WhatsApp: వాట్సాప్‌ వేదికగా నయా మోసాలు.. ‘అత్యవసరం’ పేరుతో దండుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు!

వాట్సాప్ యూజర్స్ లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. దీంతో అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ యూజర్స్‌కు సూచిస్తుంది. 

Published : 08 Dec 2021 22:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్స్‌ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది వాట్సాప్‌. ఇదే తరహాలో నగదు చెల్లింపుల సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. చాటింగ్‌ చేసే చోటే డబ్బులు పంపుకునే సదుపాయం కూడా ఉండడంతో వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. వాట్సాప్‌లో ‘ప్రెండ్‌ ఇన్‌ నీడ్’ పేరుతో నయా దందా మొదలుపెట్టారు.

స్నేహితులు పంపుతున్నట్లు యూజర్‌కు సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌ పంపుతారట. ఫోన్‌ పొగొట్టుకున్నానని, వేరే నంబర్‌ నుంచి మెసేజ్‌ చేస్తున్నానని చెబుతూ యూజర్స్‌ను నమ్మించి వారి నుంచి నగదు బదిలీ చేయిస్తున్నట్లు గుర్తించామని బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. అలానే కొన్ని సందర్భాల్లో అత్యవసరంలో ఉన్నామని, డబ్బులు కావాలని తల్లిదండ్రులను పిల్లలు అడుగుతున్నట్లుగా మెసేజ్‌లు పంపి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఒకవేళ యూజర్స్ మొదటి మెసేజ్‌కు స్పందిచకపోతే వేర్వేరు నంబర్ల నుంచి వరుస మెసేజ్‌లు పంపి ఏమార్చుతున్నారని వాట్సాప్ పేర్కొంది. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా బ్రిటన్‌లో జరుగుతున్నాయని ఒక నివేదికలో తెలిపింది. ఒకవేళ యూజర్స్‌కు తమకు తెలియని నంబర్ల నుంచి డబ్బులు కావాలని మెసేజ్‌లు వచ్చినా.. నంబర్లపై అనుమానం కలిగినా వెంటనే వాట్సాప్‌కు రిపోర్ట్ చేయాలని సూచించింది. భారత్‌లోనూ ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉన్నందున యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.

వాట్సాప్‌కు ఎలా రిపోర్ట్ చేయాలంటే?

మీకు తెలియని లేదా అనుమానం ఉన్న నంబరు నుంచి మెసేజ్‌ వచ్చిన తర్వాత చాట్‌ పేజ్‌ పైభాగంలో కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే ఫీచర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు కాంటాక్ట్ గురించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేయమంటారా? అని అడుగుతూ పాప్‌-అప్‌ విండో ఓపెన్ అవుతుంది. అందులో రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఎందుకు దానిపై ఫిర్యాదు చేశారో తెలపాలంటూ వాట్సాప్ మిమ్మల్ని అడుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలు వాట్సాప్‌కు సమర్పిస్తే, విచారించి చర్యలు తీసుకుంటుంది.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని