108తో 10ఐ.. వన్‌ప్లస్‌ వాచ్‌.. హెచ్‌పీ ‘ప్రోబుక్‌’

టెక్‌ & గ్యాడ్జెట్స్‌ ఆప్‌డేట్స్‌ @ 01/01/2021

Updated : 12 Aug 2022 12:25 IST

108 ఎంపీ కెమెరాతో ఎంఐ ‘10ఐ’

కొత్త ఏడాదిలో మొబైల్‌ ప్రియులకు షావోమి హాట్‌ హాట్‌గా స్మార్ట్‌ ఫోన్‌లను అందించేందుకు సిద్ధం అవుతోంది. వాటిల్లో ‘10ఐ’ పేరుతో పరిచయం చేయనున్న ఫోన్‌ ఒకటి. పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే, క్వాడ్‌ కెమెరా సెట్‌అప్‌తో  చూడడానికి ‘నోట్‌ 9 ప్రో 5జీ’ మోడల్‌ని పోలి ఉంటుంది. అంచుల వరకూ తాకే తెరతో డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 750జీ చిప్‌సెట్‌ని వాడారు. దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ని సంప్రదాయ పద్ధతిలో కాకుండా పక్కన (సైడ్‌-మౌంటెడ్‌) ఏర్పాటు చేయడం. ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. తాకేతెర పరిమాణం 6.67 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080X2400 పిక్సల్స్‌. ర్యామ్‌ 8 జీబీ. 256 జీబీ వరకూ ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌ సపోర్టు ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,820 ఎంఏహెచ్‌‌. 33 వాట్‌ ఫాస్ట్‌-ఛార్జింగ్‌ సపోర్టు ఉంది. వెనక నాలుగు కెమెరాలు వరుసగా.. 108 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్‌ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌. ముందు సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16ఎంపీ.


అరగంటలోనే 50 శాతం ఛార్జింగ్‌

స్మార్ట్‌ఫోన్‌ ఏది కొనాలనుకున్నా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉందా? లేదా? అని చెక్‌ చేస్తుంటాం. ఇకపై ల్యాపీల్లోనూ అదే ఎంపిక ఉంటుంది. పెరిగిన వర్క్‌ ఫ్రంమ్‌ హోం విధానమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో హెచ్‌పీ ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ల్యాప్‌టాప్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. పేరు  ProBook 635 Aero. తక్కువ బరువుతో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుంది. 720పిక్సల్స్‌ హెచ్‌డీ వెబ్‌ కెమెరా మరో ప్రత్యేకత. AMD Ryzen 5, 7 ప్రాసెసర్లతో ఎంపిక చేసుకోవచ్చు. తెర పరిమాణం 13.3 అంగుళాలు. రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ సపోర్టు ఉంది. విండోస్‌ 10 ప్రో ఓఎస్‌తో పని చేస్తుంది. బ్యాక్లిట్‌ కీబోర్డు, మల్టీటచ్‌ ట్రాక్‌ ప్యాడ్‌ ఉన్నాయి. ‘హెచ్‌పీ క్విక్‌డ్రాప్‌’ టెక్నాలజీతో ఫోన్‌ నుంచి ల్యాపీలోకి డేటాని సులభంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

* ప్రారంభ ధర రూ.74,999


వన్‌ప్లస్‌ వాచ్‌లు.. తొలి ప్రయత్నంగా

స్మార్ట్‌ఫోన్స్‌లో వన్‌ప్లస్‌కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మొబైల్‌ ప్రియుల్ని ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకుంది. ఇకపై కొత్త ఏడాదిలో స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండులతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. షామీ, రియల్‌మిలకు పోటీగా ప్రత్యేక డిజైన్‌తో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ని రూపొందిస్తోంది. అదీ బడ్జెట్‌లో. స్మార్ట్‌వాచ్‌తో పాటు ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను ఈ నెలాఖరుకి మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, వాటర్‌ప్రూఫ్‌ రక్షణ కవచం, మల్టిపుల్‌ స్పోర్ట్స్‌ మోడ్‌లతో బ్యాండ్‌ పని చేస్తుంది. ధర కూడా బడ్జెట్‌లో ఉండొచ్చనేది టెక్నాలజీ విశ్లేషకుల అంచనా. వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ కోసం వేచి చూస్తున్న మొబైల్‌ ప్రియులకు కచ్చితంగా ఇది ఊరించే అప్‌డేట్‌.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని