Microsoft: ‘క్లిప్పీ’ మళ్లీ వస్తోంది.. కానీ..

మీరు 90ల్లో లేదా 2000 తొలినాళ్లలో కంప్యూటర్‌ ఉపయోగించారా..అందులో మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింటో ఓపెన్ చేస్తే అప్పట్లో మీకు పేపరక్లిప్ ఆకారంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ అసిస్టెంట్ ‘క్లిప్పీ’ కనిపించేది. కాలక్రమంలో దాన్ని తొలగించారు...

Published : 16 Jul 2021 23:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు 90ల్లో లేదా 2000 తొలినాళ్లలో కంప్యూటర్‌ ఉపయోగించారా? అందులో మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింటో ఓపెన్ చేస్తే అప్పట్లో మీకు పేపర్‌క్లిప్ ఆకారంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ అసిస్టెంట్ ‘క్లిప్పీ’ కనిపించేది. కాలక్రమంలో దాన్ని తొలగించారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లు ఓపెన్ చేయగానే క్లిప్పీ యానిమేటెడ్ ఇమేజ్‌తోపాటు పాప్‌-అప్‌ మెసేజెస్ కనిపించేవి. మీరు సెర్చ్‌ చేసేందుకు స్క్రీన్‌పై క్లిక్ చేసిన వెంటనే క్లిప్పీ మీకు కొన్ని సూచనలు చేస్తుంది. దీన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఆఫీస్‌ 97 వెర్షన్‌లో ఇంటెలిజెంట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ కింద పరిచయం చేసింది. అయితే క్లిప్పీ కొన్నిసార్లు తప్పుడు సూచనలు చేస్తోందన్న ఆరోపణలు రావడంతో ఆఫీస్ 2007, 2008 వెర్షన్ నుంచి దాన్ని తొలగించారు.

తాజాగా మైక్రోసాఫ్ట్ దీనికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది. క్లిప్పీ ఇమేజ్‌ని ట్వీట్ చేస్తూ ‘ఈ ఇమేజ్‌కు 20K లైక్స్ వస్తే క్లిప్పీని ఎమోజీ రూపంలో మైక్రోసాఫ్ట్ 365లో తీసుకొస్తాం’’ అని పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కి లక్షన్నరకి పైగా లైక్‌లు వచ్చాయి. అలానే మైక్రోసాఫ్ట్ వర్చువల్ అసిస్టెంట్ కొర్టానా స్థానంలో క్లిప్పీని తీసుకురావాలని కోరుతూ పలువురు యూజర్లు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్‌పై ప్రముఖ క్యాడ్బరీస్‌ బిస్కెట్ బ్రాండ్ ఓరియో కుకీ సైతం స్పందించింది. ‘ఈ కమ్‌బ్యాక్ మా పాత జ్ఞాపకాలను గుర్తుచేసింది’ అని ట్వీట్ చేసింది. అయితే క్లిప్పీని మరోసారి చూడొచ్చన్నమాట. కాకపోతే ఎమోజీ రూపంలో!!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని