మనిషిలా నేర్చుకునే కంప్యూటర్‌

గంట మోగిన చప్పుడును వినగానే నోట్లో నీరూరేలా ఓ రష్యా మానసిక నిపుణుడు కుక్కకు శిక్షణ ఇచ్చిన ప్రయోగం గురించి చదివే ఉంటారు. దీన్నే ‘అనుబంధ శిక్షణ’ అంటారు. మన అనుభవాలు, జ్ఞాపకాలు కొంతకాలం తర్వాత మెదడులో సంబంధం లేని ఆలోచనలకు ఎలా దారితీస్తాయనే దానికిది మంచి ఉదాహరణ....

Updated : 30 Jun 2021 06:28 IST

గంట మోగిన చప్పుడును వినగానే నోట్లో నీరూరేలా ఓ రష్యా మానసిక నిపుణుడు కుక్కకు శిక్షణ ఇచ్చిన ప్రయోగం గురించి చదివే ఉంటారు. దీన్నే ‘అనుబంధ శిక్షణ’ అంటారు. మన అనుభవాలు, జ్ఞాపకాలు కొంతకాలం తర్వాత మెదడులో సంబంధం లేని ఆలోచనలకు ఎలా దారితీస్తాయనే దానికిది మంచి ఉదాహరణ. ఇలాంటి పద్ధతిలోనే యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్న పరికరాన్ని రూపొందించారు. మన మెదడును అనుకరిస్తూ నేర్చుకోవటం దీని ప్రత్యేకత. ఈ పరిజ్ఞానం సంప్రదాయ కంప్యూటర్ల కన్నా తక్కువ శక్తిని వినియోగించుకుంటుందని, కొన్ని భాగాలు పనిచేయకపోయినా ఆగకుండా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన మెదడులో బోలెడన్ని నాడీ కణాల అనుసంధానాలు ఉంటాయి. ఇవి కొన్ని రసాయనాల ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటుంటాయి. నాడీ కణాల మధ్య సంబంధం బలపడుతున్నకొద్దీ అవి జ్ఞాపకాలుగా స్థిరపడుతుంటాయి. దీని స్ఫూర్తితోనే శాస్త్రవేత్తలు ‘సినాప్టిక్‌ ట్రాన్సిస్టర్‌’ అనే పరికరాన్ని రూపొందించారు. ఇదో విద్యుత్‌రసాయన పరికరం. నాడీ సమాచార వాహక రసాయనాల మాదిరిగా పనిచేసే అయాన్లను ఇది ఒడిసి పట్టుకోగలదు. ఫలితంగా ఇంతకు ముందు జరిగిన పనులను ‘గుర్తుపెట్టుకోగలదు’. ఈ ప్రక్రియ క్రమంగా మన మెదడులో మాదిరిగానే అనుసంధానాలు ఏర్పడటానికి వీలు కల్పిస్తుంది. దీని సాయంతో కాంతి పడిన వెంటనే ఒత్తిడి గ్రాహకం స్పందించేలా పరికరానికి శిక్షణ ఇవ్వటం విశేషం. అంటే మన మెదడులోని నాడీ కణాల మాదిరిగానే సినాప్టిక్‌ ట్రాన్సిస్టర్లు ఒకదాంతో మరోటి అనుసంధానమై కొత్త సర్క్యూట్లను ఏర్పరచుకున్నాయన్నమాట. అధునాతన కంప్యూటర్లు ఎంత గొప్పవైనా మనిషి మెదడుకు సరితూగలేవు. అవసరాన్ని బట్టి నాడీ అనుసంధానాలు ఎప్పటికప్పుడు మారగలవు. తప్పులను సవరించుకోగలవు. ఇలాంటి సామర్థ్యం కంప్యూటర్లకూ అబ్బితే మున్ముందు అన్నిరంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధ్యం కాగలదని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని