Space: అంతరిక్షంలో పెట్రోలు బంకు!

కాలం చెల్లిన ఉపగ్రహాలు, రాకెట్ల విడిభాగాలు అంతరిక్షంలో రోజురోజుకీ వ్యర్థాల సమస్యను తీవ్రం చేస్తున్నాయి. ఇటీవల రష్యా క్షిపణి ద్వారా సొంత ఉపగ్రహాలను పేల్చేయటమూ దీనికి మరింత ఆజ్యం పోసింది.

Updated : 24 Nov 2021 08:13 IST

కాలం చెల్లిన ఉపగ్రహాలు, రాకెట్ల విడిభాగాలు అంతరిక్షంలో రోజురోజుకీ వ్యర్థాల సమస్యను తీవ్రం చేస్తున్నాయి. ఇటీవల రష్యా క్షిపణి ద్వారా సొంత ఉపగ్రహాలను పేల్చేయటమూ దీనికి మరింత ఆజ్యం పోసింది. ఒకసారి అంతరిక్షంలోకి వెళ్లిన వస్తువు ఏదైనా కక్ష్యలో నుంచి దారి మళ్లనంత వరకు, భూ వాతావరణంలోకి రానంత వరకు అక్కడే తిరుగాడుతుంటుంది. నట్లు, రంగు పెచ్చుల వంటి చిన్న వ్యర్థాలైనా చాలా వేగంతో ప్రయాణిస్తుంటాయి కాబట్టి పనిచేస్తున్న ఉపగ్రహాలకు పెద్ద ముప్పునే తెచ్చిపెడతాయి. అందుకే అంతరిక్ష వ్యర్థాల నిర్మూలనపై చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని వీటిని ఒడిసి పట్టటానికి ప్రయత్నిస్తుంటే.. కక్ష్యలో ఉండగానే వీటిని ముక్కలు చేసి, నిల్వ చేయటంపై మరికొన్ని దృష్టి సారించాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన న్యూమన్‌ స్పేస్‌ సంస్థ మరో అడుగు ముందుకేసి ‘ఇన్‌ స్పేస్‌ ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌’ అనే వినూత్న విధానాన్ని రూపొందించింది. వ్యర్థాలను ఉపగ్రహ ఇంధనంగా వాడుకోవాలన్నది దీని ఉద్దేశం. దిగువ భూకక్ష్యలో ఉపగ్రహాలు మరింత ఎక్కువ దూరాలు ప్రయాణించటానికి అవసరమైన ఇంధనం దీని ద్వారా లభిస్తుంది. లోహపు వ్యర్థాలను అయనీకరించటం ద్వారా థ్రస్ట్‌ పుట్టుకొచ్చేలా చేయటం దీనిలోని కీలకాంశం. ఇదే ఉపగ్రహాలకు ఇంధనంగా పనిచేస్తుంది. ఒకరకంగా దీన్ని అంతరిక్షంలో పెట్రోలు బంకు ఏర్పాటు చేయటం లాంటిదని అనుకోవచ్చు. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న ప్రాజెక్టు. ప్రయోగాత్మకంగా పరీక్షించటానికి దీనికి నాసా కూడా అనుమతించింది. ఏదేమైనా అంతరిక్ష వ్యర్థాల నిర్మూలన దిశగా ప్రయత్నాలు ముమ్మరమవటం విశేషం. ఒకపక్క వ్యర్థాలను ఒడిసి పడుతుంటే.. మరోపక్క వీటిని వినూత్నంగా వాడుకోవటంపై దృష్టి సారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని