నీటి శుద్ధికి ‘సూక్ష్మ’ రోబోలు

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు! శాస్త్రవేత్తల దృష్టి ఎప్పుడూ సమస్యలకు పరిష్కారాలను అన్వేషించటం మీదే. ఈ క్రమంలోనే కొత్త కొత్త పద్ధతులు, పరికరాలు పుట్టుకొస్తుంటాయి. ఇటీవల చెక్‌

Updated : 02 Jun 2021 04:39 IST

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు! శాస్త్రవేత్తల దృష్టి ఎప్పుడూ సమస్యలకు పరిష్కారాలను అన్వేషించటం మీదే. ఈ క్రమంలోనే కొత్త కొత్త పద్ధతులు, పరికరాలు పుట్టుకొస్తుంటాయి. ఇటీవల చెక్‌ రిపబ్లిక్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కెమిస్ట్రీ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించిన సూక్ష్మ గొట్టాల రోబోలు (ట్యూబులర్‌ మైక్రోరోబోస్‌) అలాంటివే. నీటిలోని కాలుష్య కారకాలను తొలగించటానికి ఎంతగానో ఉపయోగపడగల వీటి పొడవు సుమారు 10 మైక్రోమీటర్లు. సూర్యరశ్మినే వినియోగించుకుంటాయి. అయస్కాత క్షేత్రం ద్వారా కదులుతాయి. సాధారణంగా నీటిలో ఈదే సూక్ష్మ రోబోలు చాలావరకు అంత త్వరగా లోతును మార్చుకోలేవు. నీటి ఉపరితలానికి సమీపాన తేలటమో లేదంటే అడుగుకు మునగటమో చేస్తుంటాయి. కానీ తాజా రోబోలు మాత్రం బాగా లోతులకు చొచ్చుకు వెళ్లగలవు. అలాగే నీటి ఉపరితలానికీ చేరుకోగలవు. సూక్ష్మక్రిముల లోపలి పనితీరును అనుకరించటం మూలంగానే ఇది సాధ్యమవుతోంది. వీటిని మూడు పొరలతో రూపొందించారు. గొట్టం లోపలి పొరను కాడ్మియం సల్ఫేట్‌తో తయారుచేశారు. ఇది కాంతిని గ్రహించి, ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఇవి నీటితో చర్య జరిపి చిన్న చిన్న భాగాలుగా విడగొడుతుంది. దీంతో కొంత చోదకశక్తి పుట్టుకొస్తుంది. ఫలితంగా రోబోలు సెకనుకు 15 మైక్రోమీటర్ల వేగంతో ముందుకు కదులుతాయి. ఐరన్‌ నానోపార్టికల్స్‌తో తయారైన మధ్యపొర అయస్కాంత క్షేత్రం సాయంతో వేగంగా కదిలేలా చేస్తుంది. ఇక టైటానియం ఆక్సైడ్‌తో కూడిన పైపొరకు కాంతి తగిలినప్పుడు రసాయన ప్రతిచర్యలు ప్రేరేపితమై ఆయా రసాయనాలు క్షీణించేలా చేస్తాయి. దీంతో కలుషిత నీరు శుద్ధి అవుతుంది. ప్రిక్రిక్‌ ఆమ్లంతో కూడిన నీటిలో ఈ మైక్రోరోబోలను పరీక్షించగా.. రెండు గంటల్లోనే 70 శాతానికి పైగా కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయటం విశేషం. కాకపోతే ఎక్కువ నీటిని శుద్ధి చేయాలంటే ఇవి పెద్ద సంఖ్యలో అవసరమవుతాయి. ఎన్ని రోబోలైనా గానీ పని పూర్తయ్యాక అయస్కాంతంతో వీటిని తేలికగా నీటిలోంచి బయటకు తీయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని