకరికి బదులు లేదా ఎవరికీ తెలియకుండా ఎవరైనా ఇలాంటి వర్చువల్‌ సమావేశాలకు హాజరవుతుంటే? ఇలాంటి నకిలీ వ్యక్తులను గుర్తించటమెలా? ఇందుకోసమే ఐఐటీ రోపర్‌, ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఓ వినూత్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని పేరు ‘ఫేక్‌బస్టర్‌’. ఇది వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొనే నకిలీ వ్యక్తులను ఇట్టే పట్టేసుకుంటుంది. అంతేకాదు, సామాజిక మాధ్యమాల్లో ఇతరులను గేలి చేయటానికి, పరువు తీయటానికి వాడుకున్న ముఖాలనూ గుర్తిస్తుంది. సమావేశాలు జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనేవారి వీడియోను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, హాస్య స్ఫోరకంగా మార్చినా పోల్చుకుంటుంది. ఫేక్‌బస్టర్‌ను జూమ్‌, స్కైప్‌లతో పరీక్షించి చూశామని దీని రూపకర్తలు చెబుతున్నారు. మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే- ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూ పనిచేస్తుండటం.

ఏమాత్రం అనుమానం రాకుండా మీడియా అంశాలను మార్చేసే అధునాతన కృత్రిమ మేధ పరిజ్ఞానాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఫేక్‌బస్టర్‌ 90% కచ్చితత్వంతో నకిలీ వ్యక్తులను పట్టుకుంటుండటం విశేషం. దీన్ని ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లతో అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌ల వంటి వాటికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు. నకిలీ ఆడియోలను గుర్తించేలా కూడా దీన్ని రూపొందించనున్నామని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ అభినవ్‌ డాల్‌ చెబుతున్నారు. నకిలీ వార్తలు, అశ్లీల దృశ్యాల వంటివి ప్రసారం చేయటానికి మీడియా అంశాలను మార్చటం ఇటీవల ఎక్కువైంది. ఇది వీడియో కాలింగ్‌ వేదికలకూ విస్తరించింది. ముఖ కవళికలను బదిలీ చేసే స్ఫూఫింగ్‌ టూల్స్‌ను ఇందుకు విరివిగా వాడుకుంటున్నారు. ఇవి ఏమాత్రం అనుమానం కలిగించకుండా నిజమేనని అనిపించే విధంగానే ఉంటాయి. ఇలాంటి ధోరణి ఆన్‌లైన్‌ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలకూ విస్తరించే ప్రమాదముందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి డీప్‌ఫేక్‌ దృశ్యాలు, చిత్రాలనూ ఫేక్‌బస్టర్‌ గుర్తించగలదని డాల్‌ పేర్కొంటున్నారు. ప్రత్యక్ష వీడియో సమావేశాలు జరుగుతున్నప్పుడు నకిలీ వ్యక్తులను గుర్తించే మొట్టమొదటి టూల్స్‌లో తమదీ ఒకటని, ఇది త్వరలోనే మార్కెట్‌లోకి రావొచ్చని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని