మంచి వీడియోగేమ్‌లాంటి వ్యవసాయం!

ఏదో కొద్దిగా స్థలముంది.. కూరగాయ మొక్కలు పెంచితే బాగుంటుంది కదా.! చాలామంది ఇలాగే అనుకుంటుంటారు. కానీ పెంచటమంటే మాటలు కాదు. విత్తనాలు నాటటం, నీళ్లు పోయటం దగ్గర్నుంచి

Updated : 24 Feb 2021 16:18 IST

అదెట్టా!

ఏదో కొద్దిగా స్థలముంది.. కూరగాయ మొక్కలు పెంచితే బాగుంటుంది కదా.! చాలామంది ఇలాగే అనుకుంటుంటారు. కానీ పెంచటమంటే మాటలు కాదు. విత్తనాలు నాటటం, నీళ్లు పోయటం దగ్గర్నుంచి కలుపు తీయటం వరకూ ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే ఎంత ఇష్టంగా ఉన్నా చాలామంది వెనకాడుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో కొద్దిగా స్థలం దొరకటమే కష్టం. ఒకవేళ దొరికినా ఉద్యోగాలు, వ్యాపారాల్లో పడిపోయి సమయం కేటాయించటమంటే గగనమే. ఇలాంటివారి కోసం పుట్టుకొచ్చిందే ఫామ్‌బో పద్ధతి. కాస్త స్థలం ఉండి, కూరగాయల వంటివి పండించుకోవాలనే ఆసక్తి గలవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రాస్ప్‌బెర్రీ పై అనే చిన్న, చవకైన కంప్యూటర్‌ సాయంతో పనిచేస్తుంది. చూడటానికి ఒక చట్రంలా కనిపిస్తుంది. కూరగాయలు పండించాలనుకునే నేలకు ఇరుపక్కలా పట్టీలుంటాయి. వీటికి అటూఇటూ రెండు కడ్డీలు చక్రాల సాయంతో ముందుకూ వెనక్కూ తిరుగుతుంటాయి. నిలువు కడ్డీలను అనుసంధానిస్తూ అడ్డంగా ఉండే పట్టీకి కెమెరా, ఇతర పరికరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు పంటను పర్యవేక్షించేవి ఇవే. అనంతరం ప్రోగ్రామ్‌ రూపంలో ఉండే యాప్‌లోకి వెళ్లి, ఎక్కడెక్కడ ఏయే కూరగాయలు, ఆకుకూరలు నాటాలని అనుకుంటున్నారనేది ఎంచుకుంటే చాలు. మనం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా అదే విత్తనాలు నాటుతుంది. సమయానికి నీళ్లు పోస్తుంది. కలుపు పెరుగుతుంటే వెంటనే తొలగిస్తుంది. ఇలా నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మనం దగ్గర లేనప్పుడు పక్షుల వంటివేవైనా వచ్చినా బెదరగొడుతుంది. కూరగాయల ఫొటోలూ తీస్తుంది. రాత్రిపూట కూరగాయలు కోసుకోవాలని అనుకుంటే లైట్లను వెలిగిస్తుంది. ఒకరకంగా దీన్ని వీడియోగేమ్‌లాంటి వ్యవసాయమని అనుకోవచ్చు.
సేంద్రీయ వ్యవసాయ కోరికతోనే
ఇంతకీ ఫామ్‌బోట్‌ను రూపొందించిందెవరో తెలుసా? రోరీ ఆరోన్సన్‌. సేంద్రీయ వ్యవసాయం మీదున్న మక్కువే దీనికి బీజం వేసింది. ఇంజినీరింగ్‌ పాఠాల్లో నేర్చుకున్న విషయాలతోనే డిజైన్‌, పరికరాలను రూపొందించి ప్రాజెక్టును సిద్ధం చేశారు. ఆహారం మానవ హక్కు అన్నది ఆరోన్సన్‌ భావన. అందుకే దీన్ని ఓపెన్‌ సోర్స్‌గా ఉంచారు. 3డీ ప్రింటింగ్‌ సదుపాయం ఉంటే ఎవరికివారు దీనికి సంబంధించిన పరికరాలు తయారుచేసుకోవచ్చు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఫామ్‌బోట్‌ యాప్‌ను ఏ కంప్యూటర్‌, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్‌లోకైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని