Scam calls: ఆ కాల్స్‌ను నమ్మితే స్కామే... మరేం చేయాలంటే!
స్కామ్ కాల్స్‌కు జవాబిచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు స్కామ్ కాల్స్‌ను ఎలా గుర్తించాలి
స్పామ్ కాల్స్ ఎంత డేంజరో, స్కామ్ కాల్స్ ఇంకా అంతకంటే డేంజర్. గతేడాది వీటితో మీలో కొంతమంది ఇబ్బంది పడే ఉంటారు. కొత్త ఏడాదిలో అయినా వాటితో ఇబ్బంది పడొద్దు అనుకుంటే... కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూసేయండి... జాగ్రత్తగా ఉండండి. స్కామ్‌లకు బలవ్వకండి. మరి స్కామ్ కాల్స్‌ను ఎలా గుర్తించాలంటే...
బహుమతి గెలుచుకున్నారు...
స్కామ్‌కు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వాడే పదం ‘మీరు కొంత డబ్బును, బహుమతిని గెలుచుకున్నారు. దాని కోసం కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది’అని మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టిస్తారు. ఇది నమ్మి వారికి డబ్బు చెల్లిస్తే అంతే సంగతులు. అసలు ఎవరూ ఉచితంగా డబ్బు ఆఫర్ చేయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటువంటి స్కామ్ కాల్స్‌ను నమ్మకుండా వెంటనే ఫోన్ కట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ఫారెన్ లాటరీ వచ్చింది...
‘ఒకవేళ మీరు టికెట్ కొన్నట్లయితే పెద్ద లాటరీని పొందుతారు’అని కాల్‌నాగులు కాటేస్తారు. అలాంటి ఫోన్ వచ్చినట్లయితే గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అలా మీరు కొన్న టికెట్ మీ దగ్గరికి రాదు. లాటరీ రాదు. కాబట్టి ఇటువంటి స్కామ్ కాల్స్‌ను తొందరగా రిజక్ట్ చేయాలి.
బోనస్, గిఫ్ట్ అప్పుడే...
ఏదైనా వస్తువు కొన్నట్లయితే బోనస్‌తో పాటు ఫ్రీగా కానుక కూడా వస్తుందని తరచూ సైబర్ నేరగాళ్లు ఫోన్స్ చేస్తుంటారు. వారి ఉచ్చులో పడకుండా ఉండాలంటే నో థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేయడమే మంచిది.
పన్ను కట్టాల్సిందే...
ఇటీవల ‘మీరు చెల్లించాల్సిన పన్ను బకాయిలు అలానే ఉన్నాయి. వెంటనే బాకీ ఉన్న డబ్బును కట్టేయండి’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ అధికమయ్యాయి. కాలర్స్ ఫోన్ చేసి డబ్బు చెల్లించాల్సిందేనని దూకుడుగా మాట్లాడుతారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బులు కట్టకపోతే లీగల్‌గా వెళ్తామని.. చాలా సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని బెదిరిస్తారు. అయితే, ఒకవేళ మీరు ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎప్పటికీ అలా బెదిరింపు కాల్స్ చేయదు. నేరుగా ఇంటికే కట్టాల్సిన వివరాలను లెటర్ రూపకంగా పంపిస్తోందని గుర్తుంచుకోవాలి.
ఫోన్ రింగ్ అయ్యి కట్ అయితే...
మన మొబైల్స్‌కు ఒకసారి ఫోన్ వచ్చి వెంటన్ కట్ అయిపోతుంది. సంబంధిత నెంబరుకు తిరిగి కాల్ చేస్తే కనుక మీరు స్కామ్ ఉచ్చులో చిక్కుకున్నట్లే లెక్క. మిమ్మల్ని అలాగే లైన్‌లో పెట్టి ఏదో రికార్డును వినిపిస్తూ ఉంటారు. ఆ క్షణంలో మీ ఖాతాలోంచి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి అన్‌నోన్ నెంబరు నుంచి మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయకపోవడమే మంచిది.
112 గుర్తుందా...
మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ మోసానికి గురైందని దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని భయాందోళనకు గురి చేస్తారు. డబ్బును భద్రపరచుకోవాలని ఉచిత సలహాలు ఇస్తారు. ఇటువంటి కాల్స్ వచ్చినపుడు ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే 112 నెంబర్‌కు కాల్ చేయడం గానీ, సంబంధిత బ్యాంకును సంప్రదించడం గానీ చేయాలి.
కంప్యూటర్‌లో వైరస్...
స్కామ్ కాలర్స్ మైక్రోసాఫ్ట్ లేదా ఇతర సాప్ట్‌వేర్ కంపెనీ నుంచి కాల్స్ చేస్తున్నామని చెప్పి మీ కంప్యూటర్లను ఫిక్స్ చేయాలని నమ్మబలుకుతారు. కంప్యూటర్లలో ప్రమాదకర వైరస్ చేరిందని చెప్పి అందులోని సమాచారాన్ని లూటీ చేస్తారు. ఏ సాప్ట్‌వేర్ కంపెనీ ఇలా ఫోన్ చేయదని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
రివార్డ్ పాయింట్స్..
క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ పేరుతో మెసేజ్ రూపంలో లింక్ పంపి ఖాతాలో నగదును మాయం చేస్తారు. ఒకవేళ వారి మాటలను నమ్మి ఖాతాకు సంబంధించిన వివరాలను పంపించినట్లయితే డబ్బు పోయాక కంగుతినడం మీ వంతు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖాతా వివరాలను బహిర్గతం చేయకపోవడం మంచిది. అంతేకాకుండా ఏ బ్యాంకు కూడా ఫోన్ చేసి ఓటీపీ, ఖాతా వివరాలు అడగదని గుర్తుంచుకోవాలి.
ప్రశ్నలకు జవాబివ్వకపోతే..
మీరు ఎన్ని ప్రశ్నలు అడిగిన కాలర్స్ నేరుగా సమాధానమివ్వకుండా దాటవేయడానికి ప్రయత్నిస్తారో అది కచ్చితంగా స్కామ్ కాల్ అని గుర్తించాలి. చట్టబద్ధమైన కంపెనీలు, ప్రభుత్వాలు మన సందేహాలకు తప్పనిసరిగా సమాధానమిస్తాయి. స్కామ్ కాలర్స్ మాత్రం మీరు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి డబ్బు దోచే ప్రయత్నం చేస్తారు.
వ్యారెంటీ ముగుస్తోందంటూ...
కారు ఉన్నవాళ్లని గుర్తించి వారిని టార్గెట్ చేస్తారు. మీ కారు వ్యారెంటీ గడువు ముగియబోతోందని చెప్పి వ్యారెంటీని పొడిగించే కార్డు వారి దగ్గర ఉందని నమ్మిస్తారు. దానికోసం వెంటనే డౌన్‌పేమెంట్ కట్టాలని డిమాండ్ చేస్తారు. దాన్ని ఎలాగైన మీకు అమ్మాలని ప్రయత్నిస్తారు. మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. ఇలాంటి మాటలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీ కారు వ్యారెంటీ గడువు గురించి తెలుసుకోవాలంటే కంపెనీ మ్యానుఫాక్చరింగ్ గానీ కారు డీలర్ షిప్ వాళ్లకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు.
లేకపోతే అరెస్టు అవుతారు..
యూజర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి ‘మీరు త్వరలో అరెస్టు అవుతారు’ అని హెచ్చరిస్తూ ఫోన్ చేస్తారు. గాంభీర్యమైన గొంతుతో మాట్లాడి భయాందోళనకు గురిచేస్తారు. అనంతరం డబ్బులు చెల్లిస్తే అరెస్టు చేయకుండా ఉంటామని చెబుతారు. ఏ తప్పు చేయనపుడు భయపడాల్సిన పనిలేదని ముందుగా మనం తెలుసుకోవాలి. అలాంటి బెదిరింపుల కాల్స్‌కు భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాలి.
ఇవేకాకుండా చారిటబుల్ ట్రస్టుకు మనీ కలెక్ట్ చేస్తున్నామని, ఇన్వెస్ట్‌మెంట్ పెడితే బాగా ప్రాఫిట్ వస్తుందని, క్రెడిట్/డెబిట్ కార్డు నెంబరు కావాలని.. ఇలా చాలా రకాల టెక్నిక్స్‌తో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మాయమాటలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎవరి నుంచైనా ఫోన్ వస్తే డెబిట్/క్రెడిట్ కార్డు నంబర్లు, ఓటీపీ వివరాలను చెప్పవద్దని పదేపదే పోలీసులు హెచ్చరించినా కాల్‌నాగుల కాటుకు చాలా మంది బలి అవుతూనే ఉన్నారు. కావున ఇకనైనా మేలుకొని మోసాలను గుర్తించినట్లయితే డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్