వాట్సాప్‌: ఇకపై డెస్క్‌టాప్‌‌లోనూ ఆ ఫీచర్‌

ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మొబైల్‌ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్‌ కాల్‌ ఫీచర్‌ను బీటా వెర్షన్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లోకి తీసుకురానున్నట్లు గత సంవత్సరం డిసెంబర్‌లో ప్రకటించింది. అయితే ప్రస్తుతం డెస్క్‌టాప్‌ యాప్‌లోకి కూడా వాయిస్‌ కాల్స్‌ వెర్షన్‌ను తాజాగా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది...

Updated : 04 Mar 2021 19:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంట్లో ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వాట్సాప్‌ యాప్‌లో ఛాట్‌ చేస్తున్నారు... ఇంతలోగా అవతలి వ్యక్తి మీకు కాల్‌ చేశారు. మొబైల్‌ చూస్తే ఛార్జింగ్‌లో ఉంది. కంప్యూటర్‌లో ఉన్న వివరాలు చూసుకుంటూ.. వాట్సాప్‌ వీడియో కాల్‌లో అవతలి వ్యక్తికి వివరాలు చెప్పాలి. ఇప్పుడైతే దీని కోసం సిస్టమ్‌, మొబైల్‌ రెండూ వాడాల్సిందే. అయితే ఈ ఇబ్బందులు త్వరలో మీకు ఉండవు. ఎందుకంటే డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఇన్నాళ్లూ మొబైల్‌ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్‌ కాల్‌ ఫీచర్‌ ఇప్పుడు డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ యాప్‌కి కూడా వచ్చేసింది. గత డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అందరికీ అందిస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ ఆప్షన్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కూడా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్ట్రిప్షన్‌ సాంకేతికత ఉంటుంది. దీని కోసం డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌లో మీరు కాల్‌ చేయాలనుకుంటున్న కాంటాక్ట్‌ క్లిక్ చేసి.. దిగువ కనిపించే‌ కాల్‌ బటన్‌ క్లిక్ చేస్తే సరి. భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను విస్తరించి, గ్రూప్‌ కాల్స్ కూడా మాట్లాడుకునే ఆప్షన్‌ అందిస్తారట. 

ఇక వాటికీ బ్లూటిక్‌ రాదు...

వాట్సాప్‌ వాడకం మొదలైన కొత్తలో ‘బ్లూటిక్స్‌’ గురించి విన్నాం. అవసరమైతే ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసి వాట్సాప్‌ని వాడుతున్నాం. అంటే.. ఎవరైనా పంపిన వాటిని మీరు చదివారని వారికి తెలిసేలా చేసేవే ఈ బ్లూటిక్స్‌. ఒకవేళ వీటిని Read Receiptలో డిసేబుల్‌ చేస్తే బ్లూటిక్స్‌ కనిపించవు. ఇది ఇప్పటి వరకూ కేవలం మెసేజ్‌ల వరకే పరిమితం అయ్యింది. కానీ, ఎవరైనా వాయిస్‌ మెసేజ్‌లు పంపితే వాటికి అప్లై అవ్వదు. మీరు విన్నారనే విషయం బ్లూటిక్స్‌తో వారికి తెలిసిపోతుంది. ఇప్పుడు యాపిల్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో వాయిస్‌ మెసేజ్‌లకు కూడా బ్లూటిక్స్‌ కనిపించవు. దీంతో మీరు వాయిస్‌ క్లిప్‌ని విన్నారనే విషయం వారికి తెలియదన్నమాట. ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసేందుకు యాపిల్‌ యూజర్లు వాట్సాప్‌లోని Settings > Account > Privacy  విభాగంలోకి వెళ్లండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని