మన భూమి మసక బారుతోంది!

వాతావరణ మార్పులు భూమి ప్రకాశానికీ ఎసరు పెడుతున్నాయి. రోజురోజుకీ భూమి నుంచి ప్రతిఫలించే కాంతి తగ్గుతుండటమే దీనికి నిదర్శనం. మేఘాల మీద వాతావరణ మార్పులు చూపే విపరీత ప్రభావమే ఇందుకు కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Updated : 17 Nov 2021 01:04 IST

వాతావరణ మార్పులు భూమి ప్రకాశానికీ ఎసరు పెడుతున్నాయి. రోజురోజుకీ భూమి నుంచి ప్రతిఫలించే కాంతి తగ్గుతుండటమే దీనికి నిదర్శనం. మేఘాల మీద వాతావరణ మార్పులు చూపే విపరీత ప్రభావమే ఇందుకు కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ మార్పులకు మేఘాలు ఎలా స్పందిస్తాయి? ఇవి మున్ముందు వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనేవి తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసాకు చెందిన క్లౌడ్స్‌ అండ్‌ ఎర్త్స్‌ రేడియెంట్‌ ఎనర్జీ (సీఈఆర్‌ఈఎస్‌) ప్రాజెక్టు సమాచారాన్ని విశ్లేషించారు. భూమి నుంచి ప్రతిఫలించే కాంతి తగ్గటానికీ పసిఫిక్‌ మహా సముద్రం మీద మేఘాల తీరుకూ సంబంధం ఉంటున్నట్టు గుర్తించారు. చంద్రుడికి చీకటి వైపున భూమి నుంచి పడే కాంతి తీరుతెన్నుల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. పర్వతాలు, సముద్రాలు, నేల వంటి వివిధ భాగాలను బట్టి భూమి నుంచి కాంతి ప్రతిఫలిస్తుంటుంది. సముద్రాల నుంచి అంతగా కాంతి ప్రతిఫలించదు. నేల అయితే రెట్టింపు కాంతిని ప్రతిఫలిస్తుంది. మేఘాలు తమ మీద పడే సూర్యకాంతిలో సగం వరకు ప్రతిఫలింప జేస్తాయి. అదే మంచు అయితే దాదాపుగా పూర్తి కాంతిని బయటకు వెదజల్లుతుంది. అయితే గత రెండు దశాబ్దాలుగా భూమి నుంచి ప్రతిఫలించే కాంతి 0.5% తగ్గటం గమనార్హం. అంటే ప్రతి చదరపు మీటరు వెదజల్లే కాంతిలో దాదాపు సగం వరకు తగ్గిందన్నమాట. ఇదే సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కాంతిలో పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. అందువల్ల భూమి వాతావరణమే దీనికి కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా పసిఫిక్‌ మహా సముద్రం తూర్పు తీర ప్రాంతంలో ప్రకాశవంతమైన మేఘాలు తగ్గిపోవటం ఇందుకు దోహదం చేస్తుండొచ్చని అనుకుంటున్నారు. ఇక్కడ మహా సముద్రం ఉపరితలం ఉష్ణోగ్రతలు పెరిగినట్టూ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాంతి అంతరిక్షంలోకి ప్రతిఫలించకపోతే అది భూ వాతావరణంలోనే ఉండిపోతుంది. ఇది మున్ముందు వాతావరణం మీద గణనీయమైన ప్రభావమే చూపిస్తుంది. కాలుష్యం, అడవుల నరికివేత వంటి వాటితో తలెత్తుతున్న వాతావరణ మార్పులకు ఇది మరింత ఆజ్యం పోస్తుంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే పరిస్థితి మరింత దిగజారటం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని