మడత ‘యాపిల్‌’.. ‘360’ ల్యాపీ.. ‘గ్రీన్’‌ హెచ్‌పీ

టెక్‌, గ్యాడ్జెట్‌ల నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్స్‌... 

Published : 26 Feb 2021 13:16 IST

యాపిల్‌ మడత ఫోన్‌ 

తొలినాళ్ల తాకేతెరల్లో యాపిల్‌ ఫోన్‌లు ఓ అద్భుతమే. తర్వాత ట్యాబ్లెట్‌తోనూ టెక్నాలజీ ప్రియుల్ని అలరించిన యాపిల్..  ఇప్పుడు డిజైన్‌ మార్చనుంది. మడత ఫోన్‌లతో మురిపించేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఐప్యాడ్‌ మినీ స్థానంలో ఫోల్డబుల్‌ ఐఫోన్‌ని తీసుకొచ్చే పనిలో ఉందని టెక్నాలజీ విశ్లేషకుల అంచనా. స్టైలస్‌ సపోర్టుతో ముందుకు రానుంది. యాపిల్‌ పెన్సిల్‌ని ఎలాగైతే వాడేస్తున్నారో.. అదే మాదిరిగా ఫోల్డబుల్‌ స్క్రీన్‌పైనా రాసుకోవచ్చు. సగానికి మడత పెట్టుకుని వాడుకునేలా ఉండే ఫోన్‌ తెర పరిమాణం 7.6 అంగుళాలు. అంటే.. మడత విప్పితే సాధారణ ఫోన్‌ల కంటే కాస్త ఎక్కువ పరిమాణంలోనే కనిపిస్తుంది. 2023 నాటికి దీన్ని మార్కెట్‌లోకి తేనుందట!


పర్యావరణ పరిరక్షణలో ‘హెచ్‌పీ’

సరికొత్త డిజైన్‌లతో ఎన్నో గ్యాడ్జెట్‌లు పుట్టుకొస్తున్నాయ్‌. వాటి తయారీలో వాడే మెటీరియల్స్‌ సంగతేంటి? పర్యావరణానికి చేటు లేకుండా రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ని వాడితే? హెచ్‌పీ కంపెనీ అదే చేసింది. భవిష్యత్‌ తరాలకు భూమిని భద్రంగా అందించే లక్ష్యంతో కొత్త ఉత్పత్తుల రూపకల్పన చేస్తోంది. దాంట్లో భాగంగానే పెవిలియన్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో తయారు చేసింది. అదే పెవిలియన్‌ 13, 14, 15 మోడళ్లు. వీటి తెరల పరిమాణం వరుసగా.. 13.3, 14, 15.6 అంగుళాలు. రిజల్యూషన్‌ 1920*1080 పిక్సల్స్‌. అంచుల వరకూ తెరలతో ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఆకట్టుకుంటాయి. బ్యాక్లిట్‌ కీబోర్డు, టచ్‌ప్యాడ్‌లతో సౌకర్యంగా వాడుకోవచ్చు. 16జీబీ వరకూ ర్యామ్‌ సపోర్టు ఉంది. స్టోరేజ్‌ సామర్థ్యం 512జీబీ. నాలుగు రంగుల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. *వీటి ప్రారంభ ధర రూ.62,999.


గేమింగ్‌కి ప్రత్యేకం ‘కే40’

టెక్నాలజీ ప్రియుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలో గేమింగ్‌కి అనువైనవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే వాటి ప్రాసెసింగ్‌ సామర్థ్యం అలాంటిది. ఆసుస్‌ కంపెనీ వచ్చే నెలలో ఇదే తరహాలో గేమింగ్‌ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది. పేరు ‘ఆర్‌ఓజీ ఫోన్‌ 5’. స్నాప్‌డ్రాగన్‌ 888 చిప్‌సెట్‌తో మెరుపు వేగంగా గ్రాఫిక్స్‌ని ప్రాసెస్‌ చేస్తుంది. ర్యామ్‌ 16జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 512జీబీ. ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే పరిమాణం 6.78 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080*2340 పిక్సల్స్‌. కెమెరాల విషయానికొస్తే.. వెనక మూడు (64ఎంపీ, 16ఎంపీ, 8ఎంపీ) ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32ఎంపీ. ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌ సపోర్టుతో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌. * అంచనా ధర రూ.50,000


ఎలాగైనా వాడుకోవచ్చు..

ప్రస్తుత జీవనశైలిలో మల్కీటాస్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు వాడుతున్న డివైజ్‌లు కూడా అందుకు అనువుగా ఉండాలి. ఎలాగంటే.. ఎల్‌జీ మార్కెట్‌లోకి తెచ్చిన ‘గ్రామ్‌ 360 ల్యాప్‌టాప్‌’ మాదిరి. 11వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిప్పుకుని అవసరం మేరకు పని చేసుకోవచ్చు. అంటే.. ల్యాపీలానే కాకుండా ట్యాబ్‌గానూ వాడుకోవచ్చు. అంచుల వరకూ తెరతో నాజూకుగా తీర్చిదిద్దారు. హెచ్‌డీ వెబ్‌ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ దీంట్లోని ప్రత్యేకతలు. తెర పరిమాణం 14, 16 అంగుళాలు. రిజల్యూషన్‌ 1920*1200 పిక్సల్స్‌. 8జీబీ ర్యామ్‌. స్టోరేజ్‌ సామర్థ్యం 256జీబీ. విండోస్‌ 10 హోం ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. బ్యాక్లిట్‌ కీబోర్డు, టచ్‌ప్యాడ్‌ సపోర్టుతో వాడుకోవచ్చు.  * అంచనా ధర రూ.1.36 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని