‘గేమ్స్’ ఆడటంలో వారు తక్కువేం కాదు..!

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక శారీరక శ్రమ తగ్గిపోయింది. మొబైల్స్‌తోనే సమయం ఎక్కువగా గడిపేస్తుంటారు. గేమింగ్‌ మార్కెట్‌ విస్తరించడంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా...

Updated : 18 Mar 2021 21:08 IST

భారత్‌లో భారీగా విస్తరించిన గేమింగ్‌ మార్కెట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లు వచ్చాక శారీరక శ్రమ తగ్గిపోయింది. మొబైల్స్‌తోనే ఎక్కువగా సమయం గడిపేస్తున్నారు. గేమింగ్‌ మార్కెట్‌ విస్తరించడంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఏదొక ఆటను ఫోన్లలో ఆడేస్తున్నారు. అయితే జనరేషన్‌ Z తరం యువతే ఎక్కువగా మొబైల్స్‌ను గేమ్స్‌ను ఆడుతుంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కాదని ఓ సర్వే వెల్లడించింది. మరి ఏ వయసు వారు ఎక్కువగా గేమ్స్‌ను ఆడతారు..? ఎలాంటి ఆటలను ఆడుతుంటారు.. అనే విషయాలను తెలుసుకుందాం..

కనీసం మూడేసి గేములు డౌన్‌లోడ్‌

జనరేషన్‌ Z యువతరంలోని వారికంటే 45 నుంచి 54 ఏళ్ల (జనరేషన్ X) వయస్కుల్లోని వారే అధికంగా మొబైల్ గేమ్స్‌ ఆడుతుంటారని యాడ్‌టెక్‌ ఫైర్మ్ ఇన్‌మొబిస్ మొబైల్‌ గేమింగ్ ఇండియా రిపోర్ట్‌ 2021 నివేదిక వెల్లడించింది. ఈ వయసులోని యూజర్లలో దాదాపు 60 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో ఆటలు ఆడతారని పేర్కొంది. అలానే దాదాపు 45 శాతం మంది భారతీయ గేమర్స్‌ కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ సమయంలోనే ఆటలు ఆడటం ప్రారంభించినట్లు తెలిపింది. ఫిబ్రవరిలో 30 నగరాల్లోని దాదాపు 1000 మంది భారతీయ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను ఇంటర్వ్యూ చేసినట్లు ఇన్‌మొబి వెల్లడించింది. అంతేకాకుండా 20 కోట్ల మంది యూజర్ల డేటా సిగ్నల్స్‌ను కలెక్ట్‌ చేసి విశ్లేషించినట్లు పేర్కొంది. చాలామంది భారతీయ యూజర్లలో యావరేజ్‌గా ఒక్కొక్కరు మూడేసి గేములను ఇన్‌స్టాల్‌ చేసుకుంటారని వెల్లడించింది. ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ నుంచి గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఉంటారు. 

అసలు జనరేషన్‌ Z, జనరేషన్‌ X అంటే..?

24 ఏళ్లలోపు వయసు కలిగిన యువ తరాన్ని జనరేషన్ Z గా పేర్కొంటారు. 1997వ సంవత్సరం నుంచి 2012 మధ్య జన్మించిన వారంతా ఈ కోవలోకి వస్తారు. ఈ కాలంలోనే స్మార్ట్‌ఫోన్ల రంగం భారీగా విస్తరించింది. మొబైల్స్‌ వాడకం కూడా ఎక్కువైపోయిందనే చెప్పొచ్చు. అలానే జనరేషన్ X అంటే 1965-1980 సంవత్సరాల మధ్య పుట్టినవారు ఈ కేటగిరీలోకి వస్తారు.

రోజూ ఏదొక గేమ్‌ ఆడాల్సిందే..!

అంతర్జాతీయంగా మొబైల్‌ గేమింగ్‌ మార్కెట్‌లో భారత్‌ది ఐదో స్థానం. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు, చవకైన డేటా టారిఫ్‌లు అందుబాటులోకి రావడం.. మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగం పెరగడంతో గేమింగ్‌ మార్కెట్‌ పెద్ద ఎత్తున విస్తరించింది. గతేడాది భారత్‌లో గేమ్ యాప్‌ల డౌన్‌లోడ్స్‌ భారీగా పెరిగినట్లు ఇన్‌మొబి వెల్లడించింది. జనరేషన్‌ Z తో పోలిస్తే జనరేషన్‌ X (45-54 ఏళ్లు) వారు యాక్షన్, కార్డు‌, బోర్డు గేమ్స్‌ను ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. యూజర్లను కమిటెడ్‌, రెగ్యులర్‌, అకేషన్‌ల్ అని మూడు గ్రూపులుగా ఇన్‌మొబి విభజించింది. భారతీయ యూజర్లలో 80 శాతం మంది కమిటెడ్ గేమర్స్‌. అంటే వీరు రోజూ మొబైల్‌ గేమ్‌లను ఆడుతుంటారు. ఇతరులతో పోలిస్తే ఎక్కువ సమయం ఆటలకు కేటాయిస్తూ ఉంటారు. ఒక్కసారి కూర్చుంటే దాదాపు గంటకుపైగా టైమ్‌ను మొబైల్‌ గేమ్‌ను ఆడేందుకు కేటాయిస్తారని నివేదిక చెప్పుకొచ్చింది. మహిళా యూజర్లలోనూ 72 శాతం మంది కమిటెడ్‌ గేమర్స్‌ ఉన్నట్లు నివేదిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని