వాట్సాప్‌: తెలియకుండా స్టేటస్‌ చూడొచ్చు

స్టేటస్‌ చూసినవారి జాబితాలో మీ పేరు ఉండకూడదనుకుంటే... 

Updated : 12 Aug 2022 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వాట్సాప్‌లో మీ స్టేటస్‌ ఎవరెవరు చూశారనేది ఎలా చూడాలో తెలుసా? ఏముంది... వాట్సాప్‌లో స్టేటస్‌ ట్యాబ్‌కి వెళ్లి అందులో మన స్టేటస్‌కు దిగువన ఉన్న ‘కన్ను’ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ఎవరెవరు చూశారో తెలిసిపోతుంది. ఇక్కడే ఓ మతలబు ఉంది. కళ్లకు కనిపించేదంతా నిజం కాదు అన్నట్లు... ఆ లిస్ట్‌లో లేని వాళ్లు కూడా మీ వాట్సాప్‌ స్టేటస్‌ని‌ చూసి ఉండొచ్చు. అవునా.. అదెలా సాధ్యం అంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇందులోని ట్రిక్‌ పాటిస్తే... మీకూ ఆ అవకాశం దక్కుతుంది. 

రెండేళ్ల కిందట వాట్సాప్‌ స్టేటస్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫొటోలు, వీడియోలు, అక్షరాల రూపంలో స్టేటస్‌లు పెట్టొచ్చు. అప్‌లోడ్‌ చేసిన స్టేటస్‌ 24 గంటలపాటు ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. ఇదీ స్టేటస్‌ సంగతి. ఇక ముందుగా అనుకున్నట్లు స్టేటస్‌ చూసినా కూడా లిస్ట్‌లో కనిపించకుండా ఏం చేయాలంటే... వాట్సాప్‌లో బ్లూ టిక్‌ ఆప్షన్‌ గుర్తుంది కదా, దానిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. మీరు మెసేజ్‌ అవతలి వ్యక్తి చదివాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ బ్లూటిక్‌ ఆప్షన్‌ ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. ఆ ఆప్షన్‌ స్టేటస్‌కి కూడా పని చేస్తుంది. ఆ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే మీరు స్టేటస్‌ చూసినట్లు అవతలి వ్యక్తికి తెలియదు. అయితే మీ స్టేటస్‌లు‌ ఎవరెవరు చూశారనేది కూడా మీకు తెలియదు. దీనికి మీరు ఓకే అనుకుంటే... ఆ ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకోవచ్చు. అవతలి వ్యక్తి స్టేటస్‌ చూసినవారి లిస్ట్‌లో మీ పేరు రాకుండా చేయొచ్చు. 
ఇలా చేయాలి... 
* వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేయాలి -> టాప్‌ రైట్‌లో ఉన్న మూడు చుక్కలు క్లిక్‌ చేయాలి - > సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి -> అందులోని అకౌంట్‌ ఆప్షన్‌లోని‌ ప్రైవసీకి వెళ్లాలి -> రీడ్‌ రిసిప్ట్‌ను ఆఫ్‌ చేయాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని