డేటాని ఆదా చేద్దాం

స్మార్ట్‌ఫోన్‌ ఉందంటే యాప్‌లు కచ్చితంగా ఇన్‌స్టాల్‌ చేస్తాం. వాటిని వాడే క్రమంలో అవెలా ప్రవర్తిస్తున్నాయో చెక్‌ చేయడం అనివార్యం. ఎందుకంటే.. కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నిత్యం...

Published : 18 Mar 2021 22:43 IST

 బ్యాక్‌గ్రౌండ్‌లో చెక్‌ పెట్టండి

స్మార్ట్‌ఫోన్‌ ఉందంటే యాప్‌లు కచ్చితంగా ఇన్‌స్టాల్‌ చేస్తాం. వాటిని వాడే క్రమంలో అవెలా ప్రవర్తిస్తున్నాయో చెక్‌ చేయడం అనివార్యం. ఎందుకంటే.. కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నిత్యం రన్‌ అవుతుంటాయి. యూజర్‌ డేటాపై విశ్లేషిస్తూ.. డేటాని ఎక్కడెక్కడికో షేర్‌ చేస్తుంటాయి. అంతేకాదు.. మొబైల్‌ డేటాని ఖర్చు చేయడంతో పాటు.. బ్యాటరీని ఎక్కువగా వాడేస్తుంటాయి. ఉదాహరణకు.. మీరేదైనా థర్డ్‌పార్టీ కాల్‌ రికార్డర్‌ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేశారనుకుందాం. అదేం చేస్తుందంటే.. మీ ఫోన్‌కి సంబంధించిన అనుమతుల్ని మీతోనే అంగీకరించేలా చేస్తుంది. మీ కొచ్చే ఫోన్‌ కాల్స్‌ని రికార్డు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలో నిత్యం యాప్‌ పని చేస్తూనే ఉంటుంది. అవసరం లేనప్పుడు కూడా ఈ తరహా యాప్‌లను ఎనేబుల్‌ చేసి ఉండడం కారణంగా.. మీ ప్రైవసీకి భంగం కలగొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? కచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్‌ రన్‌ అవుతున్న యాప్‌లను అవసరం లేనప్పుడు డిసేబుల్‌ చేయాలి. అందుకు ఈ స్టెప్స్‌ని ఫాలో అయిపోండి..

యాప్‌ల అడ్డాలో..

ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌కి సంబంధించిన సమాచారాన్ని చూడాలన్నా.. ‘యాప్‌ ఇన్ఫో’లోకి వెళ్లాలి. దీనికి పలు మార్గాలు ఉన్నాయి. ఏదైనా యాప్‌పై నొక్కి ఉంచితే.. పాప్‌-అప్‌ మెనూ వస్తుంది. దాంట్లో ‘యాప్‌ ఇన్ఫో’ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ వన్‌ లాంటి ఫోన్‌ల్లో అయితే ‘ఐ’ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్‌ చేస్తే సరిపోతుంది. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన అన్ని యాప్‌లనూ ఒకసారి రివ్యూ చేద్దాం అనుకుంటే.. సెట్టింగ్స్‌లోని ‘యాప్స్‌ అండ్‌ నోటిఫికేషన్స్‌’ని ఓపెన్‌ చేయాలి. దాంట్లో ‘సీ ఆల్‌ యాప్స్‌’లోకి వెళ్తే మొత్తం యాప్‌ల జాబితా వచ్చేస్తుంది. ఇక మీరు ఏయే యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్‌ చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఎంపిక చేసిన యాప్‌లోకి వెళ్లి ‘మొబైల్‌ అండ్‌ వై-ఫై’ని సెలెక్ట్‌ చేయాలి. వచ్చిన ఆప్షన్‌లలో ‘బ్యాక్‌గ్రౌండ్‌ డేటా’ ఎనేబుల్‌ మోడ్‌లో ఉందో.. లేదో చూడాలి. ఒకవేళ ఎనేబుల్‌ అయ్యి ఉంటే.. డిసేబుల్‌ చేయాలి. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌లో సంబంధిత యాప్‌ ఇక పని చేయదు. మీరు ఎప్పుడైతే యాప్‌ని ఓపెన్‌ చేస్తారో.. అప్పుడు మాత్రమే యాప్‌ డేటాని తీసుకుని పని చేయడం ప్రారంభిస్తుంది. 

అప్పటికీ వద్దనుకుంటే..

ఏదైనా యాప్‌ ఎప్పటికీ ఫోన్‌ డేటా లేదా వై-ఫైని యాక్సెస్‌ చేయకుండా చూడాలంటే? దానికీ మార్గం ఉంది. ఏం చేస్తారంటే.. యాప్‌ ఇన్ఫోలోకి వెళ్లాక బ్యాక్‌గ్రౌండ్‌ డేటాతో పాటు అక్కడ కనిపించే ‘డిసేబుల్‌ వై-ఫై’, ‘డిసేబుల్‌ డేటా యూసేజ్‌’ ఆప్షన్‌లను ఎనేబుల్‌ చేయాలి. డీఫాల్ట్‌గా ఇవి డిసేబుల్‌ మోడ్‌లో ఉంటాయి. దీంతో మీరు యాప్‌ని ఓపెన్‌ చేసినప్పటికీ ఎలాంటి డేటా యాక్సెస్‌ అవ్వదు. కావాలంటే మీరే.. మాన్యువల్‌గా తిరిగి డిసేబుల్‌ చేయాలి. ఇప్పటికైతే ఇవి ఆప్షన్లు ఆండ్రాయిడ్‌ 11లో మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌ 10 లేదా అంతకంటే కింది వెర్షన్‌లను వాడుతున్నట్లయితే ‘డేటా యూసేజ్‌’లోని ‘బ్యాక్‌గ్రౌండ్‌ డేటా’ని వాడుకుంటే సరిపోతుంది. ఎంఐయూఐ ఇంటర్ఫేస్‌తో ఫోన్‌ని వాడుతున్నట్లయితే ‘బ్యాక్‌గ్రౌండ్‌ డేటా’ ఒక్కటి మాత్రమే డిసేబుల్‌ చేయడం సాధ్యం కాదు. మొత్తంగా యాప్‌ డేటాని యాక్సెస్‌ చేయకుండా డిసేబుల్‌లో పెట్టేయొచ్చు. అందుకు ‘యాప్‌ ఇన్ఫో’లోకి వెళ్లాక.. ‘రెస్ట్రిక్ట్‌ డేటా యూసేజ్‌’ని ఎంచుకోవాలి. అప్పుడు పాప్‌-అప్‌ మెనూలోకి ‘వై-ఫై’, ‘మొబైల్‌ డేటా’ రెండూ కనిపిస్తాయి. వాటిని ‘అన్‌చెక్‌’ చేయండి చాలు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని