Samsung: ఆండ్రాయిడ్ ఓఎస్‌కు గుడ్‌బై చెప్పనున్నశాంసంగ్‌.. ఎందుకో తెలుసా?

శాంసంగ్‌ కంపెనీ త్వరలోనే ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విడిచిపెట్టనుంది. దానికి బదులుగా మరో కొత్త ఓఎస్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనుందట. 

Published : 24 Dec 2021 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్ (Android) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌).. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది యూజర్స్ ఈ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ఏటా సరికొత్త అప్‌డేట్లతో యూజర్‌ ప్రెండ్లీ ఫీచర్స్‌ని తీసుకొస్తూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని మరింత మందికి చేరువ చేస్తోంది. ఇక శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్స్‌ గురించి చెప్పాలంటే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన ఫోన్లలో 60 శాతం వాటా ఈ కంపెనీదే. దశాబ్దకాలానికిపైగా శాంసంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. తాజా వార్తల ప్రకారం శాంసంగ్‌ కంపెనీ త్వరలోనే ఆండ్రాయిడ్ ఓఎస్‌తో స్మార్ట్‌ఫోన్లను విడుదలచేయబోదట. దానికి ప్రత్యామ్యాయంగా గూగుల్ (Google) లేబోరేటరీస్‌ అభివృద్ధి చేస్తున్న ‘ఫూషియా’ (Fuchsia) అనే కొత్త ఓఎస్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఓపెన్ సోర్స్‌ ఓఎస్‌గా ఫూషియా ఓఎస్‌ను గూగుల్ నుంచి శాంసంగ్‌ తీసుకొంటుందట.

ఒకే యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)తో శాంసంగ్ కంపెనీ ఫూషియా ఓఎస్‌ను ఉపయోగించనుందట. అలానే ఈ ఓఎస్‌ను శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు ట్యాబ్‌లెట్స్‌, కంప్యూటర్స్‌, ఐఓటీ డివైజ్‌లలో ఉపయోగించాలని భావిస్తోంది. గూగుల్ లైనెక్స్ కెర్నెల్‌ కోడ్ కాకుండా జిర్కాన్‌ అనే కొత్త కోడ్‌తో ఈ ఓఎస్‌ను అభివృద్ధి చేస్తోందని సమాచారం. అయితే ఈ ఓస్‌ అందుబాటులోకి వస్తే శాంసంగ్‌తోపాటు మరిన్ని మొబైల్ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విడిచిపెట్టనున్నాయట. ఈ ఓఎస్‌ ద్వారా శాంసంగ్ ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు భిన్నంగా సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే శాంసంగ్ గూగుల్‌ అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ ఓఎస్‌ను వీడి సొంతంగా కొత్త ఓఎస్‌ను రూపొందించకుండా మళ్లీ గూగుల్‌పైనే ఆధారపడటం గమనార్హం. గతంలో శాంసంగ్, స్మార్ట్‌ఫోన్ల కోసం సొంతంగా టైజెన్‌ అనే ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. కానీ, టైజెన్‌  పరీక్షల దశలోనే ఫెయిల్యూర్‌ కావడంతో శాంసంగ్ ఆ ప్రయత్నాలను విరమించుకుంది. ఫూషియా ఓఎస్‌ పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందంటున్నాయి టెక్‌ వర్గాలు. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు