ఫోన్‌ డిటాక్స్‌

ఫోన్‌ మీ గుప్పిట ఉందా? మీరు ఫోన్‌ గుప్పిట్లో ఉన్నారా? సమాధానం చెప్పటం కష్టమే. మన నుంచి మనల్ని ఫోన్‌ అంత స్మార్ట్‌గా లాగేసుకుంది మరి. ఒక్క క్షణమైనా విడవలేనంతగా పట్టేసుకుంది. దీనికి మరీ ఇంతలా అతుక్కుపోతే ఎలా? కాసేపైనా దీని హస్తాల్లోంచి బయటపడకపోతే ‘టెక్‌ శాంతి’ని దూరం చేసుకున్నట్టే.

Updated : 26 Jan 2022 05:47 IST

ఫోన్‌ మీ గుప్పిట ఉందా? మీరు ఫోన్‌ గుప్పిట్లో ఉన్నారా? సమాధానం చెప్పటం కష్టమే. మన నుంచి మనల్ని ఫోన్‌ అంత స్మార్ట్‌గా లాగేసుకుంది మరి. ఒక్క క్షణమైనా విడవలేనంతగా పట్టేసుకుంది. దీనికి మరీ ఇంతలా అతుక్కుపోతే ఎలా? కాసేపైనా దీని హస్తాల్లోంచి బయటపడకపోతే ‘టెక్‌ శాంతి’ని దూరం చేసుకున్నట్టే.

కంప్యూటర్‌ అయినా, టీవీ అయినా ఇప్పుడు స్మార్ట్‌ఫోనే. గడియారం, కెమెరా, వీడియో రికార్డర్‌, వాయిస్‌ రికార్డర్‌.. ఒక్కటేమిటి సమస్త పరికరాలూ ఫోన్‌లోనే నిక్షిప్తమైపోయాయి. వీటికి తోడు సామాజిక మాధ్యమాల ఉరవడి ఒకటి. ఒకపక్క మెసేజ్‌లు, నోటిఫికేషన్లు.. మరోపక్క వీడియో ఛాట్‌లు.. వీటన్నింటి మధ్య మనం ఒకరకంగా ఉక్కిరిబిక్కిరి జీవితాలనే గడుపుతున్నాం. ఇది మనల్ని తీవ్రమైన ఒత్తిడిలోకీ నెడుతుంది. అందుకే ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఫోన్లను పూర్తిగా పక్కనపెట్టటం కుదరకపోవచ్చు గానీ కొంతవరకైనా తగ్గించుకోవటం సాధ్యమే. కొన్ని యాప్స్‌లో సెటింగ్స్‌ను మార్చుకుంటే రోజులో కొంతసేపైనా దృష్టిని ఇహలోకం మీదికి మళ్లించుకోవచ్చు.


ట్విటర్‌
పీపుల్‌, టాపిక్స్‌ మ్యూట్‌

లానా ఆహారం తింటే బరువు తగ్గుతుంది. అదో అక్కడ చవకగా వస్తువులు దొరుకుతున్నాయి. అదేం సినిమా, చెత్త సినిమా. ట్విటర్‌లో ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలకు కొదవలేదు. ఎవరి ఇష్టం వారిది మరి. ఇవన్నీ మనకు నచ్చకపోవచ్చు. అవసరం లేకపోవచ్చు. కానీ పదే పదే కనిపిస్తూ సమయాన్నంతా తినేస్తుంటాయి. ఇలా మనకు నచ్చని వ్యక్తులను, వద్దనుకునే విషయాలకు దూరంగా ఉండాలనుకుంటే మ్యూట్‌ చేయటం ఓ మంచి అవకాశం. దీని ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకోవటం చాలా తేలిక. ట్వీట్‌లో ఆయా వ్యక్తుల, గ్రూపుల ప్రొఫైల్‌ పక్కన కనిపించే నిలువు మూడు చుక్కలను ట్యాప్‌ చేసి.. మ్యూట్‌ బటన్‌ను నొక్కాలి. అంతే వారికి, వాటికి సంబంధించిన ట్వీట్లు కనిపించవు. అవతలివారికి ఆ విషయం తెలియనే తెలియదు. కావాలనుకుంటే ఆయా పదాలు, పదబంధాలు, సినిమా పేర్లు.. ఇలా ఎలాంటి అంశాలనైనా మ్యూట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సెటింగ్స్‌ ద్వారా ‘ప్రైవసీ అండ్‌ సేఫ్టీ’ విభాగంలోకి వెళ్లి ‘మ్యూట్‌ అండ్‌ బ్లాక్‌’ ఆప్షన్‌ను నొక్కాలి. తర్వాత ప్లస్‌ గుర్తుమీద నొక్కి వద్దనుకునే విషయాన్ని యాడ్‌ చేసుకోవాలి.


ఫేస్‌బుక్‌
న్యూస్‌ ఫీడ్‌ నిర్వీర్యం

భిప్రాయ వేదికగా సామాజిక మాధ్యమం తీరుతెన్నులనే మార్చేసిన ఫేస్‌బుక్‌ను వదిలి ఉండలేం. అలాగని అన్ని అభిప్రాయాలనూ మన్నించలేం. వాదోపవాదాలు, వివాదాలు శరపరంపరంగా సాగుతూనే ఉంటాయి. దీంతో సమయం కోల్పోతున్నామని భావిస్తే ఫోన్‌లోంచి ఫేస్‌బుక్‌ యాప్‌ను తొలగించుకోవచ్చు. కేవలం డెస్క్‌టాప్‌కే పరిమితం కావొచ్చు. ఇక సందిగ్ధ రాజకీయాలు, యాదృచ్ఛిక మెమేల ప్రవాహంలో పడిపోకుండా చూసుకోవాలని అనుకుంటే వెబ్‌లోనూ ‘న్యూస్‌ ఫీడ్‌ ఎరాడికేటర్‌’ ఫర్‌ క్రోమ్‌ వంటి ఎక్స్‌టెన్షన్లను జోడించుకోవచ్చు. ఇవి న్యూస్‌ ఫీడ్‌ను కనిపించకుండా దాచేసి, వాటికి బదులు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలను చూపిస్తాయి.


వాట్సప్‌
రీడ్‌ రిసీప్ట్స్‌ తొలగింపు

వాట్సప్‌లో ఏదో మెసేజ్‌ పంపుతాం. అవతలివారు చదివారో లేదోనని సందేహిస్తుంటాం. బ్లూటిక్‌ కనిపించకపోతే ఎందుకు చదవలేదోనని ఆందోళన పడతాం. మళీ మళ్లీ చూస్తుంటాం. ఏదైనా మెసేజ్‌ అందినా అంతే. మనం చూసినట్టు అవతలివారికి తెలిసినప్పుడు రిప్లయి ఇవ్వపోతే బాగుండదేమోనని అన్ని పనులు మానుకొని జవాబిస్తాం. దీంతో ఒకవైపు మానసిక ఒత్తిడి చిదిమేస్తుంటుంది. మరోవైపు ఏదైనా అత్యవసర పనిలో ఉన్నప్పుడు సమయమూ వృథా అవుతుంది. ‘రీడ్‌ రిసీప్ట్స్‌’ ఫీచర్‌ను డిసేబుల్‌ చేసుకుంటే ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలను తేలికగానే తప్పించుకోవచ్చు. ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి ‘అకౌంట్‌’ను ట్యాప్‌ చేయాలి. తర్వాత ‘ప్రైవసీ’ని ఎంచుకొని, ‘రీడ్‌ రిసీప్ట్స్‌’ ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి. దీంతో మనకు అందిన, మనం పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన బ్లూటిక్‌ ఆందోళన వెంటాడకుండా చూసుకోవచ్చు.


ఇన్‌స్టాగ్రామ్‌
లైక్‌ కౌంట్‌ హైడ్‌

న మీద మనకు నమ్మకం, ఆత్మ విశ్వాసం ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు వచ్చాయన్నది విషయమే కాదు. అయినా కూడా లైక్‌ చేసినవారెవరో తెలుసుకోవాలనే తహ తహ మనసును పీకుతూనే ఉంటుంది. ఎంత పనిలో ఉన్నా చేయి ఫోన్‌ మీదికే పోతుంది. ‘లైక్‌ కౌంట్‌’ను తొలగించుకుంటే ఈ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. పోస్ట్‌ మీద కుడివైపున పైన కనిపించే మూడు చుక్కలను నొక్కి ‘హైడ్‌ లైక్‌ కౌంట్‌’ను ఎంచుకోవాలి. దీంతో లైక్‌ల సంఖ్య మాత్రమే తెలుస్తుంది. ఇదీ వద్దనుకుంటే సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీలోకి వెళ్లి పోస్ట్స్‌ను ఎంచుకోవాలి. తర్వాత ‘హైడ్‌ లైక్‌ అండ్‌ వ్యూ కౌంట్స్‌’ను ట్యాప్‌ చేయాలి. ఒకరకంగా దీన్ని ప్రజాదరణ పోటీ నుంచి తప్పుకోవటం వంటిదని అనుకోవచ్చు.


యూట్యూబ్‌
రిమూవ్‌ రిలేటెడ్‌ వీడియోస్‌

వినోదానికికైనా, విజ్ఞాన సముపార్జనకైనా యూట్యూబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనవసర వీక్షణే సమయానికి ఎసరు పెడుతుంది. ఎల్లవేళలా యూట్యూబ్‌ అవసరం లేదనుకుంటే ఫోన్‌లోంచి యాప్‌ను తొలగించి, డెస్క్‌టాప్‌ వీక్షణకే పరిమితం కావటం మంచిది. బ్రౌజర్‌లోనూ ఎక్స్‌టెన్షన్లతో మరింత నియంత్రణ సాధించొచ్చు. ఉదాహరణకు- క్రోమ్‌లో ‘ఇంప్రూవ్‌ యూట్యూబ్‌’ ఎక్స్‌టెన్షన్‌నే చూడండి. దీనిలోని రకరకాల ఫీచర్లు యూట్యూబ్‌ను మరింత బాగా వాడుకోవటానికి ఉపయోగపడతాయి. వీటిల్లో అన్నింటికన్నా ఉత్తమమైంది రీలెటెడ్‌ వీడియోల సైడ్‌బార్‌ను కనిపించకుండా చేసే ఫీచర్‌. దీంతో ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.


నోటిఫికేషన్లు
గట్టి నిర్ణయమే

ఫోన్‌ మీదికి దృష్టి మళ్లించే వాటిల్లో ప్రధానమైనవి నోటిఫికేషన్లు. వీటిల్లో నిజంగా అవసరమైనవి చాలా తక్కువే. కాబట్టి వీటి విషయంలో కాస్త గట్టి నిర్ణయమే తీసుకోవటం మంచిది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ అంగళ్ల యాప్‌లకు సంబంధించి అవసరమైన నోటిఫికేషన్లు మాత్రమే అందేలా సెటింగ్స్‌లో మార్పులు చేసుకోవాలి. దీంతో తరచూ ఫోన్‌ వంక చూడటం తప్పుతుంది.


ఈమెయిల్‌
రోజుకు రెండు సార్లే

మెయిళ్ల ఇన్‌బాక్స్‌ ఒత్తిడిని తగ్గించుకోవటానికి చాలా మార్గాలున్నాయి. రంగురంగుల ఫోల్డర్లు, ఫిల్టర్ల వంటి వాటిని వాడుకోవచ్చు. వీటిని ఎంచుకోవటంతో పాటు అలవాట్లను మార్చుకోవటం ద్వారానూ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రోజుకు ఒకట్రెండు సార్లే ఈమెయిల్‌ను తెరవటం వీటిల్లో ఒకటి. కావాలంటే నోటిఫికేషన్లను ఆఫ్‌ చేసుకొని, ఈమెయిల్‌ను చెక్‌ చేసుకోవటానికి రిమైండర్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ఈమెయిళ్లను షెడ్యూల్‌ చేసుకుంటే పనులు తేలికవుతాయి. కావాలనుకుంటే ఆటోరిప్లయి పద్ధతినీ వాడుకోవచ్చు.


లింక్డ్‌ఇన్‌
చికాకుదారుల అన్‌ఫాలో

లింక్డ్‌ఇన్‌లో అన్‌ఫాలో ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఆయా వ్యక్తుల నుంచి అందే అప్‌డేట్స్‌ను కనిపించకుండా చేస్తుంది. దీని గురించి చాలామందికి తెలుసు గానీ పెద్దగా ఉపయోగించరు. ఈసారి ఎవరైనా ప్రమోషన్ల వంటి ఇబ్బందికరమైన అప్‌డేట్స్‌తో చికాకు పరుస్తుంటే అన్‌ఫాలో మంత్రంతో తిప్పికొట్టటం మంచిది. రిమూవ్‌, అన్‌ఫ్రెండ్‌ ఆప్షన్ల కన్నా ఇది తేలికైంది. ఎందుకంటే అవతలివారికి అన్‌ఫాలో అయిన విషయం తెలియదు మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని