సుదూర ప్రత్యక్షం

మీరు గదిలోనే కూర్చున్నారు. ఎక్కడో అమెరికాలో ఉండే బంధువు మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నారు. అలాగని ఆయనేమీ ఇక్కడికి రాలేదు. అక్కడే ఉన్నారు. అయినా ప్రత్యక్షంగా కనిపిస్తూ సంభాషిస్తుంటే? అలాంటి విచిత్రాన్నే సుసాధ్యం చేస్తోంది హోలోపోర్టేషన్‌ టెక్నాలజీ.మన సమాచార సాధన స్రవంతి నిత్య నూతనంగా మారుతూనే

Updated : 13 Sep 2022 15:30 IST

హోలోపోర్టేషన్‌

మీరు గదిలోనే కూర్చున్నారు. ఎక్కడో అమెరికాలో ఉండే బంధువు మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నారు. అలాగని ఆయనేమీ ఇక్కడికి రాలేదు. అక్కడే ఉన్నారు. అయినా ప్రత్యక్షంగా కనిపిస్తూ సంభాషిస్తుంటే? అలాంటి విచిత్రాన్నే సుసాధ్యం చేస్తోంది హోలోపోర్టేషన్‌ టెక్నాలజీ.

న సమాచార సాధన స్రవంతి నిత్య నూతనంగా మారుతూనే వస్తోంది. ఉత్తరాలు, టెలిగ్రామ్‌లను దాటుకొని ఫోన్లు, మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, ఈమెయిళ్లు.. ఇలా రోజుకో కొత్త సమాచార సాధనాలు వస్తూనే ఉన్నాయి. ఉత్తరాలు, మెయిళ్లు అక్షరాలు, ఫొటోలకే పరిమితం. ఫోన్లు మాటలతోనే ఆగిపోకుండా వీడియో సంభాషణలకూ అవకాశం కల్పించాయి. మనిషిని చూస్తున్నామనే గానీ వీడియో కాల్స్‌ సైతం ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుతున్న అనుభూతిని ఇవ్వలేవు. ఈ కొరతను తీర్చటానికే ముందుకొస్తోంది హోలోపోర్టేషన్‌. ఉన్నచోటు నుంచి కదలకుండానే ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేసే వినూత్న ప్రక్రియ. ఇది ఒక్క మానవీయ సంబంధాల్లోనే కాదు.. మున్ముందు వివిధ రంగాల్లో, పరిశ్రమల్లో పెను మార్పులు తీసుకొస్తుందనటం నిస్సందేహం.

హోలోపోర్టేషన్‌ అంటే?

హోలోగ్రామ్‌, టెలీపోర్టేషన్‌ కలయికే హోలోపోర్టేషన్‌. అత్యంత నాణ్యమైన 3డీ రూపాలను పునర్నిర్మించి, కంప్రెస్‌ చేసి, అప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూలకైనా పంపించే 3డీ క్యాప్చర్‌ టెక్నాలజీ. ఇలా ఎక్కడో సుదూరంగా ఉన్నవారిని మన ముందు నిలబెడుతుంది. వారిని చూడటానికి, వారితో మాట్లాడటానికి, చెప్పేది వినటానికి వీలు కల్పిస్తుంది. అంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందన్నమాట. ఇంతకీ హోలోగ్రామ్‌ అంటే ఏంటి? హోలోగ్రఫీ పద్ధతిలో తీసే 3డీ దృశ్యం. హోలోగ్రఫీ అనేది మనుషులు, వస్తువుల నుంచి వెలువడే కాంతిని పసిగట్టే ఫోటోగ్రాఫిక్‌ ప్రక్రియ. స్టార్‌ వార్స్‌, ఐరన్‌ మ్యాన్‌ వంటి సినిమాల్లో అప్పటికప్పుడు మనుషులు, వస్తువులు దృశ్యకాంతి రూపంలో ప్రత్యక్షమవటం చూసే ఉంటారు. ఇవి హోలోగ్రామ్‌ రూపాలే. వీటిని ఎక్కడికైనా పంపించే పరిజ్ఞానమే హోలోపోర్టేషన్‌. ఇప్పటివరకూ సైన్స్‌ ఫిక్షన్‌ కథలకే పరిమితమైన ఊహను ఇది వాస్తవ జీవితంలో నిజం చేసి చూపిస్తోంది.

ఎలా పనిచేస్తుంది?

హోలోపోర్టేషన్‌లో 3డీ క్యాప్చర్‌ టెక్నాలజీ,  మిక్స్‌డ్‌ రియాలిటీ కీలక పాత్ర పోషిస్తాయి. హోలోగ్రామ్‌లను సృష్టించటానికి 3డీ దృశ్యాలను చిత్రీకరించే కెమెరాలు అవసరం. గదిలో కనీసం రెండు కెమెరాలు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కెమెరాలుంటే మరింత నాణ్యమైన దృశ్యాలకు వీలుంటుంది. ఇవి ఒకేసారి అన్ని కోణాల్లోంచి చిత్రీకరిస్తాయి. మన ఆకారాలను, కదలికలను పసిగట్టి 3డీ నమూనాలుగా మలుస్తాయి. వీటిల్లో అవసరమైన సమాచారాన్ని కంప్రెస్‌ చేసి హోలోలెన్స్‌ వంటి మిక్స్‌డ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌కు చేరవేస్తాయి. ఇది దృశ్యాలను 3డీ హోలోగ్రామ్‌గామారుస్తుంది. అచ్చంగా నిజ రూపాన్ని తలపించే దీన్ని ఎక్కడికంటే అక్కడికి పంపించేస్తుంది. మన ముందు ‘సజీవంగా’ నిలబెడుతుంది. అక్కడ చేసే పనులన్నీ ఇక్కడ చేసినట్టుగానే ఉంటాయి. 3డీ వీడియోకు మాటలు సైతం జోడించటం వల్ల మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ప్రత్యక్ష ప్రసారంగానే కాదు, రికార్డు చేసిన దృశ్యాలనూ పంపించుకోవచ్చు. కాకపోతే అవతల కూడా ఇలాంటి సదుపాయాలే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్నెన్నో ప్రయోజనాలు

మన ప్రపంచం ఇప్పటిలా ఇంతకు ముందెన్నడూ అనుసంధానం కాలేదు. ఏ మూల ఏం జరిగినా ఇట్టే విశ్వ వ్యాప్తమవుతోంది. 19వ శతాబ్దంలో వైర్‌లెస్‌ టెలీగ్రఫీ ఆవిష్కరణతోనే దీనికి బీజం పడింది. రేడియో అందరి సాధనంగా మారిపోవటం తెలిసిందే. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, 1965లో ఎంఐటీలో పుట్టుకొచ్చిన ఈమెయిల్‌, 1989లో పురుడు పోసుకున్న వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ అన్నీ సమాచార విప్లవానికి దారితీసినవే. స్మార్ట్‌ఫోన్ల రాకతో ఇది మరింత విజృంభించింది. స్కైప్‌, జూమ్‌ వంటి వీడియో కాన్ఫరెన్స్‌ వేదికలతో ఇంకాస్త ఊపందుకుంది. ప్రతి ఆవిష్కరణా గణనీయమైన మార్పును తెచ్చిపెట్టిందే. హోలోపోర్టేషన్‌ సైతం వివిధ రంగాల్లో ఇలాంటి ప్రభావాన్నే చూపగలదని గట్టిగా భావిస్తున్నారు.

* గేమింగ్‌: హోలోపోర్టేషన్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి ఆత్రుతగా ఎదురుచూస్తోంది గేమింగ్‌ రంగమే. ప్రత్యక్ష హోలోగ్రామ్‌ రూపంలో సుదూరంగా ఉన్నవారితో కలిసి ఆటలాడటం కొత్త అనుభూతిని ఇస్తుంది. నియాంటిక్‌ వంటి భారీ సంస్థలు ఇప్పటికే గేమ్స్‌ను హోలోపోర్టేషన్‌తో జత కలపటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మరింత నాణ్యమైన ఆగ్‌మెంటెడ్‌ అనుభవాన్ని గేమ్‌ ప్రియులకు అందించాలని ప్రయత్నిస్తున్నాయి.

* దూర వైద్యం: కొవిడ్‌ విజృంభణతో ఆడియో, వీడియోలతో డాక్టర్లను సంప్రదించటం గణనీయంగా పెరగటం చూస్తున్నదే. వీటితో సౌలభ్యం పెరిగినా ప్రత్యక్షంగా కలవలేకపోతున్నామనే బాధ మనసులో మెదులుతూనే ఉంటుంది. హోలోపోర్టేషన్‌ అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగినట్టే.

* చదువులు: హోలోపోర్టేషన్‌తో భౌగోళిక సరిహద్దులు చెరిగిపోతాయి. ఇది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఎవరైనా, ఎక్కడ్నుంచైనా చదువుకోవచ్చు. ఏదైనా నేర్చుకోవచ్చు. ఆస్ట్రేలియాలోని వూరన పార్క్‌ ప్రైమరీ స్కూల్‌ ఇప్పటికే వర్చువల్‌ తరగతి గదిని రూపొందించటమే దీనికి నిదర్శనం. వీఆర్‌ హెడ్‌సెట్లు, ఇతర హోలోపోర్టేషన్‌ టెక్నాలజీలతోనే దీన్ని తయారుచేశారు మరి.

* సమర్థ టెలికమ్యూనికేషన్‌: సంబంధాల విషయంలో మంచి కమ్యూనికేషన్‌, నమ్మకం చాలా కీలకం. హోలోపోర్టేషన్‌ ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడియో, వీడియో ఛాటింగ్‌ మాదిరిగా కాకుండా ప్రత్యక్షంగా చూస్తూ, మాట్లాడటం వల్ల గురి బాగా కుదురుతుంది. నమ్మకం పెరుగుతుంది. కార్మికులకు, ఉద్యోగులకు ప్రత్యక్షంగా పనిచేసే విధానాన్ని నేర్పించటం మూలంగా సమయం, ఖర్చు ఆదా అవుతాయి.

* వ్యాపారాలకు: ప్రపంచీకరణ వాస్తవం. దీని చుట్టూ గిరిగీయటం అసాధ్యం. ఇప్పటికే టెక్‌ సంస్థలు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఉద్యోగులను తీసుకుంటున్నాయి. కాయిన్‌బేస్‌ అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌ అయితే మరింత ముందడుగేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ఏకైక ఆఫీసునూ మూసేసింది. ఉద్యోగులందరినీ ఇళ్ల నుంచే పనిచేయమని చెప్పేసింది. ఇలాంటి సంస్థల సంఖ్య మున్ముందు బాగా పెరగనుంది. అప్పుడు హోలోపోర్టేషన్‌ కీలక కమ్యూనికేషన్‌ సాధనంగా మారుతుందనే చెప్పుకోవచ్చు.


మైక్రోసాఫ్ట్‌ అడుగు

హోలోపోర్టేషన్‌ భావనకు బీజం వేసింది మైక్రోసాఫ్ట్‌ సంస్థ. చాలాకాలంగా దీనిపై ప్రత్యేక దృష్టి నిలిపింది. పరిశోధనలు కొనసాగిస్తోంది. 3డీ క్యాప్చర్‌, మిక్స్‌డ్‌ రియాలటీ టెక్నాలజీతో కూడిన హోలోలెన్స్‌ హెడ్‌సెట్‌, మెష్‌, అజ్యూర్‌ ఫ్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. వీటితో హోలోపోర్టేషన్‌ ఇంకాస్త తేలికైంది. ఒక్క మైక్రోసాఫ్ట్‌ మాత్రమే కాదు.. పీఓఆర్‌టీఎల్‌ కంపెనీ సైతం హోలోపోర్టేషన్‌ ప్రక్రియలో ప్రత్యేకత నిరూపించుకుంటోంది. కప్‌బోర్డులాంటి పెట్టె, కెమెరాలతో ఓ వ్యవస్థను రూపొందించింది. కెమెరాల ముందు నిలబడగానే పెట్టెలో మనిషి 3డీ రూపం అప్పటికప్పుడే ప్రత్యక్షమవుతుంది. దీన్ని ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు.

ఉజ్వల భవిష్యత్తు

ప్రస్తుతం హోలోపోర్టేషన్‌ పురిటి దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే హోలోలెన్స్‌ 2.0ను విడుదల చేసింది. హోలోపోర్టేషన్‌ వ్యవస్థ ధర ఎక్కువ కావటం వల్ల ఇప్పుడింకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. చాలావరకు పెద్ద వ్యాపార, ప్రభుత్వ సంస్థలే వీటిని కొంటున్నాయి. కాలంతో పాటు టెక్నాలజీలూ అధునాతనంగా మారుతుండటం చూస్తున్నదే. దీంతో ఖర్చూ తగ్గుతుంది. వినియోగమూ పెరుగుతుంది. ఇంటింటి పరికరాలుగా మారిన కంప్యూటర్లే దీనికి నిదర్శనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని