అందుకే ఛార్జర్‌.. ఇయర్‌పాడ్స్‌ ఇవ్వలేదంట..!

ఐఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. గత వారం వర్చువల్ ఈవెంట్ ద్వారా యాపిల్ ఐఫోన్‌ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ముందు నుంచి వినిపించిన ఊహాగానాలను నిజం చేస్తూ...

Updated : 12 Aug 2022 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. గత వారం వర్చువల్ ఈవెంట్ ద్వారా యాపిల్ ఐఫోన్‌ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ముందు నుంచి వినిపించిన ఊహాగానాలను నిజం చేస్తూ యూఎస్‌బీ అడాప్టర్‌, ఇయర్‌పాడ్స్‌ను బాక్స్‌ నుంచి తొలగించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ యాపిల్ వాదన మరోలా ఉంది. కంపెనీ పర్యావరణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. అందులో భాగంగా ఛార్జర్‌, ఇయర్‌పాడ్స్‌ను తొలగించినట్లు చెప్పుకొచ్చింది. దీని ద్వారా 70 శాతం మేర ప్యాకింగ్ కెపాసిటీని తగ్గించి వాటికి బదులు మరిన్ని డివైజ్‌లను ట్రాన్స్‌పోర్ట్‌ చెయ్యొచ్చని యాపిల్‌ చెబుతోంది. దాని వల్ల సరఫరా కోసం ఎక్కువ వాహనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదట. అలా వాహన వినియోగం తగ్గించడం ద్వారా ఏటా సుమారు రెండు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని యాపిల్ చెబుతోంది. ఇది సుమారు 4,50,000 కార్లు రోడ్లపై విడుదల చేసే కర్బన ఉద్గారాలకు సమానమట. 

దాంతో పాటు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఈ-వేస్ట్‌ను తగ్గించాలని యాపిల్ భావిస్తోంది. ఏటా ఫోన్‌ ఛార్జర్లు, ఇతర యాక్ససరీస్ వల్ల సుమారు 51,000 టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోందట. దీన్ని తగ్గించడంలో భాగంగానే ఛార్జర్‌ ఇవ్వలేదని యాపిల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల ఐఫోన్ ఛార్జర్లు, 700 మిలియన్ల ఇయర్‌పాడ్స్‌ ఉన్నాయని, తమ నిర్ణయంతో ఐఫోన్‌ కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని యాపిల్ ఐఫోన్ 12 విడుదల సందర్భంగా ఆ కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌ నుంచి ఐఫోన్‌కి మారేవారి దగ్గర యూఎస్‌బీ-సీ టైప్ పవర్ అడాప్టర్స్‌ ఉంటాయని, అవి ప్రతి ఐఫోన్‌తో వచ్చే యూఎస్‌బీ-సీ-లైటెనింగ్‌ ఛార్జింగ్‌ కేబుల్‌కు సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. అలానే యాపిల్ మాక్ కంప్యూటర్లు, టాబ్‌లు, ఐపాడ్‌ల ఛార్జర్లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఛార్జర్స్‌, ఐపాడ్స్‌ కొత్తవి కావాలనుకునే వారి కోసం గతంలో కంటే తక్కువ ధరకే వాటిని విక్రయించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని