పరికరం..వినూత్నం

ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక ప్రదర్శన. వినూత్న పరిజ్ఞానాలు ఆవిష్కృతమయ్యే వేదిక. ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునే అధునాతన పరికరాల మేళా. కన్జ్యూమర్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఏటా నిర్వహించే సీఈఎస్‌ గురించి ఇలా ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఒకపక్క కొవిడ్‌ భయపెడుతున్నా అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఈసారి కొంగొత్త పరికరాల వెల్లువతో ఎంతగానో ఆకర్షించింది

Updated : 12 Jan 2022 01:00 IST

ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక ప్రదర్శన. వినూత్న పరిజ్ఞానాలు ఆవిష్కృతమయ్యే వేదిక. ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునే అధునాతన పరికరాల మేళా. కన్జ్యూమర్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఏటా నిర్వహించే సీఈఎస్‌ గురించి ఇలా ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఒకపక్క కొవిడ్‌ భయపెడుతున్నా అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఈసారి కొంగొత్త పరికరాల వెల్లువతో ఎంతగానో ఆకర్షించింది. విచిత్రమైన సాధనాలతో అలరించింది. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇవీ..


హెడ్‌ఫోన్స్‌.. కనిపించవు, వినిపిస్తాయి

చెవుల్లో ఇయర్‌బడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌ ధరించాల్సిన పనిలేదు. తలకు హెడ్‌ఫోన్స్‌ తగిలించుకోవాల్సిన అవసరమూ లేదు. అయినా మనకు మాత్రమే, మన చెవులకే సంగీతం, పాటలు వినిపిస్తుంటాయి. అదెలా సాధ్యం? నొవెటో ఎన్‌1 రూపొందించిన హెడ్‌ఫోన్స్‌ ఉంటే సాధ్యమే. ఇవి కంటికి అసలే కనిపించవు. ఆ మాటకొస్తే హెడ్‌ఫోన్సే ఉండవు. ఇదో మినీ సౌండ్‌బార్‌ లాంటి పరికరం. దీని ఎదురుగా కూర్చుంటే నేరుగా చెవులకే ఆడియో వినిపిస్తుంది. ఈ పరికరం మన చెవుల వైపు అల్ట్రాసౌండ్‌ తరంగాలను వెదజల్లుతుంది. అవి చెవుల వద్దకు చేరుకొని ఆడియో వినిపిస్తుంది. పక్కవాళ్లకిది అంతగా వినిపించదు. ఫోన్లతో పాటు బ్లూటూత్‌ను సపోర్టు చేసే ఎలాంటి పరికరంతోనైనా నొవెటో ఎన్‌1 హెడ్‌ఫోన్స్‌ జత కడతాయి. దీని ద్వారా ఫోన్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చు.


కారు డ్యాష్‌బోర్డు మీద 3డీ హోలోగ్రామ్స్‌

కారులో వెళ్తున్నారు. అక్కడికి చుట్టుపక్కల ఉన్న ఏటీఎంలు, హోటళ్లు, పెట్రోలు బంకుల వంటి వాటి హోలోగ్రామ్‌లు 3డీ రూపంలో డ్యాష్‌బోర్డు మీద గాలిలో పాపప్‌ అవుతుంటే? అవి ఎంత దూరంలో ఉన్నాయో కూడా తెలుస్తుంటే? జపాన్‌కు చెందిన ఇముజక్‌ అంకుర సంస్థ ఇలాంటి విచిత్ర పరిజ్ఞానాన్నే ఆవిష్కరించింది. దీని పేరు ఇముజక్‌ 3-డీ స్టీరింగ్‌ వీల్‌ డిస్‌ప్లే. స్టీరింగ్‌లో అమర్చిన 2.8 అంగుళాల తెర సాయంతో ఇది పనిచేస్తుంది. చక్రం మీదుండే మైక్రోలెన్స్‌ ద్వారా డ్యాష్‌బోర్డు మీద 3డీ రూపంలో అప్పటికప్పుడే నోటిఫికేషన్స్‌ దర్శనమిస్తాయి. వీటిని మామూలు కళ్లతోనే చూడొచ్చు. ప్రత్యేకమైన కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం లేదు. కావాలంటే వీటిని తాకి కొనుక్కోవాల్సినవి ఆర్డర్‌ చేయొచ్చు కూడా. దీని ఉపయోగాలు ఒక్క వాహనాలకే పరిమితం కాదు. ఏదో ఒకరోజు లిఫ్టులు, ఏటీఎంల వంటి వాటిల్లోనూ గాలిలో తేలే 3డీ హోలోగ్రామ్‌లను చూసే అవకాశముంటుందని భావిస్తున్నారు.


గురకను మళ్లించే దిండు

గురక సమస్య నుంచి బయటపడటానికి 10మైండ్స్‌ సంస్థ వినూత్న దిండును ప్రదర్శించింది. దీని పేరు మోషన్‌ పిల్లో 3. ఇదొక మెత్తటి స్మార్ట్‌ దిండు. దీనిలోని ఆల్గోరిథమ్‌ మనం నిద్రపోతున్నప్పుడు పడుకున్న తీరును గుర్తించి, సరి చేస్తుంది. ఇందులో కొన్ని గాలి సంచులుంటాయి. వీటిల్లోని ప్రెషర్‌ సెన్సర్లు దిండు మీద తల ఉన్న తీరును కచ్చితంగా గుర్తిస్తాయి. గురక పెడుతున్నప్పుడు తల కింద ఒక వైపున ఉండే సంచులు క్రమంగా ఉబ్బుతాయి. దీంతో తల నెమ్మదిగా పక్కకు ఒరుగుతుంది. ఫలితంగా శ్వాసమార్గం వెడల్పయ్యి, గురక పెట్టటం తగ్గుతుంది. నిద్రకూ భంగం కలగదు. ఇది నిద్ర తీరుతెన్నులనూ పసిగడుతుంది. ఉదయం నిద్రలేచాక సంబంధిత యాప్‌లో దీన్ని చూసుకోవచ్చు. ఎంత గాఢంగా నిద్రపోయారో, ఎన్నిసార్లు మేల్కొన్నారో తెలుసుకోవచ్చు.


ఆలోచనలతోనే నియంత్రణ

ఇప్పుడు వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌తో సంగీతం, పాటలు వినటం బాగా సులువైంది. అయితే సౌండ్‌ పెంచాలన్నా, తగ్గించాలన్నా.. ప్లేబ్యాక్‌ చేయాలన్నా పరికరాన్ని తాకాల్సిందే. ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఇది కష్టంగానూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికే వైసియర్‌ సంస్థ మైండ్‌ కంట్రోల్‌ ఆడియో వ్యవస్థను రూపొందించింది. దీని ద్వారా ఆలోచనతోనే సౌండ్‌ను పెంచటం, తగ్గించటం వంటివి చేసుకోవచ్చు. ఇది అతి సూక్ష్మమైన ఎలక్ట్రోడ్ల సాయంతో పనిచేస్తుంది. ఇవి కృత్రిమ మేధ పరిజ్ఞానంతో మెదడు, ముఖం కండరాల పనితీరును నమోదు చేసుకుంటాయి. వీటి ద్వారా అందే సంకేతాలను కంట్రోళ్ల రూపంలోకి మారుస్తాయి. ఈ పరిజ్ఞానాన్ని ఒక్క హెడ్‌ఫోన్స్‌కే కాదు, వీఆర్‌ హెడ్‌సెట్ల వంటి వాటికీ వర్తింపజేయొచ్చు.


బ్యాటరీలు నిండుకోని రిమోట్‌

టీవీలో సినిమా సమయం ఆసన్నమైంది. లేదూ క్రికెట్‌ మ్యాచ్‌ మొదలవుతోంది. ఛానెల్‌ మార్చాలని అనుకున్నారు. కానీ రిమోట్‌లో బ్యాటరీలు లేవు. దుకాణానికి పరుగెట్టి, కొత్త బ్యాటరీలు కొనుక్కొచ్చి, వేస్తే గానీ రిమోట్‌ పనిచేయదు. కానీ సామ్‌సంగ్‌ రూపొందించిన కొత్తరకం రిమోట్‌ తోడుంటే బ్యాటరీలు మార్చాల్సిన పనుండదు. అలాగని ఇది సౌర విద్యుత్తుతో పనిచేస్తుందేమోనని అనుకుంటున్నారేమో. దీనికి ఎలాంటి విద్యుత్తు అవసరం లేదు. ఇంట్లో వైఫై రూటర్‌ వంటి సాంకేతిక పరికరాల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీలను గ్రహించి, వీటి సాయంతోనే పనిచేస్తుంది. ఇందుకోసం రిమోట్‌లో విద్యుత్‌ నియంత్రణ చిప్‌ ఉంటుంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీలను విద్యుత్‌శక్తిగా   మారుస్తుంది. ఇది రిమోట్‌ లోపలున్న బ్యాటరీలను నిరంతరం ఛార్జ్‌ చేస్తుంటుంది. కాబట్టి బ్యాటరీలు నిండుకునే ప్రసక్తే ఉండదన్నమాట.


ఆరోగ్య టాయ్‌లెట్‌

విచిత్రమైన కొత్త ఆవిష్కరణల్లో చెప్పుకోవాల్సింది టోటో కంపెనీ రూపొందించిన టాయ్‌లెట్‌. వెల్‌నెస్‌ టాయ్‌లెట్‌గా అభివర్ణిస్తున్న ఇది మల, మూత్రాలను విశ్లేషించి ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తుంది మరి. జబ్బుల ముందస్తు సూచికలనూ గుర్తించి హెచ్చరిస్తుంది. దీనికి ప్రత్యేక సెన్సర్లు ఉంటాయి. ఇవి మల, మూత్రాల సమాచారాన్ని సంగ్రహించి, సంబంధిత యాప్‌నకు చేరవేస్తాయి. యాప్‌ దీన్ని విశ్లేషించి, తగు సూచనలు చేస్తుంది. ఉదాహరణకు చెడ్డ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటున్నట్టు గుర్తిస్తే చేపలు తినమని సిఫారసు చేస్తుందన్నమాట.


రెండు క్షణాల్లోనే నోరూరించే ఐస్‌క్రీమ్‌

టీ, కాఫీలను చిటికెలో తయారుచేసి ముందుంచే యంత్రాల గురించి తెలిసిందే. మరి ఇలా ఐస్‌క్రీమ్‌లనూ తయారుచేస్తే? ఇంట్లో కోల్డ్‌స్నాప్‌ పరికరం ఉంటే సాధ్యమే. ఇది కాఫీ పాడ్‌ యంత్రాల మాదిరిగానే ఉంటుంది. ఐస్‌క్రీమ్‌కు సంబంధించిన పదార్థాలతో కూడిన చిన్న అల్యూమినియం డబ్బాను దీని పైనుంచి జొప్పిస్తే చాలు. తెర మీద కనిపించే అవసరమైన సూచనలను ఎంచుకుంటే రెండు నిమిషాల్లోపే ఐస్‌క్రీం తయారై బయటకు వస్తుంది. ఐస్‌క్రీం ముడి పదార్థాలు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉండటం విశేషం.


ఒత్తిడిని తగ్గించే హెడ్‌బ్యాండ్‌

మానసిక ఒత్తిడితో సతమతమయ్యేవారి కోసం ఫీల్‌మోర్‌ సంస్థ ప్రత్యేకమైన కోవె హెడ్‌బ్యాండ్‌ను రూపొందించింది. దీన్ని తల వెనక నుంచి చెవులకు తగిలించుకుంటే చాలు. ఒత్తిడిని పారదోలుతుంది. అదెలా అనుకుంటున్నారా? ఇది చెవుల వెనకాల చర్మం మీద తేలికపాటి కంపనాలు సృష్టిస్తుంది. ఇలా మెదడులో ఆందోళన, ఒత్తిడిని నియంత్రించే భాగాలతో ముడిపడిన గ్రాహకాలను ప్రేరేపితం చేస్తుంది మరి. దీంతో ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. హెడ్‌బ్యాండ్‌ సృష్టించే కంపనాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అసలు కంపించినట్టయినా తెలియదు. దీన్ని రోజుకు ఒకట్రెండు సార్లు 20 నిమిషాల సేపు ధరిస్తే చాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని