Published : 10 Dec 2020 19:07 IST

ఈ యాప్స్‌ ఉంటే... పని భలే సులువు

ఇంటర్నెట్ డెస్క్‌: పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరిగెత్తాలి. ఏదైనా పనిని ఎంచుకుంటే ఎంత వేగంగా చేస్తున్నాం, ఎంత స్పష్టంగా చేస్తున్నాం అన్నది గమనించుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగలిగేలా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఈ క్రమంలో టెక్నాలజీ సహాయం తీసుకుంటే మన లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతాం. మీరు చేయాల్సిన పనుల్ని సమన్వయం చేసుకోవడానికి కొన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం!

టుడూయిస్ట్‌..


ఒకే సమయంలో ఎక్కువ పనులు చేసేవారికి టుడూయిస్ట్‌ ఉపయోగపడుతుంది. చేసే పనినంతా ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాజెక్టు వర్కుల దగ్గర్నుంచి, ఆలోచనలు, చేయాల్సిన పనుల వరకు అన్నింటినీ ఒకే వేదిక మీద క్రమపద్ధతిలో ఉంచుతుందీ యాప్‌. ముఖ్యమైన వ్యక్తుల వివరాలు, ఈ-మెయిల్స్‌, అవసరమైన వెబ్‌సైట్లు తదితర వివరాలను క్రమపద్ధతిలో చేర్చుకోవచ్చు. వాటిని ట్రాక్‌ చేసుకోవడమూ సులభం. 


ఫ్రీమైండ్‌.. 

కొత్త పనికి శ్రీకారం చుట్టాలంటే దాని వెనుక మెదడులో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ క్రమంలో రకరకాల ఆలోచనలను అప్పటికప్పుడు ఎక్కడో ఒకచోట రాస్తాం. కానీ కావలసినపుడు అవి కనిపించవు. ఇటువంటి పరిస్థితుల నుంచి ఫ్రీమైండ్ యాప్‌‌ మిమ్మల్ని బయటకు తెస్తుంది. ఆలోచనలన్నింటినీ ఒక చోట చేర్చి క్రమపద్ధతిలో ఉంచుతుంది. దాంతోపాటు ఆ వివరాలు గ్రాఫ్‌లు, చిత్రాల రూపంలో అందిస్తుంది. పనిని సులభతరం చేస్తుంది. ఆలోచనల ఆధారంగా అనేక రకాల గ్రాఫ్‌లను ఈ యాప్‌లో తయారు చేసుకోవచ్చు.


ఎవర్‌నోట్..

మీ కంప్యూటర్‌ మొత్తం పూర్తి చేయని ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలతో రాసిన నోట్లు, రకరకాల ఫైల్స్‌తో నిండి పోయిందా? ఎన్నిసార్లు క్రమబద్దం చేసినా మళ్లీ అదే పరిస్థితా? ఏ ఫైల్‌ను ఏ పేరుతో ఎక్కడ సేవ్‌ చేశారో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎవర్‌నోట్ యాప్‌‌ మీ కోసమే. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మన రెండో మెదడులాగా పనిచేస్తుంది. దీంట్లో మీరు నోట్సులు రాసుకోవచ్చు, డాక్యుమెంట్లు తయారు చేయొచ్చు, బ్లాగులు, ప్రాజెక్టులు రాసుకోవచ్చు. ఈ యాప్‌లో వెతకాలనుకున్న ఫైల్‌ను త్వరగా కనిపెట్టొచ్చు. అంతేకాకుండా ఫైల్‌ మిస్సవ్వకుండా ఎడిట్‌ చేసుకోవచ్చు. 


ఫోకస్‌ రైటర్‌..

స్నేహితుల వద్ద నుంచి మెసేజ్‌, మెయిల్‌ వచ్చినపుడో, ఏవైనా ఈ-కార్ట్‌ సైట్ల నుంచి ఆసక్తికర ఆఫర్లు నోటిఫికేషన్‌ రాగానే.. వెంటనే చేస్తున్న పని నుంచి ధ్యాస అటువైపు మళ్లిపోతుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకు ఫోకస్‌ రైటర్ యాప్‌‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ స్క్రీన్‌ మొత్తం తన అధీనంలో ఉంచుకొని ఎటువంటి నోటిఫికేషన్లు రాకుండా చూస్తుంది. ఒకవేళ వేరే ప్రోగ్రామ్‌లోకి వెళ్లాలి అంటే ఈ యాప్‌ను కచ్చితంగా క్లోజ్‌ చేయాలి. అలా ఎలాంటి డిస్ట్రబెన్స్‌ లేకుండా మీ పనిని పూర్తి చేసుకోవచ్చు. 


 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని